Site icon vidhaatha

హైద‌రాబాదీలారా.. ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నారా..? ఈ ప్రాంతాల‌కు వెళ్దాం ప‌దండీ..!

హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌గ‌టిపూట 43 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఉక్కపోత‌కు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు న‌గ‌ర ప్ర‌జ‌లు నానా తంటాలు ప‌డుతున్నారు. కూల‌ర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. అంతేకాదు బాల్క‌నీలు, మెయిన్ డోర్, కిటికీల వ‌ద్ద గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినా కూడా హైద‌రాబాదీల‌ను ఉక్క‌పోత వెంటాడుతోంది. చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌కు వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ క‌లుగుతోంది. మ‌రి ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు సుదూర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు.. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల‌నే చ‌ల్ల‌ని ప్ర‌దేశాలు ఉన్నాయి. మ‌రి ఆల‌స్యం ఎందుకు.. ఆ ప్ర‌దేశాలు ఏంటో తెలుసుకుని, వెళ్దాం ప‌దండీ..!

గండీపేట్ లేక్

హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో గండీపేట్ లేక్ ఉంది. దీన్నే ఉస్మాన్ సాగ‌ర్ అని కూడా పిలుస్తారు. హైద‌రాబాదీల‌కు ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్క‌డ చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉండ‌టంతో ఆహ్లాద‌క‌రంగా గ‌డ‌పొచ్చు. ఇక ఫోటో షూట్‌కు ఈ ప్రాంతం ఫేమ‌స్. మెహిదీప‌ట్నం నుంచి ఆర్టీసీ బ‌స్సులు, ప్ర‌యివేటు వాహ‌నాలు అందుబాటులో ఉంటాయి.

శామీర్‌పేట్ లేక్

శామీర్‌పేట్ లేక్ వ‌ద్ద ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. మంచి పిక్నిక్ స్పాట్ కూడా. స్వ‌చ్ఛ‌మైన గాలిని కూడా పొందొచ్చు. శామీర్‌పేట్ చెరువుకు స‌మీపంలోని జింక‌ల పార్కు ఉంది. ఈ పార్కు కృష్ణ జింక‌ల‌కు నిల‌యం. జేబీఎస్ నుంచి శామీర్‌పేట వైపు ఆర్టీసీ బ‌స్సులు, ప్ర‌యివేటు బ‌స్సులు అందుబాటులో ఉంటాయి.

దుర్గం చెరువు..

దుర్గం చెరువు హైద‌రాబాదీల‌కు కొత్తేం కాదు.. చెరువును, పార్కును సుంద‌రీక‌రించిన త‌ర్వాత ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువైంది. ఫోటోషూట్‌కు కూడా ఈ ప్రాంతం ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ప‌చ్చ‌టి చెట్ల మ‌ధ్య‌లో ఏర్పాటు చేసిన బెంచీల‌పై విశ్రాంతి తీసుకోవ‌చ్చు. ఈవినింగ్ టైమ్‌లో దుర్గం చెరువుకు వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్క‌డికి వెళ్లిన‌ప్పుడు త‌ప్ప‌కుండా కెమెరా తీసుకెళ్లాల్సిందే.

వీటితో పాటు నెహ్రూ జూలాజిక‌ల్ పార్కు, గోల్కొండ ఫోర్ట్, బొటానిక‌ల్ గార్డెన్స్ కూడా మంచి పిక్నిక్ స్పాట్స్. ఈ ప్రాంతాల్లో కూడా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డ‌పొచ్చు. ఇంకెందుకు ఆల‌స్యం పిల్ల‌ల‌తో క‌లిసి అలా విహ‌రించండి.. ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందండి.

Exit mobile version