Site icon vidhaatha

Mallikarjun Kharge | మోదీ స‌ర్కారును సాగ‌నంపాలి: ఖ‌ర్గే

Mallikarjun Kharge

విధాత‌: పెరుగుతున్న‌ ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నియంత్రించ‌లేని కేంద్రంలోని మోదీ స‌ర్కారును సాగనంపాల‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే పిలుపునిచ్చారు. దేశ‌వ్యాప్తంగా కూర‌గాయ‌ల ధ‌రలు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం ట్విట్ట‌ర్‌లో కేంద్రం అస‌మ‌ర్థ‌త‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాటా ప్రకారం.. విశాఖపట్నంలో టమాట‌ ధర కిలో రూ.160కి చేరింది. నిరంత‌ర వ‌ర్షాల కార‌ణంగా ర‌వాణా స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డి దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ టమాట‌ ధరల కిలోకు రూ.155కి చేరుకున్నాయి. మెట్రోలలో, రిటైల్ ట‌మాట‌ ధరలు కిలోకు రూ.58-148 పరిధిలో ఉన్నాయి.

కోల్‌కతాలో అత్యధికంగా రూ.148, ముంబైలో అత్యల్పంగా కిలో రూ.58 ప‌లుకున్న‌ది. ఢిల్లీ, చెన్నైలలో కిలో రూ.110, రూ. 117గా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా స‌గ‌టున‌ కిలోకు రూ.83.29, మోడల్ ధర కిలోకు రూ.100 ప‌లుకుతున్నాయి.

నిరుద్యోగిత రేటు 8.45 శాతం “మోదీ ప్రభుత్వ దోపిడీ కారణంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ, బీజేపీ మాత్రం అధికార దాహంలో మునిగిపోయింది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో నిరుద్యోగిత రేటు 8.45 శాతానికి పెరిగింది. గ్రామాల్లో నిరుద్యోగ రేటు 8.73%గా ఉంది” అని ఖర్గే హిందీలో ట్వీట్ చేశారు.

Exit mobile version