విధాత:ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలామంది నోట వినిపిస్తున్న అంశం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఇంటి స్థలాలు, పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, స్టీలు పరిశ్రమలు, రహదారులు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు మొదలైన వాటికోసం చాలా రాష్ట్రాల్లో భూములను సేకరించడం జరుగుతుంది. ప్రత్యేకించి మరీ మన “తెలుగు రాష్ట్రాల్లో” అయితే చెప్పనక్కరలేదు. ఈ అంశం పెను వివాదాలకు మూలకారణమయ్యింది. ఈ విషయంలో రాజకీయ వివాదాలతోబాటు మరెన్నో సామాజికపరమైన క్లిష్టమైన అంశాలతో ప్రస్తుతం మన దేశం సతమతమవుతూ ఉంది. కారణం,
“భూ సేకరణ చట్టం 2013” భూయజమానుల పాలిట సానుకూలమైన ఎన్నో అంశాలు ఉన్నాయి.
రైతుల వారి అంగీకారం లేకుండా బలవంతపు సేకరణ చేసే అవకాశం ప్రభుత్వాలకు లేకుండడమే కాకుండా ఇంకా ఎన్నో రక్షణాలు ఈ చట్టంలో ఉన్నాయి. దీనివల్లే, ఆయా రాష్ట్రాలు ఎన్నో అడ్డదారులు తొక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భూములు సేకరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “ల్యాండ్ పూలింగ్” అయితేనేమి, చంద్రశేఖర రావు “జిఓ-123” అయితేనేమి, ఈ చట్టం నుండి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలను అన్వేషించారు
ఎందుకు ప్రభుత్వాలు ఇన్ని అడ్డదారులు తొక్కుతున్నాయి ? చట్టప్రకారం వెళితే వాళ్ళకు ఇబ్బందులేమిటి ? అసలు ఇంతకీ ఆ చట్టంలో ఏముంది ? తెలుసుకుందాం
స్వాతంత్ర్యానంతరం మనం రూపొందించుకొన్న ఎన్నో చట్టాల్లో అత్యంత ఉత్తమమైన మరియు సంచలనమైన వాటిలో ఒకటి 2013 లో కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపిఏ ప్రభుత్వం రూపొందించిన “భూసేకరణ చట్టం”. ఈ చటాన్ని ఆంగ్లములో అసలు పేరు Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013″ . బ్రిటిష్ కాలంనాటి భూసేకరణ చట్టానికి (The Land Acquisition Act 1894), అనేక మార్పులూ చేర్పులూ చేసి ఈ చట్టాన్ని రూపొందించారు. సుమారు 65పేజీలున్న ఈ చట్టాన్ని, సంక్లిష్టంగా రూపొందించారు.
u1894 నాటి బ్రిటిష్ చట్టంలో లెక్కలేనన్ని లోపాలుండడం వలన, అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గమూ, సామాజిక శాస్త్రవేత్తలూ అందరూ సమూల మార్పులు చేయవలసిందేనని మూకుమ్మడిగా నినదించారు. దాని పర్యావసానమే 2013 లో అప్పటి యుపిఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం అదికూడా చాలా సుదీర్ఘ ప్రక్రియ తరువాతనే చట్టంగా రూపొందింది. ఇక మురిగిపోయిన ఆ బ్రిటిష్ చట్టంలో ఉన్న లోటుపాట్లు ఏమిటో ఓసారి చూద్దాం.
- బలవంతపు సేకరణకు ప్రభుత్వానికి సర్వహక్కులూ ఉండడం
- బలవంతపు సేకరణపై భూయజమానులకు రక్షణ లేకపోవడం
- సహాయ పునరావాస కార్యక్రమాల ఊసే లేకపోవడం
- అత్యవసర పరిస్థితుల్లో భూసేకరణకు అసాధారణమైన అధికారాలను కలిగి ఉండడం
- అత్యల్ప నష్ట పరిహారం
- న్యాయపరమైన చిక్కులుంటే మొత్తం ప్రాజెక్టునే ఆపివేసే పరిస్థితులుండడం
- బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం మోసపూరితమైనదిగా ఉంది అంటూ సాక్ష్యాత్తూ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడడం
- ఇంకో కేసు విషయంలో కూడా సుప్రీమ్ కోర్ట్ ఈ చట్టం అసలు ఇప్పటి సమాజానికి ఎటువంటి మేలూ కలగజేసేదిగా లేదు అంటూ అభిప్రాయపడడం…
ఎన్నో అవకతవకలున్న ఆ బ్రిటిష్ చట్టాన్ని సమూలమార్పులకు గురిచేసి షుమారు రెండేళ్ళ పాటు చర్చోపచర్చలూ, ఎన్నెన్నో మార్పులూ చేర్పులూ చేసిన తరువాత 2013 లో ఓ చారిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం.ఈ చట్టం పేరే “The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013”
2013 సంవత్సరంలో తెచ్చిన ఈ “భూసేకరణ చట్టం” లోని ముఖ్యమైన అంశాలను చూద్దాం.
1894 నాటి బ్రిటిష్ రాజ్ బిల్లుకు 157 సవరణలు చేసిన ఈ కొత్త బిల్లులో 103 సవరణలు టైపోగ్రఫీ లేదా డెఫినేషన్ కు సంబందినవి. 28 స్వల్ప సవరణలు. మిగతా 26 సవరణలు మాత్రం అత్యంత ముఖ్యమైనవి, విస్తారమైనవీను. ఈ 26 ముఖ్యమైన సవరణలలోని అంశాలలో కొన్నింటిని మనం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 1894 సంవత్సరం నుంచి 2013 భూసేకరణ చట్టాన్ని 17 సార్లు సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ చట్టల రైతుల పాలిట అభయ హస్తం “”భూసేకరణ చట్టం2013″”
బ్రిటిష్ చట్టంలో లేనటువంటి ఈ చట్టంలో ఉన్న వాటి గురించి చెప్పాలంటే “కార్పొరేట్ల కు ఇది కొరకరాని కొయ్య” మరియు భూ యాజమానుల పాలిట, రైతుల పాలిట ఇది ఒక రక్షణ కవచం అని చెప్పవచ్చు. ఈమాత్రం పకడ్బందీగా లేకపోతే ఇష్టారాజ్యంగా అరాచకం రాజ్యమేలేది.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
- నష్ట పరిహారం
ప్రస్తుతమున్న అసంబద్ధమైన నష్టపరిహార విధానంవల్ల తీవ్రంగా నష్టపోతున్న భూ యజమానులకు వెనుదన్నుగా ఉండేలా, ఈ బిల్లులో “మార్కెట్ వేల్యూ పై నాలుగురెట్లు వరకూ అదనంగా పల్లె ప్రాంతాలలోనూ”, “రెండు రెట్లు వరకూ అదనంగా పట్టణ ప్రాంతాలలోనూ” నష్ట పరిహారం చెల్లించేలా నిబంధన విధించారు. దీనివల్ల భూమిని కోల్పోయేవారికి పరిహారంపై భరోసా ఉంటుంది.
- సహాయ – పునరావాసం భూ సేకరణ దాని సంబంధిత సహాయ పునరావాస కార్యక్రమాలను కలిపి ఒకటే చట్టంలో తేవడం బహుశా ఇదే మొదటిదనుకొంటాను. ఈ బిల్లులో ఏకంగా ఐదు అధ్యాయాలు, రెండు ప్రత్యేక అనుబంధ పత్రాలూ (షెడ్యూల్) కేవలం సహాయ పునరావాసానికి సంబంధించి ప్రత్యేకంగా కేటాయించారు.
- భూ యజమానుల అంగీకారం
పరిహారం, సహాయ-పునరావాసం తరువాత అత్యంత ముఖ్యమైన మరో సవరణ ఈ “భూ యజమానుల అంగీకారం”. ఈ నిబంధన ప్రకారం, “ప్రభుత్వ ప్రైవేటు బాగాస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులకు 70% భూ యజమానుల అంగీకారం తప్పనిసరి”. అలాగే ప్రైవేటు ప్రాజెక్టులకు 80% భూ యజమానుల అంగీకారం తప్పనిసరి. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు సేకరణ జరగదు. ఆవిధంగా భూ యజమానులకు ఇది ఒక మహా రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇది ఖచ్చితంగా భూ యజమానుల హక్కులను కాపాడే నిబంధన.
- సామాజిక ప్రభావ అంచనా
ఇది ఇంకో అతి ముఖ్యమైన అంశం. భూసేకరణ జరిగే ప్రాంతంలో, సదరు భూమిని సేకరించడం వలన కలిగే “సామాజిక ప్రభావాన్ని” అంచనా వేయడానికి గ్రామ స్థాయిలో క్షేత్ర పరిశీలన చేసి, వివిధ అంశాలను అధ్యయనం చేసి, ప్రభావాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. ఇది ఓ సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో నిపుణుల కమిటీలు వెళ్లి గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలను నమోదు చేసి, సవివర నివేదికను సమర్పించాలి. తదుపరి ఆ నివేదికను మదింపు చేసినతరువాత మాత్రమే భూసేకరణకు పచ్చజండా. ఈ ప్రక్రియ మొత్తం ఆరునెలలలోపు పూర్తి కావలసి ఉంటుంది.
