Simultaneous Elections । దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లు తీసురావాలని నిర్ణయించిందని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభలో ఆ పార్టీ నేత డెరెక్ ఓ బ్రైన్ విమర్శించారు. ఒకే దేశం ఒకే ఎన్నికను ఆయన సామూహిక హనన ఆయుధంతో పోల్చారు. ఈ మేరకు తన బ్లాగ్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక (ONOE)’ ప్రతిపాదన వాస్తవ అంశాలపైన నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, సమాఖ్య వ్యతిరేక విధానాలు, మణిపూర్, పడిపోతున్న రూపాయి విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గినా.. దేశంలో ధరలు తగ్గించకపోవడం వంటి అనేక కీలక అంశాల నుంచి దారిమళ్లించే ప్రయత్నమే. ఇది ఒక సామూహిక హనన ఆయుధం’ అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. ఈ బిల్లును తాము వ్యతిరేకించి తీరుతామని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రూర బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో తుది వరకూ తమ పార్టీ ఎంపీలు పోరాడుతారని ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
గత సంవత్సరం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులాంటిదే ఇది కూడానని ఓ బ్రైన్ పేర్కొన్నారు. ‘టెలివిజన్ల ప్రైమ్ టైమ్‌లో ఇదే వార్త (ఒకే దేశం ఒకే ఎన్నిక) నడుస్తున్నది. మణిపూర్ సంక్షోభం విషయంలో ప్రభుత్వం విఫలమైన అంశం పక్కకు పోయింది’ అని ఆయన రాశారు. ‘మహిళా రిజర్వేషన్ బిల్లు జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తయ్యాకే అమల్లోకి వస్తుంది. అంటే.. దాదాపు 2034లో’ అని ఆయన తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దానితోపాటే అసెంబ్లీలు కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలను సైతం సవరించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే.. మొత్తం సభ్యుల్లో సగానికి పైగా అంటే.. స్పెషల్ మెజార్టీ అవసరమని పేర్కొన్నారు. దానితోపాటు మూడింట రెండు వంతులకు తగ్గకుండా సభ్యలు హాజరై, ఓటింగ్ చేసిన మెజార్టీ రాష్ట్రాల తీర్మానాలు కూడా అవసరమని తెలిపారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆర్టికల్ 324ఏకు సవరణ చేసేందుకు సగానికి పైగా అసెంబ్లీలు ఆమోదం తెలపాలని ఆర్టికల్ 368 (2) పేర్కొంటున్నదని ఆయన పేర్కొన్నారు. ఒకే ఓటరు జాబితా రూపకల్పనకు ఆర్టికల్ 325కు సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, రాష్ట్ర ప్రభుత్వాలను నేరుగా ప్రభావితం చేసేదైనప్పటికీ.., వాటిని మెజార్టీ రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉన్నప్పటికీ ఉన్నత స్థాయి కమిటీలో ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రినిగానీ, రాష్ట్రాల ప్రతినిధులను కానీ చేర్చలేదని డెరెక్ ఓ బ్రైన్ విమర్శించారు. ఐడీఎఫ్‌సీ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77 శాతం ఓటర్లు కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉన్నదని తేలిందని ఆయన పేర్కొన్నారు.