Singur reservoir । భారీ వర్షాలకు నిండిన సింగూరు జలాశయం

ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో జెన్ కో ద్వారా 2822 క్యూసెక్కులు, రెండు గేట్ల ద్వారా 16284 క్యూసెక్కుల నీటిని మొత్తం 19106 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

Singur reservoir । విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సింగూర్ ప్రాజెక్టు (Singur project) నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha).. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు (water was released). ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు 4,6 నంబర్ల రెండు గేట్లను 1.50 మీటర్ల పైకెత్తి 16284   క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

 

ప్రస్తుతం ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో జెన్ కో ద్వారా 2822 క్యూసెక్కులు, రెండు గేట్ల ద్వారా  16284 క్యూసెక్కుల నీటిని మొత్తం 19106 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టు నిండు కోవడం వలన ఆయకట్టు రైతంగానికి ఈ ఏడాది రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని  అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టని చేరుకొని జలకళ సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండల మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులో  మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.

 

అనంతరం బస్వాపూర్  మోడల్ స్కూల్‌ను (Baswapur Model School) సందర్శించారు.  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (Dr. Sarvepalli Radhakrishnan) జన్మదినోత్సవాన్ని  పురస్కరించుకొని   మోడల్ స్కూల్  ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని  (Guru Pujotsava program) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని ఆయన అన్నారు.నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని  మంత్రి  పరిశీలించారు . పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల  ప్రిన్సిపల్ జ్యోతి మంత్రి దృష్టికి  తెచ్చారు. నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న  పనులు నాణ్యత పాటించి  వేగవంతంగా, పూర్తి చేయాలని అధికారులను మంత్రివర్యులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో   నీటి పారుదల శాఖ అధికారులు  కె. ధర్మ, భీమ్, నాగరాజు, ఆర్డీవో పాండు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.