- గతానికి వర్తించే నిబంధనలు
ఈ బిల్లు ఆచరణలోనికి రావడానికి ముందే భూ సేకరణ జరిగీ, పరిహారం ప్రకటించిన తరువాత కూడా ఆ పరిహారం చెల్లించకుండా ఉండీ, ఆ భూమిని స్వాధీనపరచుకోకుండా ఉండి ఉంటే, అటువంటి వాటికి కూడా ఈ బిల్లులోని అన్ని అంశాలు వర్తిస్తాయి. ఇటువంటి పెండింగ్ లో ఉన్న వాటికి గత ఐదేళ్ళ క్రితం వరకూ జరిగిన సేకరణలకు, ఈ మొత్తం తతంగం, కొత్త చట్టం ప్రకారం మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టవలసి ఉంటుంది.
- విభిన్నమైన తనిఖీలు సంతులనాలు
విస్తారమైన, భాగస్వామ్యం గల, అర్థవంతమైన ఈ ప్రక్రియ వలన ఎక్కడికక్కడ, గ్రామ పంచాయతీ స్థాయి నుండి, జాతీయ స్థాయి మానిటరింగ్ కమీటీల వరకూ ప్రతిఒక్కరి భాగస్వామ్యాన్ని ఖచ్చితంగా ఉండేలా చేసి, భూ సేకరణకు పూర్వరంగం నుండి, పరిహార, సహాయ-పునరావాస కార్యక్రమాలన్నీ పకడ్బందీగా అమలయ్యేలాగా చేయడానికి అవకాశముంది.
- గిరిజనులకు, మిగతా ప్రతికూల సమూహాలకూ ప్రత్యేక రక్షణలు
ఈ నిబంధనల వల్ల గిరిజనుల, అటవీ ప్రాంత ప్రజలకు ఉన్న హక్కులు పరిరక్షించే వివిధ చట్టాలలో పేర్కొన్న అంశాలు, అటవీ చట్టాలు, షెడ్యూల్ కులాలకు చెందిన చట్టాలూ ఇవన్నీ వర్తిస్తాయి. దీనివల్ల భూ సేకరణ చట్టంలోని నిబంధనలే కాకుండా వీరికి ప్రత్యేక రక్షణలు కూడా ఉంటాయి.
- నిర్వాసితులకు ప్రత్యేక రక్షణలు
ఈ నిబంధనల వలన, భూమిని కోల్పోయేవారికి పరిహారం అంది, సహాయ పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేసి, వారిని సాధారణ పరిస్థితుల్లో నివసింపజేసేవరకూ భూమిని స్వాదీనం చేసుకోకుండా వీలు ఉంటుంది.
- జీవనోపాధి కోల్పోయేవారికి పరిహారం
భూ సేకరణ వలన, కేవలం భూ యజమానులకే కాకుండా ఆ భూమిపై ఆధారపడి బ్రతికే వారికి కూడా ఉపాది కోల్పోయే ప్రమాదముంది, కావున అటువంటివారికి కూడా పరిహారం అందేలా ఈ నిబంధనను రూపొందించారు.
- బహుళ పంటలు పండే భూములపై నియంత్రణలు “ఆహార భద్రత”ను ఉద్దేశ్యించి రూపొందించిన ఈ నిబంధన వల్ల “బహుళ పంటలు” పండించే అత్యంత సారవంతమైన భూముల సేకరణపై కట్టుదిట్టమైన నియంత్రణ ఉంటుంది. ఇటువంటి భూముల సేకరణకు అనుమతులు రావాలంటే చాలా జటిలమైన ప్రక్రియ ఉంటుంది.
- వాడని భూములు తిరిగి అప్పగించడం ఈ ప్రకరణం వల్ల సేకరించిన భూమిని ఒకవేళ ఉపయోగించకపోతే, తిరిగి సొంతదారులకు అప్పగించే సౌలభ్యం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. లేదా ప్రభుత్వందగ్గరే ఉంచుకొనే వీలు ఉంటుంది.
- ఆదాయపు పన్ను మినహాయింపు
భూమిని కోల్పోయిన వారికి అందే పరిహారంపై ఎటువంటి ఆదాయపన్ను ఉండదు. అంతేకాకుండా మిగతా స్టాంప్ డ్యూటీలు కూడా ఉండవు.
- లాభంలో వాటా
సేకరించిన భూమిని వివిధ కారణాల వలన ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ రేటుకు అమ్మడం గనక జరిగే పక్షంలో ఆ పెంచిన రేటులో 40% వాటా భూమిని కోల్పోయినవారికి అందుతుంది.
ఇవన్నీ నిస్సందేహంగా భూ యజమానులకు నమ్మకం కలిగించేవిగాం వారి హక్కులను పరిరక్షించేవిగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
ఇక ఈ చట్టంలోని అత్యంత ముఖ్యమైన “పరిహారం”, “సహాయ-పునరావాసం” తదితర అంశాలు పరిశీలిస్తే ఈ చట్టంలో మొత్తం 13 అధ్యాలు, 4 అనుబంధాలు (షెడ్యూళ్లు) ఉన్నాయి. సహాయ పునరావాసానికి మాత్రమే ప్రత్యేకించి ఏకంగా ఐదు అధ్యాయాలు, రెండు షెడ్యూళ్లు కేటాయించారు. 5 నుండి 9 వరకూ గల అధ్యాయాలలో ఈ అంశాలను సమగ్రంగా వివరించి, పకడ్బందీగా వ్యవస్థీకృతం చేశారు. అలాగే “ఆహార భద్రతకు” సంబంధించిన రక్షణలకు కూడా 3వ అధ్యాయంలో విధివిధానాలను రూపొందించారు. 2వ అధ్యాయంలో “సామాజిక ప్రభావ అంచనా”కు సంబంధించి సవివరమైన విధివిధానాలు పొందుపరచారు.
పరిహారం సహాయ పునరావాసం
“నిర్వాసిత/ప్రభావిత కుటుంబం” అన్న పదానికి విస్తృతార్థం ఇచ్చారు. :- ఎవరి భూమినైతే సేకరిస్తున్నారో, భూమి లేకపోయినా కుటుంబంలో ఎవరైనా వ్యవసాయ కూలీలుగా ఉన్నా, ఆ భూమిపై వచ్చే ఫలాలను ఏవిధంగానైనా అనుభవిస్తున్నా, కౌలుదారుడైనా, సదరు భూమిపై ఆధారపడిన మరేఇతర శ్రామికులైనా, లేక ఈ భూసేకరణ వలన ఇంకేవిధంగా నష్టపోయేవారెవరైనా ఉంటే. భూ సేకరణ వలన నిర్వాసితులయ్యే షెడ్యూల్డ్ కులాలు/తెగలు, అటవీ ప్రాంతాలలో నివసించేవారు, అడవులపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించేవారు, వేటాడి జీవనం సాగించేవారు, చేపలు పట్టేవారు, అంతేకాకుండా ఇదివరలో ప్రభుత్వం వారు ఇచ్చిన అసైన్డ్ భూమి ఏదైనా ఈ సేకరణకు గురైనా, లేక పట్టణ ప్రాంతాలలో నివాసమున్న భూమిని సేకరించినా ఇలా ప్రభావితమయ్యే అందరినీ “ప్రభావిత/నిర్వాసిత కుటుంబం” గానే పరిగణిస్తారు.
“వ్యవసాయ భూమి” అన్న పదానికి కూడా విస్తృతార్థాన్నిచ్చారు. ఏదైనా వ్యవసాయ భూమి, ఉద్యాన పంటలు, పాల ఉత్పత్తులు, కోళ్ళఫారం, మత్స్య పరిశ్రమ, పట్టు పరిశ్రమ, విత్తనాల తయారీ, పశు గణాభివృద్ధి, నర్సరీలు, వైద్య సంబంధమైన పంటలు, చెట్ల పెంపకం, గడ్డి పెంపకం, తోట పెంపకం, చివరికి పశువుల పాకను కూడా “వ్యవసాయ భూమి” గానే పరిగణిస్తారు
పునరావాస కార్యక్రమాలకు సంబంధించి 2వ షెడ్యూల్ లో వివరంగా పేర్కొన్నారు. వాటిలో ముఖ్యమైనవి
- నిర్వాసితులకు గృహ వసతి కల్పించడం
ఈ నిబంధనను అనుసరించి, పల్లె ప్రాంతాలలో ఇళ్లు కోల్పోయేవారికి “ఇందిరా ఆవాస్ యోజన” పథకం క్రింద ఇంటి నిర్మాణం చేయాలి. అలాగే పట్టణ ప్రాంతాలలో ఇళ్లు కోల్పోయేవారికి 50 చదరపు మీటర్లకు తగ్గకుండా ఇంటినిర్మాణం చేసి ఇవ్వాలి.
సేరించవలసిన స్థలంలో ఎటువంటి నివాస స్థలం లేకపోయినా, నిర్వాసితులయ్యే కుటుంబాలు గత మూడు సంవత్సరాలకు తక్కువకాకుండా నివసిస్తూ ఉన్నట్లయితే వారికి కూడా ఈ లబ్ధి వర్తిస్తుంది. ఒ
కవేళ పట్టణ ప్రాంతాలలో నిర్వాసితులు ప్రభుత్వం కట్టించే ఇల్లు గనక వద్దనుకొంటే, వారికి ఇంటి నిర్మాణ నిమిత్తం ఒకటిన్నర లక్షల రూపాయల మొత్తం ఒకటేసారిగా అందజేస్తారు. అదే పల్లె ప్రాంతాల వారికైతే ఇంటి నిర్మాణానికైన మొత్తం ఖర్చునీ చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మిగతా కట్టిన ఇంటికైన ఖర్చుతో పోల్చి సరైన మొత్తాన్ని అంచనా వేస్తారు.
