Bill Gates | బాలలపై లైంగిక నేరాలు కేసులలో నిందితుడు జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్ ఫైల్స్ బయటకు రావడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గతంలో చేసిన తప్పులు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు రష్యన్ మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆయన అంగీకరించక తప్పలేదు. అయితే.. వీరిద్దరికీ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన పేర్కొనడం సంచలనం రేపుతోంది. అయితే ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కలిగి ఉండడం మూలంగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని, ఇది చాలా తీవ్రమైన తప్పిదమని గేట్స్ వ్యాఖ్యానించారు. తాను ఏ అక్రమం చేయలేదని, ఏ విధమైన అక్రమం తనకు కన్పించలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
బిల్ గేట్స్… టౌన్ హాలులో జరిగిన గేట్స్ ఫౌండేషన్ సిబ్బంది సమావేశంలో మాట్లాడారు. సంస్థకు సంబంధించిన అంశాలపై ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ఉద్యోగులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన కేసులో నేరస్తుడు ఎప్‌స్టీన్‌తో గడపడం పెద్ద తప్పిదంగా గేట్స్ వర్ణించారు. గేట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా ఆయనకు పరిచయం చేశానని తెలిపారు. తన చర్యలకు తానే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో గేట్స్ ఫౌండేషన్ ఒక స్టేట్ మెంట్ విడుదల చేస్తూ, ఎప్‌స్టీన్‌తో కానీ ఆయన ఉద్యోగులతో కానీ ఫౌండేషన్ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదని స్పష్టం చేసిన విషయం విదితమే. గత వారం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026కు ప్రపంచం నలుమూలల నుంచి టెక్ కంపెనీ యజమానులు, సీఈవోలు, ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కూడా వచ్చారు. ముందస్తు ఆహ్వానం ప్రకారం గేట్స్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 లో కీలకోపన్యాసం చేయాల్సి ఉంది. కానీ.. గేట్స్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరు కావడం లేదని, కీలక ఉపన్యాసం కూడా చేయడం లేదని గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన జాబితా అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ కు ఇచ్చిన ఆహ్వానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమీక్షించిందనే ప్రచారం సమ్మిట్ లో జరిగింది.
యూఎస్ ఫైనాన్షియర్, బాలల లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్ ఫైల్స్ వివరాలను ఇటీవలే యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ 300 మంది ప్రపంచ ప్రముఖుల పేర్లను వెల్లడించడం సంచలనం కలిగించింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేరు బయటకు రావడం టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Read Also |
Odisha Mining Officer : ఒడిస్సా విజిలెన్స్ వలకు అతిపెద్ద అవినీతి తిమింగలం!
Rythu Bharosa | రైతు భరోసా ఆలస్యంపై రగిలిపోతున్న రైతాంగం!Youtuber Komali | హైదరాబాద్‌లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య… రాయదుర్గం పరిధిలో విషాద ఘటన
