Site icon vidhaatha

Anirudh reddy criticism  | అనిరుధ్‌ విమర్శలతో కాంగ్రెస్‌లో కాక! ఆయన వ్యాఖ్యల వెనుక ఓ కీలక నేత?

Anirudh reddy criticism  | హైదరాబాద్, జూలై 4 (విధాత) :  ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేసిన తాజా విమర్శలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌ పర్యటనకు ఒకరోజు ముందు అనిరుధ్ రెడ్డి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన అదను దొరికినప్పుడల్లా ఏమాత్రం సంకోచించకుండా నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక నాయకుడి ప్రోద్బలంతోనే ఈ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని గాంధీభవన్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ ‘సామాజిక న్యాయ భేరి’లో పాల్గొనేందుకు మల్లికార్జున్ ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. ఆయన రాకకు ఇరవై నాలుగు గంటల ముందు.. చంద్రబాబును టార్గెట్‌ చేసుకుని అనిరుధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నరాని, వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చేసుకుంటూ దందాలు చేసుకుంటున్నారని విమర్శరించారు. వీరి ఇళ్లకు ఉన్న నల్లా కనెక్షన్లు, విద్యుత్ సరఫరాను నిలిపివేసిన మరుక్షణం వారంతా చంద్రబాబు దగ్గరకు క్యూ కట్టి బనకచర్లను ఆపమని అడుక్కుంటారని అన్నారు. ఈ విమర్శలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.

గతేడాది చివరలో తిరుమలలో తెలంగాణ భక్తులకు కలుగుతున్న అసౌకర్యం, తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల బుట్టదాఖలుపై అనిరుధ్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఆయన తిరుమల వెళ్లిన సందర్భంలో టీటీడీ అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, వసతికి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే లేఖలను అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ భక్తులు తెలంగాణలో దేవాలయాలకు వచ్చిన సందర్భంలో ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీల లేఖలను తెలంగాణ ప్రభుత్వ అధికారులు అనుమతిస్తూ గౌరవిస్తున్నారని చెబుతూ.. సిఫారసు లేఖలతో వచ్చే తెలంగాణ భక్తులను ఏపీలోని పుణ్య క్షేత్రాల్లో ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. వాళ్లు ఫోన్ చేసి చెప్పినా భద్రాచలం, యాదగిరిగుట్టలో దర్శనాలు అయిపోతున్నాయన్నారు. తన నియోజకవర్గం నుంచి భక్తులు తిరుమలకు వెళ్తే కనీసం గది కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ తనకు సమానమని, రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ కన్ను తీసేసుకున్నారా? అని ప్రశ్నించారు. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వైసీపీ వారు తెలంగాణలో దర్జాగా వ్యాపారం చేసుకున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం వారు హైదరాబాద్ వచ్చి వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఈ విమర్శలు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో పెద్ద దుమారాన్ని లేపాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం పద్ధతి కాదని, నిన్నటి వరకు అందరం కలిసే ఉన్నామని, ఆ విషయాన్ని మరిచిపోతే ఎలా అని చంద్రబాబు వైఖరిని నిలదీశారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ప్రాముఖ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిన తర్వాతే చంద్రబాబు సానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ ఎమ్మెల్యేలు సంతృప్తి చెందడమే కాకుండా వివాదానికి ముగింపు పలికారు.

ఖర్గే రాకకు ముందు, అంతకు ముందు తిరుమలలో అనిరుధ్ రెడ్డి చేసిన విమర్శలు తెలంగాణలో ఒక ముఖ్య నాయకుడి మద్దతుతో చేసినవేనని కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఒక మంత్రి సిఫారసుతో జడ్చర్ల టికెట్‌ను అనిరుధ్‌ దక్కించుకుని విజయం సాధించిన విషయం విదితమే. వాస్తవానికి జడ్చర్ల నుంచి ఎర్ర శేఖర్‌కు ఇవ్వాలని అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి భావించారు. ఎంపీ మల్లు రవి కూడా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రత్యేక పరిస్థితులు అనిరుద్ధ్‌కు అనుకూలించాయి. తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కాని అనిరుధ్‌కు జడ్చర్ల నుంచి ఇవ్వాల్సిందేనంటూ ఒక మంత్రి పట్టుబట్టడం వల్ల రేవంత్ రెడ్డి, మల్లు రవి అంగీకరించారని ఒక కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. గెలిచిన తరువాత ఆయన ఒక ముఖ్య నాయకుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని గాంధీ భవన్ నాయకులు అనుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని గురువారం మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Exit mobile version