Jamili Elections | మహిళలు.. వారసులు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దంకండి!

నియోజకవర్గాల పునర్విభజనతో పెరుగనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల స్థానాలు పెరుగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 153కు పెరిగితే మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకారం.. 51 సీట్లు లభిస్తాయి. 175కు చేరితే మహిళా రిజర్వుడు స్థానాలు 60 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్లు అమలు కానుండటంతో రిజర్వేషన్ల స్థానాల సంఖ్య పెరుగనుంది. ఈ మేరకు చట్ట సభలలో ఆయా వర్గాల ప్రాతినిధ్యం పెరుగనుంది.

This is an AI-generated image, used for representational purposes only

హైదరాబాద్‌, విధాత :

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్లమెంట్​, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉండటం.. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేదిగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణన ప్రక్రియను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగానే పూర్తి చేసి, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. జనగణన తర్వాత తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇప్పటికే చట్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో దీనిని అమలు చేయనున్నట్లుగా సంకేతాలిస్తూ.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలతోనే కలిసి నిర్వహిస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. దీంతో తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరుగడం పక్కా అని తేలిపోయింది. ఇదే అంశం వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న రాజకీయ వారసులు, ముఖ్యంగా మహిళా వారసులు ఎన్నికల సన్నాహాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. క్రమంగా పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో పరిచయాలు పెంచుకుంటూ చట్టసభల ప్రవేశానికి బాటలు వేసుకుంటున్నారు.

తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో భారీ మార్పులు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని నిబంధనల మేరకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 నుండి కనీసం 153కు, పార్లమెంట్ స్థానాలు 17 నుండి 23–25 మధ్య పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే.. కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు రానున్నాయి. అయితే జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఈ సంఖ్య 161 నుండి 175 వరకు కూడా వెళ్లే అవకాశం లేకపోలేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. ప్రస్తుత విధానంలో 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ స్థానం ఉంది. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 23 నుండి 25 వరకూ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల సంఖ్యను 8 నుంచి 9 స్థానాలకు పెంచితే అసెంబ్లీ సెగ్మెట్ల సంఖ్య 175కు పెరుగవచ్చంటున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న 153 అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుంది.

జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నాలుగైదు జిల్లాలకు, అసెంబ్లీ నియోజకర్గాలు కూడా రెండు మూడు జిల్లాలకు విస్తరించాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు చేయనున్నారు. పార్లమెంటు నియోజవకర్గాల డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న జనాభా రేషియోనే కొనసాగించవచ్చని తెలుస్తుంది.

పెరుగనున్న రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు

నియోజకవర్గాల పునర్విభజనతో పెరుగనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల స్థానాలు పెరుగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 153కు పెరిగితే మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకారం.. 51 సీట్లు లభిస్తాయి. 175కు చేరితే మహిళా రిజర్వుడు స్థానాలు 60 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్లు అమలు కానుండటంతో రిజర్వేషన్ల స్థానాల సంఖ్య పెరుగనుంది. ఈ మేరకు చట్ట సభలలో ఆయా వర్గాల ప్రాతినిధ్యం పెరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పెరుగనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అనుగుణంగా పార్టీలు, ప్రస్తుత నాయకులు అభ్యర్థులను, వారసులను సిద్దం చేసుకునే పని ప్రారంభించడం ఆసక్తికరం.

18వ లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 13.6 శాతంగా ఉంది. రాష్ట్ర శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యం సగటున సుమారు 9శాతం మాత్రమే ఉంది. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ. అయితే మహిళా రిజర్వేషన్‌తో చట్టసభలలో మహిళల ప్రాతినిథ్యం లెక్కలు మారబోతున్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు 165 వరకు పెరిగితే ప్రస్తుత 19 ఎస్సీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 26 నుంచి 28కు పెరగొచ్చు. 12ఎస్టీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 18 నుండి 20 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సీలకు ఉన్న 3 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు ఉన్న 2 ఎంపీ స్థానాలు రెట్టింపు కావచ్చని విశ్లేషిస్తున్నారు.

డీలిమిటేషన్ తో పెరుగనున్న రాజకీయ వారసులు

డీలిమిటేషన్ కారణంగా పెరుగనున్న లోక్‌సభ సీట్లు, అసెంబ్లీ సెగ్మెంట్‌లకు అనుగుణంగా అభ్యర్థులను రెడీ చేసుకునే క్రమంలో ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకుల కుటుంబాలకు చెందిన వారసులు, సంపన్న వర్గాల ప్రతినిధులు ఎన్నికల బరిలో దిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో చట్టసభలలో వారసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల స్థానాల్లో వారసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

దేశంలోని ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో 21 శాతం (1,107 ) మందికి వారసత్వ రాజకీయ నేపథ్యం ఉండటం గమనార్హం. పురుష ప్రతినిధులలో 18 శాతం మంది వారసత్వ రాజకీయాల వారసులు కాగా.. మహిళా ప్రతినిధులలో ఈ సంఖ్య 47 శాతంగా ఉందని గణంకాలు వెల్లడిస్తున్నాయి. రానున్న కాలంలో రాజకీయ వారసుల సంఖ్య మరింత పెరుగబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest News