Conferred IAS | రెవెన్యూ సీనియార్టీ మళ్లీ మొదటికి! కన్ఫర్డ్ ఐఏఎస్‌ల ఆశలు ఆవిరి!

సెప్టెంబర్ నెలాఖరు కల్లా తమకు కన్ఫర్డ్ హోదా లభిస్తుందని ఆశల పల్లకీలో ఊరేగిన అధికారులకు యూపీఎస్‌సీ షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వం పంపిన ఫైలులో తప్పులు ఉన్నాయంటూ దానిని తెలంగాణ ప్రభుత్వానికి తిప్పిపంపింది.

  • Publish Date - September 21, 2025 / 09:41 AM IST

హైదరాబాద్, సెప్టెంబర్‌ 21 (విధాత):

Conferred IAS | రాష్ట్రంలో కన్ఫర్డ్ ఐఏఎస్ (పదోన్నతులు) జాబితా రూపకల్పనలో నిబంధనలు పాటించడం లేదని సచివాలయ జీఏడీ ఉన్నతాధికారి ఒకరు ముందే హెచ్చరించారు. ఆయన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, సరిచేసి నిబంధనల ప్రకారం జాబితాను పంపించి ఉంటే ఆమోదం లభించేది. కానీ.. ఆయన అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ, నిబంధనలు తోసిరాజని ఢిల్లీకి గత నెలలో ఫైలు పంపించారు. ఈ ఫైలుపై అనేక అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం లేవనెత్తి, వీటిపై సమగ్రంగా సమాధానాలు పంపించాలని తాజాగా ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఫైలు లేదంటూ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) కొర్రీలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపించింది. కన్ఫర్డ్ ఫైలు ఢిల్లీకి వెళ్లింది, సెప్టెంబర్ చివరి నాటికి ఆమోదం వస్తుందని, అక్టోబర్ నెలలో పోస్టులు దక్కించుకుందామని ఆశించిన పలువురు రెవెన్యూ అధికారుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందంటున్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో ఇష్టారాజ్యం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ ద్వారా గ్రూపు వన్ ఉద్యోగ నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. జోనల్ కారణం, ఇతరత్రా కారణాలు సాకుగా చెప్పి ఉద్యోగ నియమాకాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా తెలంగాణలో స్టేట్ సివిల్ సర్వీసు నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యే విధానంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ వన్ సర్వీసుకు ఎంపికైన అధికారులు మాత్రమే ఐఏఎస్‌గా కన్ఫర్డ్ (పదోన్నతి) అర్హత సాధించేవారు. అర్హత సాధించిన వారిలో కొందరికి మాత్రమే ఐఏఎస్ పదోన్నతి లభించేది. ఇందులో కూడా పైరవీలు, సిఫారసులు ఉన్నవారికి మాత్రమే దక్కేవన్న మాటలో వాస్తవమున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంపీడీవో స్థాయి అధికారికి కూడా ఐఏఎస్ కన్ఫర్డ్ లభించిందంటే ఆ పదవిని ఎంతగా దిగజార్చారనేది సుస్పష్టమవుతున్నదని సీనియర్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసులకు ఎంపిక కావడం కోసం కొన్ని లక్షల మంది ఔత్సాహికులు పోటీపడి, అందులో కొన్ని వేల మంది మాత్రమే ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తారు. ప్రిలిమ్స్‌లో పాస్ అయినా, అందులో ఇంటర్వ్యూకు వందల సంఖ్యలో మాత్రమే పిలుపు వస్తుంది. ఇలా వడపోత తరువాత రెండు మూడు వందల లోపే ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికవుతారు. శిక్షణ తరువాత ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాలకు కేటాయిస్తారు.

