Chidambaram | జమిలికి మేం వ్యతిరేకం అది భారత దేశ రాజ్యాంగంపై దాడి: చిదంబరం

Chidambaram | ఇండియా పేరు మార్పు బూటకం సమస్యలపై దృష్టి మళ్లించే చర్యలివి ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్న కేంద్రం జోడో యాత్ర-2 పరిశీలనలోనే ఉంది సనాతన ధర్మం వివాదంలోకి వెళ్లం మీడియా సమావేశంలో చిదంబరం హైదరాబాద్‌, విధాత: ఒకే దేశం ఒకే ఎన్నిక అనే భావనను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం విస్పష్టంగా తిరస్కరించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్లమెంటులో బిల్లు తెస్తే తాము వ్యతిరేకిస్తామని […]

  • Publish Date - September 17, 2023 / 01:17 AM IST

Chidambaram |

  • ఇండియా పేరు మార్పు బూటకం
  • సమస్యలపై దృష్టి మళ్లించే చర్యలివి
  • ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్న కేంద్రం
  • జోడో యాత్ర-2 పరిశీలనలోనే ఉంది
  • సనాతన ధర్మం వివాదంలోకి వెళ్లం
  • మీడియా సమావేశంలో చిదంబరం

హైదరాబాద్‌, విధాత: ఒకే దేశం ఒకే ఎన్నిక అనే భావనను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం విస్పష్టంగా తిరస్కరించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్లమెంటులో బిల్లు తెస్తే తాము వ్యతిరేకిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశాల తొలి రోజు సాయంత్రం ఆయన పార్టీ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, మీడియాతో మాట్లాడారు.

కేంద్రం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నిక రాజ్యాంగంపై దాడిగా చిదంబరం అభివర్ణించారు. ‘మేం దీనిని తిరస్కరిస్తున్నాం. ఇది సమాఖ్యవాదం పై దాడి. జమిలి ఎన్నికకు వెళ్లాలంటే కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. రాజ్యంగసవరణలు చేయడానికి తగిన బలం లేదని బీజేపీ కూడా తెలుసు. అయినా ఈ అంశాన్ని పదే పదే ముందుకు తేవడం అసలు సమస్యల నుంచి దేశాన్ని పక్కదారి పట్టించడం, తప్పుడు కథలు చెప్పమే’ అని ఆయన స్పష్టం చేశారు.

ఇండియా పేరు మార్పు బూటకం

ఇండియా పేరు మార్పు ఒక ఫేక్‌ పని అని కాంగ్రెస్‌ చిదంబరం కొట్టిపారేశారు. ఇండియా నుంచి భారత్‌ అని పేరు మార్చడం ప్రజల దృష్టి మళ్లించడానికే అన్నారు. ఇండియా నుంచి భారత్ అని మార్చినంత మాత్రాన మీ జీవితాల్లో కలిగే మార్పు ఏమైనా ఉన్నదా? మీ పిల్లల జీవితాల్లో మారేది ఏమైనా ఉన్నదా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా బూటకమని స్పష్టం చేశారు.

పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీ లేఖ రాస్తే ఇంత వరకూ స్పందన లేదని చెప్పారు. దాదాపు 15 మంది ఉసురు తీసిన మణిపూర్‌ హింసకు మోదీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగితే కేవలం రెండు నిమిషాలకు మించి ఆయన మాట్లాడలేదని దుయ్యబట్టారు.

జోడో యాత్ర-2 పరిశీలనలో

తూర్పు భారతదేశం నుంచి పశ్చిమానికి భారత్‌ జోడో యాత్ర నిర్వహణపై అడిగిన ప్రశ్నకు చిదంబరం సమాధానమిస్తూ.. సీడబ్ల్యూసీలో పలువురు సభ్యులు ఈ మేరకు ప్రతిపాదనలు చేశారని తెలిపారు. దీనిపై ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదని, పరిశీలనలో ఉన్నదని చెప్పారు. దేశ పరిస్థితుల గురించి ఒక ముసాయిదా తీర్మానంపై సీడబ్ల్యూసీ చర్చలు జరుపుతున్నదని ఆయన వెల్లడించారు.

‘ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. దేశ స్థితి గతులపై మేం చర్చలు జరుపుతున్నాం. స్థూలంగా ఇది రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతోపాటు దేశీయంగా, దేశం వెలుపలి నుంచి ఎదురవుతున్న రక్షణ పరమైన సవాళ్ల గురించి ఉంటుంది’ అని తెలిపారు. ‘రాజకీయ పరిస్థితికి సంబంధించి.. దేశ రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి పెను సవాలు పొంచి ఉందని మేము భావిస్తున్నాం.

సమాఖ్య వాదాన్ని పద్ధతి ప్రకారం బలహీనపరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంకెళ్లు వేస్తున్నారు. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాలను తిరస్కరిస్తున్నారు లేదా తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధులు నిర్వహించనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని చిదంబరం తెలిపారు.

దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న సనాతన ధర్మం వివాదంపై సీడబ్ల్యూసీలో చర్చ జరుగలేదని ఆయన చెప్పారు. ‘సనాతన ధర్మం వివాదంలోకి వెళ్లాలని కాంగ్రెస్‌ భావించడం లేదు. మేం అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని కలిగి ఉంటాం’ అని తెలిపారు.

Latest News