Site icon vidhaatha

గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

విధాత‌: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆదివారం ఆయన ప్రసంగించారు.టీటీడీ పాలకమండలి ప్రతిపాదించిన విధంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా యథాతథంగా చట్టం చేయాలని కోరారు.

దేశంలోని ముఖ్యమంత్రులందరూ టీటీడీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు. గో సంరక్షణకు పతంజలి పీఠం ఎప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన గో సమ్మేళనం చేసిన ఈ విజ్ఞప్తి వారిద్దరి చెవిలో చేరేలా గో ప్రేమికులు నినదించాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలను ఆయన అభినందించారు. పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. టీటీడీ తలపెట్టిన గో సంరక్షణ యజ్ఞం అందరూ ముందుకు తీసుకు పోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఫోన్ చేసి గో సంరక్ష కార్యక్రమం గురించి తెలియ జేశారని రాందేవ్ బాబా వివరించారు.

Exit mobile version