(విధాత ప్రత్యేకం)
KRMB | నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో తెలంగాణను తెచ్చుకున్నప్పటికీ.. ఆ అజెండాలోని నీళ్లను మాత్రం తెలంగాణ సాధించుకోలేక పోతున్నది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా లెక్కల వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికి.. గత కేటాయింపుల మేరకు చూసినా నదీ జలాల తరలింపు, వాడకంలో తెలంగాణ వాటా జలాలను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతునే ఉంది. ప్రస్తుత నీటి సంవత్సరం (2024-25)లో కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ వెల్లడించిన లెక్కలను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతున్నది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 1043.5 టీఎంసీల కృష్ణా జలాల లభ్యతలో ఏపీ, తెలంగాణ మొత్తం 990.382 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకున్నాయి. అందులో ఏకంగా 72.2 శాతం (715.031 టీఎంసీలు) ఏపీ వాడుకుంది. తెలంగాణ 27.8 శాతం (275.35 టీఎంసీలు) మాత్రమే వినియోగించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న కృష్ణా జలాల కేటాయింపు 66:34 నిష్పత్తి మేరకు చూసినా.. తెలంగాణ తన న్యాయమైన వాటాలో 68 టీఎంసీలను నష్టపోగా ఆ మేరకు ఏపీ లాభపడిందని కృష్ణా బోర్డు సాక్షిగా తేలిపోయింది. ఈ నివేదికలోని అంశాలుఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేకపోతున్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్ రచ్చ చేస్తుండగా.. ఇదంతా గతంలో బీఆరెస్ సర్కారు చేసిన ఒప్పందాల నిర్వాకమేనంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది.
ఏపీ జల దోపిడీ గణాంకాలు
ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అత్యధికంగా 208.649 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. మల్యాల లిప్టు ద్వారా 28.36 టీఎంసీలు, మల్యాల నుంచి కేసీ కాల్వకు 1.192 టీఎంసీలు, ముచ్చుమర్రి లిఫ్టు ద్వారా 3.490 టీఎంసీలు, చెన్నైకి నీటి సరఫరా పేరిట 1.886 టీఎంసీలు కలిపి ఏపీ మొత్తం 243.58 టీఎంసీలు తోడుకుంది. నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 188.169 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 29.456 టీఎంసీలు సహా 217.62 టీఎంసీలను ఏపీ వాడుకుంది. ప్రకాశం బరాజ్ నుంచి 156.050 టీఎంసీలు, తుంగభద్ర, సుంకేశుల నుంచి 35.448, మున్నేరు నుంచి 4.122 టీఎంసీలు వాడుకుంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీ మొత్తం 715.031 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకున్నట్టు బోర్డు లెక్క తేల్చింది.
నీటి వినియోగంలో తెలంగాణ వెనుకబాటు
ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా ప్రాజెక్టులు, శ్రీశైలం నుంచి కల్వకుర్తి లిఫ్టు ద్వారా 46.751 టీఎంసీలు, చెన్నైకి నీటి సరఫరా నుంచి 0.943 టీఎంసీలు కలిపి మొత్తం 47.694 టీఎంసీలను మాత్రమే తెలంగాణ వాడుకుంది. నాగార్జున సాగర్ నుంచి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు అవసరాలకు 41.424 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 115.480 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 14.379 టీఎంసీలు కలిపి మొత్తం 171.283 టీఎంసీలను రాష్ట్రం వాడుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి మరో 42.254 టీఎంసీలు, డిండి, మూసీ, పాకాల వంటి ఇతర ప్రాజెక్టుల నుంచి మరో 8.42 టీఎంసీలు కలిపి ఈ ఏడాది తెలంగాణ మొత్తం 275.350 టీఎంసీలను మాత్రమే వాడుకోగలిగింది.
మిగిలింది 53.124టీఎంసీలు
ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 1043.5 టీఎంసీల జలాల లభ్యత ఉందని కృష్ణా బోర్డు తేల్చింది. ఇందులో ఏపీ వాడిన 715.031 టీఎంసీలు, తెలంగాణ వాడిన 275.35 టీఎంసీలు పోగా ప్రస్తుతం మరో 53.12 టీఎంసీలు మిగిలాయి. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో కనీస నిల్వ మట్టానికి (ఎండీడీఎల్) ఎగువన 9.176 టీఎంసీలతో పాటు ఇతర జలాశయాల్లో మరో 43.94 టీఎంసీలు కలిపి మొత్తం 53.12 టీఎంసీలు ఇంకా అందుబాటులో ఉన్నాయి.
66:34 నిష్పత్తిలో తెలంగాణకు 68.053 టీఎంసీల నష్టం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గతంలో కుదిరిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారం 66.34 నిష్పత్తిలో కృష్ణా జలాల వాటా పంపకాల మేరకు చూస్తే మొత్తం 1043.5 టీఎంసీల నీటి లభ్యతలో ఏపీకి 688.714 టీఎంసీలు, తెలంగాణకు 354.792 టీఎంసీల వాటా లభించాలి. ఈ లెక్కన తెలంగాణ ఈ ఏడాది వాడుకున్న జలాలు పోగా ఇంకా 77.229 టీఎంసీలను వాడుకోవడానికి హక్కు కలిగి ఉండనుంది. ఏపీ వాటాకు మించి 68.053 టీఎంసీలను వాడుకోవడంతో తెలంగాణ ఆ మేరకు నీటి వాటాను కోల్పోయింది. ఉమ్మడి జలాశయాల్లో మిగిలి ఉన్న మొత్తం 9.176 టీఎంసీలను తెలంగాణకే కేటాయించినా కూడా హక్కుగా లభించాల్సిన వాటాల్లో మరో 68.053 టీఎంసీల లోటును రాష్ట్రం ఎదుర్కోనుంది.
50:50 నిష్పత్తిలో మరింత నష్టం
కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలో పంపకాలు జరపాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలిక సర్దుబాటు ప్రకారం 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణ చేస్తున్న 50:50 నిష్పత్తి మేరకు చూస్తే మొత్తం నీటి లభ్యత 1043.506 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణకు చెరో 521.753 టీఎంసీల హక్కులుంటాయి. ఈ లెక్కన కృష్ణా జలాల్లో తెలంగాణకు ప్రస్తుత నీటి సంవత్సరంలో బేసిన్‌లో ఇంకా 246.403 టీఎంసీల వాటా జలాలు వాడకానికి మిగిలి ఉన్నట్లే. ఈ లెక్కల మేరకు ఏపీ వాటాకు మించి 235.01 టీఎంసీలను వాడుకోవడంతో ఈ మేరకు నీటి వాటాను తెలంగాణ నష్టపోయింది. ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ల పరిధిలో చూస్తే ఏపీ వాటాకు మించి 235.013టీఎంసీలు వాడింది. ఆ లెక్కన తెలంగాణకు 244.190 టీఎంసీలు మిగిలి ఉండటం గమనార్హం.