విధాత, హైదరాబాద్:
One Nation One Election | దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున నిధుల దుబారాతో పాటు విలువైన సమయం వృథా అవుతుందనేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల వాదన. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయనే వాదనను కూడా బీజేపీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. ఒకేసారి ఎన్నికలతో ఓటు వేయడానికి ప్రజలు తరచూ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కూడా చెబుతున్నారు.
అయితే.. జమిలి ఎన్నికలతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్యధిక జనాభా కలిగిన దేశంలో.. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. పైగా.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై లేనిపోని అనుమానాలు వస్తాయనే వాదనలను ప్రతిపక్ష పార్టీలు తీసుకువస్తున్నాయి. మెజారిటీ లేక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి, గడువులోపే ప్రభుత్వాలు దిగిపోతే జమిలి లక్ష్యం దెబ్బతింటుందంటుందని చెబుతున్నారు. జమిలితో జాతీయ పార్టీలకు మేలు జరుగుతుందని, ప్రాంతీయ పార్టీలకు ఎదురు దెబ్బ తగులుతుందని పేర్కొంటున్నారు. ఈ వాదనలు ఇలా ఉంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదముద్ర వేసుకుంటున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలేంటి? సాధ్యాసాధ్యలపై ఒకసారి పరిశీలిద్దాం.
పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తరువాత పలు సిఫారసులు చేసింది. మొత్తం 18వేల పేజీలతో తయారైన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. కోవింద్ కమిటీ సిఫారసులను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దేశంలో 47 రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని నివేదికలో రాశారు. 2029లోపు రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్‌కు సవరణలు చేసి.. ‘ఒకే దేశం… ఒకే ఎన్నిక’ కు వెళ్లవచ్చని కమిటీ తెలిపింది.
నిజానికి జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలపై రాంనాథ్ కోవింద్ నాయకత్వాన ఏర్పడిన కమిటీలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా సభ్యుడు. అయితే.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై సిఫారసులు చేయడం కాకుండా.. దాని అమలుకు కమిటీ మార్గాలు సూచించాలన్న నిబంధనతో.. ఆ కమిటీ నుంచి అధిర్ రంజన్ తప్పుకొన్నారు. ప్రతిపక్ష టీఎంసీ, డీఎంకే, ఆప్ వంటి పార్టీలు కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ, స్థానిక ఆకాంక్షలు అణచివేతకు గురవుతాయనేది ప్రతిపక్షాల ప్రధాన వాదన. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయంగా ప్రాధాన్యం ఉన్న అంశాలు పక్కకు పోయి.. జాతీయ అంశాలు ప్రధానాంశంగా ముందుకు వచ్చి కూర్చుంటాయనే వాదన ఉన్నది. ఫలితంగా చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు తమ ఆలోచనలను దేశ ప్రజల ముందు ఉంచడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో స్వీడన్, జర్మనీ, బెల్జియంతో పాటు మరో నాలుగు దేశాలలో అధ్యయనం చేశారు. తొలి దశలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది. రెండో దశలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు నిర్వహించాలని పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వంద రోజుల లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్రాలలోని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లతో కలిసి ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులను జారీ చేయాలని తన సిఫారసులో పేర్కొన్నది.
ఒకే దేశం ఒకే ఎన్నికను అమల్లోకి తెచ్చేందుకు కనీసం ఆరు రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుంది. దేశంలో ఎన్నికల నిర్వహణ, మార్గదర్శకాలను నిర్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. దీంతో పాటు 6 కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్టికల్స్ ను సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణలు జరగాలంటే పెద్దల సభతో పాటు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
స్థానిక సంస్థల రాజ్యాంగ సవరణకు సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 2024లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం, జనతాదళ్ (యూ) పార్టీల మద్దతుపై ఆధారపడి ఉన్నది. సంకీర్ణ ప్రభుత్వం కావడం వల్ల ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ చట్టం కార్యరూపం దాల్చుతుందా? లేదా? అనే చర్చలు చోటుచేసుకుంటున్నాయి.
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర క్యాబినెట్ ఆమోదం తరువాత 2024 డిసెంబర్ నెలలో లోక్‌సభలో న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఓటు చేశాయి. ఈ బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 39 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంది. జమిలి ఎన్నికల ద్వారా రాజకీయ నియంతృత్వాన్ని ప్రజలపై రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దేశం రాష్ట్రాల యూనియన్ అని, కేంద్రంతో పాటు రాష్ట్రాలు బలంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు గట్టిగా ఆశించారు. బహుళ పార్టీ విధానంలో కేంద్రంలో ఏకైక పార్టీ లేదా సంకీర్ణ పార్టీలు, రాష్ట్రాలలో ప్రాంతీయ లేదా జాతీయ పార్టీలు అధికారంలో కొనసాగే అవకాశం రాజ్యాంగం ప్రసాదించింది. అయితే.. బీజేపీ అనుకున్నట్లుగా జమిలి ఎన్నికలు వస్తే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రపంచంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బ్రిటన్ మినహా అన్ని దేశాలలో బహుళ పార్టీ వ్యవస్థ కొనసాగుతున్న తరుణంలో దేశంలో జమిలి అసాధ్యమంటున్నారు.
అయితే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత వ్యయం అవుతుందో ఒకసారి పరిశీలిద్దాం. లోక్‌సభ ఎన్నికల కోసం రూ.1.20 లక్షల కోట్లు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రూ.3 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా. అదే గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు జమిలి నిర్వహిస్తే కనీసం రూ.10 లక్షల కోట్లు అవుతుందని, వారం రోజుల వ్యవధిలో ప్రక్రియను పూర్తి చేసే రూ.5 లక్షల కోట్ల వరకు అవుతుందని అంటున్నారు. 1952 నుంచి 2019 సంవత్సరం వరకు జరిగిన సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఫలితాల సరళిని పరిశీలిస్తే.. ఓటర్లు జాతీయ అంశాల ఆధారంగా ఓటు వేస్తున్న ధోరణి కనిపిస్తుంది. ఫలితంగా ప్రాంతీయ పార్టీలు ఘోరంగా ఓడిపోయే ప్రమాదముందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే.. ఏక పార్టీ పాలన కోసమే జమిలి ఎన్నికలను బీజేపీ తెరమీదికి తీసుకువచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విధానంతో పార్టీ ఎజెండాను సులువుగా అమలు చేసుకుంటూ.. తమ భావజాలాన్ని దేశం మొత్తం విస్తరింప చేస్తారని ఆరోపిస్తున్నాయి. క్రమంగా ప్రజాస్వామ్యం అంతరించి నియంతృత్వంతో కూడిన అధ్యక్ష తరహా విధానం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ వాదనలు ఎలా ఉన్నా.. రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నాల్లో బీజేపీ గట్టి వ్యూహాలతోనే వ్యవహరిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.
