డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ బాగా పడిపోతుందని మనం తరచుగా వింటుంటాం. అసలు రూపాయి విలువ పడిపోవడం అంటే ఏంటి? దీంతో లాభ, నష్టాలు ఏంటి? దిగుమతులు, ఎగుమతులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ధరలపై కూడా దీని ప్రభావిం ఉంటుందా? తెలుసుకుందాం.
రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది?
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్‌లు, బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఈ రకంగా ఇండియాలోకి విదేశీ కరెన్సీని తీసుకువస్తారు. అలా భారత రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. ఈ పెరిగిన డిమాండ్ రూపాయిని బలపరుస్తుంది. దీనికి విరుద్ధంగా అంటే పెట్టుబడిదారులు భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు రూపాయిని విదేశీ కరెన్సీగా అంటే గా డాలర్లుగా మారుస్తారు. డాలర్లకు పెరిగిన డిమాండ్ రూపాయిని బలహీనపరుస్తుంది. 2025 డిసెంబర్ 1 నాటికి డాలర్ తో రూపాయి మారకం విలువ 89.52 రూపాయాలకు చేరుకుంది. వాణిజ్య లోటు గణనీయంగా పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు తరలిపోవడంతో రూపాయి బలహీనపడిందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నార2025 అక్టోబర్‌లో భారతదేశం ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా 41.7 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును చూసింది. అదే సమయంలో బంగారం దిగుమతులు పెరిగాయి. మేతో పోలిస్తే అక్టోబర్‌లో అమెరికాకు ఎగుమతులు 28 శాతం తగ్గి 6.3 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఈ లోటు పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికాలో డాలర్ పుంజుకోవడం కూడా మన దేశీయ కరెన్సీ రూపాయిపై ప్రభావం చూపిందనేది ఆర్ధిక నిపుణుల మాట.
భారత ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
రూపాయి విలువ పడిపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే సరుకులు, వస్తువుల ఖర్చులు పెరుగుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని తయారు చేసే వస్తువులు, సరుకుల మార్జిన్ లు కూడా తక్కువయ్యే అవకాశం ఉంది. బంగారం, ముడి చమురు వంటివి వాటి ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయి. . పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. రూపాయి విలువ తగ్గితే విదేశీ అప్పులు ఉన్న భారతీయ కంపెనీలు తమ రుణాలు తీర్చేందుకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కార్పోరేట్ బ్యాలెన్స్ షీట్లను దెబ్బతీస్తుంది. పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తుంది. బలహీనపడుతున్న రూపాయి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇది మూలధన తరలింపునకు, పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసే అవకాశం ఉంది. అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన పెట్టుబడి ఆర్ధిక వృద్దిని మరింత నెమ్మదిగా మార్చే అవకాశం ఉంది.
రూపాయి విలువ పడిపోతే లాభాలున్నాయా?
విదేశాలకు ఎగుమతులు చేసే కంపెనీలకు మంచి ఆదాయం వస్తుంది. విదేశాలకు ఐటీ ఉత్పత్తులు ఎగుమతులు చేసే సంస్థలు లాభపడుతాయి. ఫార్మా కంపెనీలు కూడా మంచి ఆదాయం వస్తుంది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ప్రయోజనం పొందుతారు. భారత్ నుంచి విదేశాలకు ఏ రకమైన సరుకులు, వస్తువులు ఎగుమతి అవుతాయో…. వారికి ప్రయోజనం ఉంటుంది.