- భూమిని కోల్పోయినవారికి భూమినివ్వడం
ఏదైనా “ఇరిగేషన్” ప్రాజెక్ట్ లో భూమి కోల్పోయేవారికి సాధ్యమైనంతవరకూ భూమినే పరిహారంగా ఇవ్వాలి. ఇటువంటి ప్రాజెక్ట్ కి సేకరించవలసిన భూమిలో ఎవరైనా వ్యవసాయ భూమి నష్టపోతున్నా, లేదా సేకరించినా, లేదా ఈ సేకరణ వల్ల వ్యవసాయం దెబ్బతినే పరిస్థితి ఉన్నా, అటువంటి కుటుంబాలకు పరిహారంగా ఒక్కో కుటుంబానికీ ఆ ప్రాజెక్ట్ పరిధిలో ఒక ఎకరానికి తక్కువకాకుండా భూమిని కేటాయించాలి.
అదే షెడ్యూల్డ్ కులాలు/తెగలకు సంబంధించిన భూములు సేకరించవలసి వస్తే, సేకరించిన భూమికి సమానంగా లేక రెండున్నర ఎకరాల భూమిని (ఈ రెంటిలో ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది) కేటాయించాలి
ఒకవేళ భూమిని “పట్టణీకరణ/నగరీకరణ”కోసం సేకరిస్తే, సేకరించిన భూమిలో 20% అభివృద్ధి పరచిన భూమిని సదరు భూమినో కోల్పోయిన కుటుంబాలకు కేటాయించాలి. అంటే, ప్రతి ఒక్క భూ యజమానీ, వారి వారికున్న భూమి విస్తీర్ణంలో 20శాతం అభివృద్ధి పరచిన భూమిని పొందుతారు. అంటే ఒక ఎకరం భూమిని(4840 గజాలు) వదులుకొంటే, దాంట్లో 20% శాతం భూమిని అంటే 968 గజాల అభివృద్ధి పరచిన భూమిని తిరిగి పొందుతారు. నిర్వాసిత కుటుంబాలు ఈ 20% అభివృద్ధి పరచిన భూమికి ఒప్పుకొంటే, దీనికి సరియైన పైకాన్ని వీరికి పరిహారం రూపంలో వచ్చే సొమ్ములో మైనస్ చేస్తారు.
- వార్షికభృతి లేక ఉద్యోగం
సేకరించిన భూమిలో రాబోయే ప్రాజెక్ట్ లో ఒకవేళ ఉద్యోగాల కల్పన గనక జరిగితే, నిర్వాసిత కుటుంబాలలో కుటుంబానికొక్క ఉద్యోగం ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం పొందే కనీస అర్హతలు లేకపోతే, వార్షికభృతిగా ఒకటేసారి ఐదు లక్షల పరిహారం చెల్లిస్తారు. లేదా ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేలకు తగ్గకుండా ఇరవై సంవత్సరాలపాటు చెల్లిస్తారు.
- జీవనోపాది కొరకు చెల్లించే గ్రాంట్
నిర్వాసిత కుటుంబాలకు నెలవారీ ఖర్చులకోసం, కనీసం 3 వేలకు తక్కువకాకుండా ఒక సంవత్సరంపాటు చెల్లిస్తారు. షెడ్యూల్డ్ కులాలు/తెగలవారికి మరో 50 వేలు అదనంగా చెల్లిస్తారు.
- నిర్వాసితుల రవాణా ఖర్చులు
నిర్వాసిత కుటుంబాలు పునరావాసం కల్పించిన ప్రదేశానికి తరలివెళ్ళడానికి కావలసిన ఖర్చులకు గాను 50వేల ఆర్థిక సహాయం పొందుతారు. ఈ డబ్బుతో వారి వస్తువులను, పశువులనూ, ఇంకా తదితర సామాగ్రిని తరలించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు
- నిర్వాసితులలో పశువుల షెడ్ లేక చిన్న షాప్ లాంటిదేమైనా ఉంటే వాటిని పునరుద్ధరించుకోవడానికి 25వేలకు తక్కువకాకుండా ఆర్థిక సహాయం అందిస్తారు.
- నిర్వాసితులలో చేతి వృత్తులవారికీ, చిరు వ్యాపారులకు లేక స్వయం ఉపాధి ఉన్నవారికి, 25వేలకు తక్కువకాకుండా ఆర్థిక సహాయం అందుతుంది.
- ఇరిగేషన్ ప్రాజెక్టు లేక జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం నిర్వాసితులైనవారికి సదరు జలాశాయలలో చేపలు పట్టుకొనే అవకాశం కల్పిస్తారు.
- నిర్వాసిత కుటుంబాలకు అందే పరిహారం మొత్తానికి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి స్టాంప్ డ్యూటి, రిజిస్ట్రేషన్ ఖర్చులూ ఉండవు.
- ఈ పరిహారం-పునరావాసం కాకుండా, వారికి నివాసం కల్పించిన ప్రాంతాలలో కల్పించవలసిన మౌలిక సదుపాయాల గురించి కూడా 3వ షెడ్యూల్ లో పలు సూచనలు చేశారు.
ఇక చివరగా, ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై అభ్యంతరాలుంటే, లేక అది సరిపోదనుకొంటే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా కల్పించారు.
మరీ ముఖ్యంగా సేకరించిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ముందే పరిహారం, సహాయ, పునరావాస కార్యక్రమాలన్నీ వందశాతం పూర్తి అయిఉండాలి.
అవి నగదు పరిహారం కానీ, స్థల కేటాయింపు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, ఇంకా చట్టంలో పేర్కొన్న విధంగా అన్నీ సంపూర్ణంగా నిర్వహించిన తరువాతనే సేకరించిన భూమిని స్వాధీనం చేసుకోవాలి.
భూ యాజమానుల / నిర్వాసితులకు ఇన్నిరకాల భద్రతలు కల్పించిన ఈ చట్టంలో “సామాజిక ప్రభావ అంచనా” మరియు “ఆహార భద్రతకు రక్షణ” కోసం పొందుపరచిన రెండు అధ్యాయాలు కూడా చాలా కీలకమైనవి. ఈ చట్టంలో రెండవ అధ్యాయం మొత్తం “సామాజిక ప్రభావ అంచనాకు” కేటాయించారు.
●సామాజిక ప్రభావ అంచనా
ఏదైనా ప్రజాఉపయోగ సంబంధమైన అవసరాలకోసం ప్రభుత్వం భూసేకరణ జరపాలనుకొంటే, ముందుగా సదరు భూమిని సేకరించాలనుకొంటున్న ప్రదేశంలోని స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ లేక కార్పొరేషన్ లను సంప్రదించాలి. అది గ్రామ అయినా, మండల స్థాయి అయినా, మున్సిపల్ స్థాయి అయినా ఆయా ప్రదేశాల్లో “సామాజిక ప్రభావ అంచనా” తప్పనిసరిగా జరిపితీరాలి.
భూసేకరణకోసం ఉద్దేశ్యించిన వివరాలను తెలియపరుస్తూ, ఈ “సామాజిక ప్రభావ అంచనాకు” సంబంచింధి జరుపుతున్న ప్రజాభిప్రాయ సేకరణకోసం చేపట్టబోయే సభల వివరాలను ముందుగానే ప్రకటించి, సంబంధిత ప్రదేశాలలో ప్రజలందరికీ ముందుగానే తెలియజేయాలి
ఈ అభిప్రాయ సేకరణలో ఆయా స్థానిక సంస్థలకు ఖచ్చితంగా ప్రాతినిద్యం కల్పించాలి
ఈ “సామాజిక ప్రభావ అంచనా” కార్యక్రమాన్ని మొత్తం 6 నెలలలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ మొత్తాన్ని అక్కడి ప్రజలకు వారి స్థానిక భాషలో అందుబాటులో ఉంచాలి. ఈ “సర్వే” లో క్రింది విషయాలను పరిగణనలోనికి తీసుకోవాలి
ఈ భూసేకరణ వల్ల ప్రజా ప్రయోజనమేమైనా ఉందా ?
●నిర్వాసిత కుటుంబాలూ, ప్రభావిత కుటుంబాల వివరాలను అంచనా వేయాలి.
●ఈ సేకరణ వలన నష్టపోయే ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, భవనాలు, జనావాసాలు, ఇంకా ఇతర ఏవిధమైన ఆస్తులైనా ఉన్నాయో అంచనా వేయాలి.
●సేకరణకు ఉద్దేశ్యించిన ఈ స్థలం అవసరానికి అనుగుణంగానే ఉందా లేదా అన్నది చూడాలి.
●ఇంకా ఏ ఇతర ప్రదేశంలోనైనా స్థలం అందుబాటులో ఉందేమో పరిశీలించాలి
●ప్రతిపాధిత ప్రాజెక్ట్ వలన కలిగే సామాజిక ప్రభావం, వాటిని పరిష్కరించే మార్గాలూ, అయ్యే ఖర్చూ , ఈ ఖర్చులన్నిటితో పోలిస్తే అసలు ప్రాజెక్టు వ్యయంపై పడే ప్రభావం, తదుపరి, ఇంతా చేసి ఈ ప్రాజెక్టు వల్ల ఒనగూరే అసలు ప్రయోజనాలు తదితర వివరాలను అంచనా వేయాలి.
●అంతేకాకుండా “పర్యావరణ ప్రభావ అంచనా” కూడా చేయాలి.
సామాజిక ప్రభావ అంచనా చేసేటప్పుడు ప్రభావిత కుటుంబాల జీవనోపాధి, ప్రభుత్వ , సామాజిక ఆస్తులు, మౌలికసదుపాలైన రోడ్లు, ప్రజా రవాణా, మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, త్రాగు నీటి వనరులు, పశువులకు త్రాగునీటి వనరులు, కుంటలూ/మడుగులూ, పశువుల మేతకు ఉపయోగపడే పచ్చిక బయళ్లూ, ఉద్యాన పంటలు, అలాగే ప్రజా ఉపయోగములైన పోస్ట్ ఆఫీసు, చౌక ధరల దుకాణాలు, ఆహార నిలువ ఉంచే గోదాములు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పాఠశాలలు, విద్యా సంస్థలు, శిక్షణా స్థలాలు, అంగన్వాడీలు, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, ఇంకా ఏ మతపరమైన స్థలాలు, శ్మశానాలు.. ఇలాంటి ప్రతిఒక్క విషయం మీదా కలిగే ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలి.
పైన పేర్కొన్న వాటిలో ప్రతిఒక్క సౌకర్యాలపై కలగబోయే ప్రభావాన్ని అంచనావేసి, వీటిని పరిష్కరించడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేయాలి. ఆ పరిష్కారాలు కూడా ప్రస్తుతమున్న పరిస్థితికంటే కూడా మెరుగైనవే అయ్యి ఉండాలి.
ఇవన్నీ తయారు చేసేముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఎక్కడక్కడ గ్రామసభలు జరపాలి. ఈ విషయాలపై ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించి ప్రతి ఒక్క విషయాన్నీ తెలియపరచి వారికి అవగాహన కల్పించాలి. వారి అభిప్రాయాలనూ, అభ్యంతరాలనూ రికార్డు చేయాలి.
ఈ తతంగమంతా పూర్తి అయిన తరువాత ఫైనల్ రిపోర్ట్ ను ప్రభావిత ప్రజలకు వారి వారి ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలి. ఈ సవివరమైన నివేదికను “నిపుణుల కమిటీకి” నివేదించాలి. ఆ నిపుణుల కమిటీలో ఈ క్రింద పేర్కొన్నవారు ఉండాలి.
1.ఇద్దరు ప్రభుత్వేతర శాస్త్రవేత్తలు
2.ఇద్దరు స్థానిక సంస్థల అధికారులు
3.ఇద్దరు పునరావాస నిపుణులు
4.ప్రాజెక్టు కు సంబంధించిన నిపుణత గలిగిన ఒక నిపుణుడు
5.వీళ్లలోనే ఎవరినో ఒకరిని ఆ కమిటీకి ఛైర్మన్ గా ప్రభుత్వం నియమిస్తుంది..
ఈ “నిపుణుల కమిటీ” వారు వారికి అందిన “సామాజిక ప్రభావ అంచనా నివేదికను” కూలంకషంగా పరిశీలించి వారి నిర్ణయాన్ని తెలియజేయాలి. ఈ ప్రాజెక్టు ఎంతవరకూ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది, అసలు ప్రజా ప్రయోజనం ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, ఉంటే ఎలా అంటూ వారి నివేదికను ఇవ్వవలసి ఉంటుంది.. ఒకవేళ ఎటువంటి ప్రజా ఉపయోగమూ లేకపోతే సదరు ప్రాజెక్టు ను రద్దుచేయమని సిఫారసు చేసే అధికారం కూడా ఈ నిపుణుల కమిటీకి ఉంటుంది. ఈ కమిటీ వారు వారి నివేదికను రెండు నెలలలోగా ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుంది. వీరి నివేదికను కూడా సంబంధిత గ్రామ ప్రజలకు, ప్రభావిత ప్రాంతాల వారికీ వారి ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంచాలి.
ఇక ఈ నివేదికను అందుకొన్న ప్రభుత్వం, చివరగా ఈ క్రింది విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు అమలుపరచేదిశగా వారి నిర్ణయాన్ని తెలియజేయాలి.
ఈ సేకరణ వలన రాబోయే ప్రాజెక్టు చట్టబద్ధమైనదిగా ఉండి, వాస్తవికతతో కూడుకొని ఉండాలి
ఈ ప్రాజెక్టు వలన కలిగే ఉపయోగాలు, దీనివలన కలిగిన సామాజిక ప్రభావం, ఖర్చు, నష్టం తదితరములన్నిటికంటే కూడా ఉన్నతంగా ఉండాలి
ప్రాజెక్టు కు కావలసిన కనీస భూమిని మాత్రమే సేకరించాలి సదరు ప్రదేశంలో ఇదివరలో సేకరించిన నిరుపయోగమైన భూమి ఉండకూడదు. అతితక్కువ ప్రభావం ఉండాలి. నిర్వాసితులను సాధ్యమైనంతగా తక్కువ ఉండేలా చూడాలి. మౌలిక సదుపాయాలకు సాధ్యమైనంత తక్కువ నస్తమ్ జరిగేదిలా ఉండాలి. పర్యావరణానికి నష్టం అతితక్కువ ఉండాలి.
●అయితే, కొన్ని ముఖ్యమైన అత్యవసర పరిస్థితులలో ఈ “సామాజిక ప్రభావ అంచనా” చేయకుండానే అనుమతులు మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలాంటి సందర్భాలు.
