విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, గిరిజన , మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జరిగిన ఎరుకల సాధికారిక పథకం ప్రారంభోత్సవానికి, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాలైన ఎరుకల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎరుకల సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా ఎరుకుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులను అందజేసినట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఎరుకలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కేంద్రం ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా ఎరుకలకు సొసైటీలను ఏర్పాటు చేయడం, స్లాటర్ హౌసులు ఏర్పాటు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, ఆన్లైన్ వ్యాపార మేలుకువలు, తదితరాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎరుకుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం తీసుకోవాలి రావాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పట్టుపట్టి ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. రూ .60 కోట్లతో ఎరుకల సాధికారత పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఎరుకల కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన ఎరుకల కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఎమ్మెల్సీగా చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించి ప్రతిపాదనలు పంపినప్పటికీ గవర్నర్‌ను అడ్డు పెట్టుకొని బిజెపి నాయకులు సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరుకల సాధికారత పథకం మొట్టమొదటిగా మెదక్ జిల్లాలో అమలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎరుకల కులస్తులు వ్యాపార మెలకువలు నేర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ట్రైకా చైర్మన్ రాంచందర్ నాయక్, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి , డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు , జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ , వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి , జిల్లా కలెక్టర్ రాజర్షి షా , అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ ఏం ఎల్ ఏ సత్యనారాయణ , ఎరుకల సంఘం నాయకులూ , మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ , ఎరుకల నాయకులు కూతాడి రాములు, రాజు , కే నర్సింలు , వివిధ జిల్లాల ఎరుకల సంఘాల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మెదక్ లో సఖి కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్,మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లు ప్రారంభించారు.