Kalki 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ చిత్రం 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి, భారతీయ సినీ పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సినీ అభిమానుల దృష్టంతా ఈ చిత్రానికి కొనసాగింపుగా రానున్న ‘కల్కి 2’పైనే ఉంది.
అయితే రెండో భాగం ప్రారంభం నుంచే అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి భాగంలో హీరోయిన్‌గా నటించిన దీపిక పదుకొణే సీక్వెల్‌లో కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉండగా, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు సమాచారం.
ఇద్దరిలో ఒకరు..
దీపిక స్థానంలో నేచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమెను కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, ప్రభాస్ తదుపరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఈ డీల్ ఫైనల్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ పాత్రపై కూడా ఇటీవల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన వయస్సు దృష్ట్యా షూటింగ్‌లో పాల్గొనగలరా? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని తెలుస్తోంది. అమితాబ్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ ప్లానింగ్‌ను ప్రత్యేకంగా రూపొందించారట. ఆయనకు ఇబ్బంది కలగకుండా షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశముందని తెలుస్తోంది.
మొదటి భాగంలో కేవలం పాత్రల పరిచయం, కథా నేపథ్యాన్ని చూపించిన నాగ్ అశ్విన్.. రెండో భాగంలో అసలైన యుద్ధాన్ని చూపించబోతున్నారట. ముఖ్యంగా యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్, భైరవ పాత్రలో ప్రభాస్ మధ్య జరిగే పోరాటం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. అలాగే అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్, యాస్కిన్ మధ్య వచ్చే ఎమోషనల్ మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని టాక్ వినిపిస్తోంది.
‘కల్కి 2’ను మొదటి భాగం కంటే మరింత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాలని చిత్ర బృందం నిర్ణయించుకుందట. అందుకే ఈ సినిమాను 2027 డిసెంబర్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఇక అభిమానులను మరింత ఎగ్జైట్ చేసే మరో వార్త కూడా బయటకు వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్‌లో ‘కల్కి 2’ టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటినుంచే భారీ హైప్ నెలకొంది.
