విధాత : కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లోనూ దొంగలు ఉంటారని, ఆ దొంగలు ఎప్పుడు సీఎంలుగా కాలేరని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్.షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోటస్ పాండ్‌లో విలేఖరులతో మాట్లాడిన షర్మిల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొంగ అని సుప్రీంకోర్టు చెప్పిందని, కేసు డిస్మిస్ కోసం కోర్టుకెళ్తే రేవంత్ రెడ్డి దోషి అని న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి అని అంటున్నారని, ఆ పేరు నేను పెట్టింది కాదన్నారు.
అన్ని పార్టీలో దొంగలు ఉంటారని ఆ దొంగలు ఎప్పుడూ సీఎంలు కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే తమ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిందన్నారు. ఎవరో వచ్చి మాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవట్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది నిజమని దానికోసం ప్రచారం కూడా చేస్తానని వెల్లడించారు. కొన్ని కారణాల వాళ్ళ కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని అనుకున్నామని, కొంత మంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీ విలీనం కాకుండా అడ్డుకున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
లెఫ్ట్ పార్టీల దగ్గరకు వెళ్లి మద్దతు అడుగుతున్న కాంగ్రెస్ నేతల్లో కొందరికి పదవి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన షర్మిల ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డిని విమర్శించడం పట్ల రెండు పార్టీల శ్రేణుల్లోనూ షర్మిల తీరుపై గందరగోళం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అడ్డుపడ్డారన్న కోపంతోనే ఆమె రేవంత్ టార్గెట్‌గా విమర్శలు చేశారని భావిస్తున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో చెప్తున్నారని, ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు తాను పార్టీ పెడితే తెలంగాణాలో షర్మిలకు ఏం సంబంధం అని సజల్జ అన్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలతో తనకు సంబంధం ఉందని సజ్జల ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిదని, తెలంగాణ గురించి వాళ్లకు అనవసరమన్నారు.