ముందే అభ్యంతరం చెప్పిన డీపీసీ

ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లు (ప్రొ డీసీలు), ప్రమోటీస్ (ప్రొ డీటీలు) మధ్య వివాదం కారణంగా కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఐఏఎస్ పదోన్నతుల అంశం పెండింగ్‌లో ఉంది. ఈ రెండు వర్గాల మధ్యనున్న వివాదాన్ని అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సర్ధుబాటు చేయించారు. ఆ తరువాత ప్రొబెషనరీ డీటీ నుంచి సెలెక్షన్ గ్రేడ్ వరకు పదోన్నతి పొందిన అధికారులతో సీనియార్టీ జాబితాను రూపొందించారు. ఈ జాబితాను జూలై నెలలోనే సిద్ధం చేసి తుదిరూపు తీసుకువచ్చారు. రాష్ట్ర నిబంధనల ప్రకారం డిప్యూటీ డైరెక్టర్ పై స్థాయి అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సచివాలయంలోని ఉన్నతాధికారులో డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఉంటుంది. ఈ కమిటీకి జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్ గా ఉన్నారు. స్టేట్ సివిల్ సర్వీసు అధికారుల సీనియార్టీ జాబితాను ఈ కమిటీ ఖరారు చేస్తుంది. అయితే ఈ సీనియార్టీ జాబితాపై కన్వీనర్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు ఇలా ఉన్నాయి. పాత ప్యానెల్ ప్రకారం పదోన్నతుల జాబితా ఇప్పుడు తయారు చేయడం సరికాదని అన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించలేదని, వార్షిక పనితీరు (ఏసీఆర్) నివేదికలు కూడా పొందుపర్చలేదన్నారు. ఎవరెవరిపై శాఖాపరమైన, విజిలెన్స్, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కేసులు ఎన్ని ఉన్నాయనేది జతపర్చలేదు. సీనియార్టీ జాబితాలో రిటైర్డు అయిన వారి పేర్లు కూడా పొందుపర్చాలి, పదవీ విరమణ చేశారని జాబితా నుంచి ఎలా తీసివేస్తారని ఆయన లేవనెత్తారు. నిబంధనల ప్రకారం ఫైలు లేదని, అన్నీ తప్పులే ఉన్నాయని అభ్యంతరం తెలిపారు. 2020-21 జనవరి 1వ తేదీ నాటికి 56 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఎందరున్నారంటూ ప్రశ్నించారు. వీటిని సరి చేసిన తరువాత మళ్లీ ఫైలు పంపించాలని తన నోట్ లో కమిటీలో సభ్యుడు అయిన రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ వివరాలు అన్ని పొందుపరిస్తే చాలా మంది పేర్లు తొలగించాల్సి వస్తుందని, సీనియార్టీ తల్లకిందులు అవుతుందని అంచనా వేశారు. ఇవేమీ పట్టించుకోకుండా సీనియార్టీ ఫైలును సిద్ధం చేశారు. ఈ లోపు నవీన్ మిట్టల్ ఇంధన శాఖకు బదిలీ కావడం, ఆయన స్థానంలో డిఎస్.లోకేశ్ కుమార్ జూన్ రెండో వారంలో రెవెన్యూ కార్యదర్శిగా నియమించారు. లోకేశ్ కూడా సీనియార్టీకి ఆమోదం తెలిపారు. అయితే ఆయన మేడ్చల్ జిల్లా డీఆర్ఓ జేఎల్బీ. హరిప్రియ పేరును చేర్చాలని కోరగా, ఏమైందో ఏమో కాని చేర్చలేకపోయారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ తరువాత సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ పొలిటికల్) ఎం.రఘునందన్ రావు తో ఆమోద ముద్ర వేయించుకుని, ప్రధాన కార్యదర్శి కే. రామ‌కృష్ణారావు వద్దకు పంపించడంతో ఆయన కూడా ఆమోదం తెలిపారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత నెల 20వ తేదీన ఐఏఎస్ (కన్ఫర్డ్) కోసం అర్హులైన వారి జాబితాను ఢిల్లీకి ప్రత్యేక దూత ద్వారా పంపించారు. మొత్తం ఖాళీలు 21 ఉండగా, 61 మందితో జాబితాను పంపించారు. మరో నలుగురు పేర్లను త్వరలో అందచేస్తామని ఢిల్లీలో యూపీఎస్సీ అధికారులకు తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరుకు కన్ఫర్డ్ వస్తుందని అందరూ ఆశల పల్లకిలో ఊరేగారు. కానీ అంచనాలు తల్లకిందులు అయ్యాయి.

యూపీఎస్సీ పలు అభ్యంతరాలు

అసలు సీనియార్టీ జాబితాను ఎవరు ధృవీక‌రించారో స్పష్టత లేదని, కార్యదర్శి సంతకంతో ధృవీక‌రించలేదని యూపీఎస్సీ లోపాన్ని ఎత్తి చూపింది. పదోన్నతులకు ఆమోదం తెలిపిన కమిటీ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు కూడా పంపించాలని కోరింది. ఇందులో పలువురి ఏసీఆర్ లు, రివ్యూ అథారిటీ ధృవపత్రం, యాక్సెప్టింగ్ అథారిటీ రిమార్కులు జతపర్చలేదని తెలిపింది. ఇలా తప్పుల తడకతో ఉన్న వివరాలు నిబంధనల ప్రకారం సరిచేసి మళ్లీ పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కోరింది. యూపీఎస్సీ అడిగిన విధంగా వివరాలు సరిచేసి పంపిస్తే, 2022, 2023, 2024 సంవత్సరాల ప్రకారం ఐఏఎస్ ల కన్ఫర్డ్ (పదోన్నతి) పూర్తవుతుంది లేదంటే పెండింగ్ లో పడుతుందంటున్నారు.