సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విధాత, హైదరాబాద్ : అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి నికృష్టంగా మాట్లాడారని, ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు జరిగింది కాదని, తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా సీఎం రేవంత్‌రెడ్డి నోరు పారేసుకున్నారన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. ఈ సీఎం అన్‌ఫిట్ సీఎం అని విమర్శించారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తదన్నారు. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలన్నారు. ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లని కొనియాడారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయమన్నారు. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారని భట్టిపై ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా అని, సీఎంను ఏకవచనంతో మాట్లాడినం అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నామని, అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారమన్నారు. ముఖ్యమంత్రి సిగ్గు, బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో అని, అడ్డగోలుగా మాట్లాడి సీఎం రేవంత్‌రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు.