విధాత : తమిళనాడు నూతన సీఎంగా చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. నెహ్రు స్టేడియంలో గవర్నర్ విశ్వనాధ్ అర్లెకర్ విజయ్ తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. అభిమానులు, టీవీకే కార్యకర్తల విజయ్..విజయ్ అంటూ చేసిన నినాదాలు మారుమ్రోగుతుండగా చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ అను నేను అంటూ విజయ్ తమిళంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటిదాక తమిళానాట సీఎంలు రాష్ట్ర సంస్కృతి మేరకు పంచె, షర్ట్ ధరించి ప్రమాణ స్వీకారం చేయగా..విజయ్ అందుకు భిన్నంగా ఫ్యాంట్, షర్టుతో టక్ వేసుకుని బ్లేజర్ ధరించి కార్పోరేట్ అధికారి మాదిరిగా మోడరన్ లుక్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
మంత్రులుగా వీరే
ఎన్. ఆనంద్, అధవ అర్జున్, సెంగొట్టియాన్, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజమోహన్, అరుణ్ రాజ్, టీకే. ప్రభు, ఎస్.కీర్తనీలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖులు
విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మిత్ర పక్ష పార్టీలు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నాయకులు సహా ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కూడా పలువురు హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన పలువురు నటీనటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రత్యేక ఆకర్షణగా త్రిష
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులతో పాటు నటి త్రిష కూడా హాజరుకావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మదర్స్ డే రోజున నా కొడుకు విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం నిజంగా చిరస్మరణీయం అని విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన సీఎం విజయ్
సీఎంగా విజయ్ తన తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ పథకంపై చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన సంచలన నిర్ణయాలు ప్రకటించారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించే పథకంపై తొలి సంతకం చేశారు. మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. షీ టీమ్స్ తరాలు ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ తరహా డ్రగ్ నిరోధక వ్యవస్థ ఏర్పాటుపై మూడో సంతకం చేశారు.
సినిమాలో నన్ను ఉన్నత స్థాయిలో నిలిపారని.. తమ్ముడా అంటూ పిలిచారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్బంగా విజయ్ తెలిపారు. నేను జీవితంలో చాలా కష్టాలు అనుభవించానని, ఆకలి బాధలు ఏమిటో నాకు తెలుసు అన్నారు. నేను మీ కుటుంబ సభ్యుడు లాంటి వాడిని అని, నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా మీరే అండగా ఉన్నారని విజయ్ చెప్పుకొచ్చారు.
ఎన్నికలలో తొలిసారి పోటీతోనే సీఎం పదవి
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాల్లో విజయఢంకా మోగించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోయినా.. కాంగ్రెస్,వామపక్షాలు, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. అలాగే సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అండగా నిలిచారు. దీంతో అసెంబ్లీలో విజయ్ బలం 120కి చేరింది. విజయ్ ఈ నెల 13వ తేదీలోపున అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ నిర్ధేశించారు.