●జాతీయ భద్రతకు సంబంచించినవి
రక్షణ విభాగానికి సంబంధించినవి
ప్రకృతి విపత్తులకు సంబంధించినవి తదితరములైన సందర్భాలలో పార్లమెంట్ యొక్క ముందస్తు అనుమతితో ఈ “సామాజిక ప్రభావ అంచనా” నుండి మినహాయింపు ఉంటుంది.
ఆహార భద్రత కొరకు రక్షణలు
ఆహార భద్రతకోసం, “బహుళ పంటలు పండే వ్యవసాయ భూమి” ని సేకరించకూడదు అన్న నిబంధనలను చట్టంలోని మూడవ అధ్యాయంలో ఈ వివరాలను పొందుపరచారు.
●దేశంలో కొన్ని “అసాధారణమైన పరిస్థితులలో” మాత్రమే ఇక మిగతా ఎటువంటి అవకాశం లేకుండా ఉండి, సదరు ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి భూమి ఆ జిల్లా పరిధిలో, లేక రాష్ట్ర పరిధిలో ఒకేదగ్గర దొరకనటువంటి పరిస్తితి ఉన్నప్పుడు మాత్రమే ఈ “బహుళ పంటల వ్యవసాయ భూమిని” సేకరించే వీలు ఉంటుంది.
●ఇంతటి అసాధారణమైన పరిస్థితుల్లో కూడా, సదరు భూమిని సేకరించాలంటే, ఎంత భూమినైతే సేకరిస్తారో, సరిసమానమైన భూమిని మిగతా ప్రదేశాలలో వృధాగా పడిఉన్న భూమిలో “పంటకు అనువైనదిగా తయారుచేయాలి”. అలా కుదరకపోతే సదరు భూసేకరణకు ఖర్చయ్యే మొత్తం నగదును ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసి, ఆ నగదుని ఆహార భద్రతకు ఉపయోగించాలి. అయిన రైల్వేలైన్లు, “జాతీయ రహదారులు – రోడ్లు పంట పొలాలకు నీరందించే కాలువలు, విద్యుత్ లైన్లు తదితరములైన లీనియర్ తరహాలో ఉండే ప్రాజెక్టులకు ఈ నిబంధనలు వర్తించవు.
●ఇలా ఎన్నో ప్రత్యేకతలతో, భూసేకరణ ప్రక్రియను భూ యాజమానుల & రైతులకు అనుకూలంగా రూపొందించిన ఈచట్టం నిర్వాసితుల పాలిట రక్షణ కవచం అనడంలో సందేహం లేదు.
●ఇకపోతే, 2014 లో నరేంద్ర మోడి ప్రధానిగా బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఈ చట్టంలోని అత్యంత కీలకమైన “భూయజమానుల అంగీకారం”, “సామాజిక ప్రభావ అంచనా” & “ఆహార భద్రతకోసం రూపొందించిన రక్షణలు” తొలగిస్తూ, 2014 డిసెంబర్ నెలలో ఒక ఆర్డినెన్స్ ను జారీచేసింది.
●ఆ ఆర్డినెన్స్ ఆధారంగా చేసుకొని అమరావతిలో రాజధానికోసం భూములను సేకరించడానికి దూకుడుగా ముందుకెళ్లినారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైపోరాటం సాగించాయి. అయినా సరే, మరో మూడుసార్లు అదే ఆర్డినెన్స్ ను మళ్ళీ మళ్ళీ జారీచేశారు బిహెచ్‌పి వారు. దీనికోసం ఒకసారి పార్లమెంట్ ను ప్రోరోగ్ కూడా చేశారు.
●ఈ సవరణల బిల్లును మందబలంతో లోక్ సభలో మూడుసార్లు నెగ్గించుకొని, రాజ్యసభకు పంపారు. అయితే అక్కడ వీరికి మెజారిటీ తక్కువ ఉండడంతో, ప్రతిపక్షాలవాళ్ళు అసలు ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టనీయలేదు.
భూ సేకరణాధికారులు
ఆర్.డి.వో./స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)ల ద్వారా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి అవసరమైన భూములను సేకరిస్తుంది. అభివృద్ధి పేరుతో జరిగిన భారీ భూసేకరణలో వ్యవసాయానికి అనువైన, రెండు పంటలు పండే భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. రైతులకు పరిహారం ఇచ్చి భూములను సేకరించే పని పరిశ్రమలదే అంటూనే రెవిన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. అనేక చోట్ల భారీ కుంభకోణాలకు ఇవి తెరతీశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, స్టీలు పరిశ్రమలు, రహదారులు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు.. ఇలా అనేక పేర్లతో భూములను ప్రభుత్వం సేకరిస్తుంది.
ఎస్.ఆర్.ఆంజనేయులు
న్యాయ సలహాదారుడు