గో బ్యాక్ హరిప్రియ

  • Publish Date - November 3, 2023 / 04:03 PM IST
  • బీఆరెస్ అభ్య‌ర్థికి నిర‌స‌న సెగ‌
  • బయ్యారం మండలానికి ఏం చేశారు?
  • నిలదీసిన కంబాలపల్లి ప్రజలు
  • గ్రామంలో రావద్దంటూ తీర్మానం
  • వెనుదిరిగిన‌ ఎమ్మెల్యే హరిప్రియ

విధాత ఇల్లందు: మండ‌లానికి ఏమీ చేయ‌ని ఎమ్మెల్యేకు ఎన్నిక‌ల‌ప్పుడే మేం గుర్తుకువ‌చ్చామా? అని బ‌య్యారం మండ‌లం కంబాల‌ప‌ల్లి గ్రామ‌స్తులు ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అధికార పార్టీ అభ్య‌ర్థి, సిటింగ్ ఎమ్మెల్యే హ‌రిప్రియ గురువారం రాత్రి కంబాల‌ప‌ల్లికి వ‌చ్చారు. ఈ స‌మయంలో ఆమె రాక‌ను అడ్డుకున్న గ్రామ‌స్థులు.. ఎమ్మెల్యేగా ఉండి బ‌య్యారం మండ‌లానికి ఏం చేశార‌ని నిల‌దీశారు. గ్రామంలోకి రానిచ్చేది లేద‌ని తీర్మానించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేయ‌డంతో చేసేదేమీలేక హ‌రిప్రియ వెనుదిరిగారు.

బయ్యారం ఏమైంది?

రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ పొందపరిచి ఉంది. కేంద్రం ముందుకు రాకపోతే మేమే ఏర్పాటు చేస్తామంటూ 2018 ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇల్లందులో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీను ప్రజలు అడుగుతున్నారు. దీనికి ప్ర‌జాప్ర‌తినిధులు స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ జరిగిన మండలం బయ్యారమే. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయితే 15 వేల మందికి ప్రత్యక్షంగా, మ‌రో 15 వేల మంది పరోక్షంగా ఉపాధి ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయి. అపార ఖ‌నిజ సంపద ఉన్నప్పటికీ కేంద్రం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్పిన హామీ ఏమైందంటూ నిలదీస్తున్నారు. ఒక్క బయ్యారం మండలంలోని నాలుగు గ్రామాల్లో గ్రామస్తులు ఆందోళన చేస్తూ గో బ్యాక్ అని చెప్పారు. సీతారామా ప్రాజెక్టు విష‌యంలోనూ ఇల్లెందు ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న‌ది. వీటిపై ఎమ్మెల్యేను ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీస్తున్నారు.