Delhi Tourism Walk Festival 2024 | పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న టూరిజం వాక్‌ ఫెస్టివల్‌..!

ఎండకాలం నేపథ్యంలో ఎవరైనా విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. దేశ రాజధాని ప్రాంతానికి వెళ్లాలనుకునే వారికి ఢిల్లీ టూరిజం వాక్‌ ఫెస్టివల్‌ స్వాగతం పలుకుతున్నది

  • Publish Date - March 11, 2024 / 04:29 AM IST

Delhi Tourism Walk Festival 2024 | ఎండకాలం నేపథ్యంలో ఎవరైనా విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. దేశ రాజధాని ప్రాంతానికి వెళ్లాలనుకునే వారికి ఢిల్లీ టూరిజం వాక్‌ ఫెస్టివల్‌ స్వాగతం పలుకుతున్నది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఢిల్లీ టూరిజం వాక్‌ ఫెస్టివల్‌ ఈ నెల 31 వరకు కొనసాగనున్నది. ఈ ఫెస్టివల్‌లో చారిత్రక వారసత్వ సంపదను ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం కలుగనున్నది. ఢిల్లీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్‌ కొనసాగుతుండగా.. దేశ రాజధాని సొబగులను దగ్గరగా చూసే అవకాశం కలుగనున్నది.

ఇందులో వారసత్వ సంపద, చారిత్రక కట్టడాలతో పాటు విభిన్న రకాల రుచులను సైతం ఆస్వాదించేందుకు వీలుంటుంది. ఢిల్లీ టూరిజం ఫెస్టివ‌ల్‌లో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన గైడ్‌లను కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. వారంతా 50 విభిన్న వారసత్వ, చారిత్రక కట్టడాలకు సంబంధించిన వివరించనున్నారు. యావత్‌ భారతంతో పాటు విదేశాలకు చెందిన పర్యాటకులు సైతం ఏటా ఈ టూరిజం ఫెస్టివల్‌ సందర్భంగా ఢిల్లీని సందర్శిస్తారు.

మెహ్రౌలీ పార్క్‌ నుంచి..

ఈ టూరిజం వాక్‌ ఫెస్టివల్‌ మెహ్రౌలీ పురావస్తు పార్క్‌ నుంచి మొదలవుతుంది. ఢిల్లీ కథ పాండవుల ఇంద్రప్రస్థ నుంచి మొదలై పృథ్వీరాజ్ చౌహాన్ కోట అయిన రాయ్ పిథోరాకు వస్తుంది. తుగ్లక్ పాలన సమయంలో తుగ్లకాబాద్ ఫిరోజాబాద్‌గా మారింది. ఇది షాజహానాబాద్ మొఘల్ కాలంలో నిర్మించారు. పురానా ఖిలా షేర్ షా సూరి కాలంలో నిర్మితమైంది. దీన్ని పాండవుల కాలంలో పురాణ ఖిలా ఖాండవప్రస్థ అని పేర్కొంటారు. అప్పటి రాజధాని రాజధాని ఇంద్రప్రస్థగా ఉండేది. బ్రిటీషర్స్‌ భారతదేశానికి వ‌చ్చాక‌.. వారు కొత్త లుటియన్స్ ఢిల్లీని స్థాపించారు. దీన్నే ప్రస్తుతం న్యూ ఢిల్లీగా పిలుస్తున్నాం. ఢిల్లీ చాలా వరకు వివిధ సుల్తాన్‌ల పరిపాలనా కాలంలో రాజధానిగా కొనసాగింది.

ప్రత్యేకతలు ఇవే..

ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివ‌ల్‌కు ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ సుఫియానా ఢిల్లీ క్లాసిక్ సంగీతాన్ని, మెహ్రౌలీలోని పురావస్తు పార్క్‌ని, షామ్-ఏ-తుగ్లక్‌బాద్‌ చరిత్ను వివ‌రిస్తారు. దాంతో పాటు ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో కోట అందాలను వీక్షించే అవ‌కాశం ప‌ర్యాట‌కుల‌కు లభిస్తుంది. ఈ దృశ్యం కనులారా చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇస్తుంది. అలాగే హాంటెడ్ వాక్‌లోని మల్చా మహల్ రహస్యం, ఫిరోజ్‌షా కోట్లాలోని జిన్‌ల మౌఖిక కథల వాస్తవికత క‌థ‌ల‌ను సైతం తెలుసుకునేదుకు వీలుంటుంది. కుతుబ్ కాంప్లెక్స్‌లో దేఖో అప్నా సీపీ, రోషన్-ఏ-ఢిల్లీ, ఢిల్లీకి చెందిన జ్యువెల్స్ వంటి ఫన్ వాక్‌లు సైతం ఉంటాయి. ఆహార‌ ప్రియుల కోసం ‘జయకే పురాణీ ఢిల్లీ కే’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే, ఇక్కడ పాత కోట అందాల‌ను కూడా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

టికెట్స్‌ ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివ‌ల్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఒక్కొక్కరు రూ.500 టికెట్‌ను నిర్ణయించారు. ఇందులో పాల్గొనాలనుకునే వారంతా మొదటగా టికెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం మొదట ఢిల్లీ టూరిజం డిపార్ట్‌మెంట్ delhitourism.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఢిల్లీ వెళ్లాక ప్రత్యక్షంగా టికెట్లు తీసుకోవాలనుకునే వారూ టూరిజం కార్యాలయాన్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివల్ పూర్తి షెడ్యూల్‌ కోసం delhitourism.gov.in/dttdc/explore_the_city/walk.jsp పేజీలో చూడొచ్చు. ఎవరైనా ఢిల్లీకి వెళ్తే టూరిజం వాక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం మరిచిపోవద్దు..!

Latest News