కృష్ణా ప్రాజెక్టుల పెండింగ్.. నీళ్ల చుట్టు పార్టీల కుర్చీలాట!

కృష్ణా జలాల చుట్టూ తెలంగాణలో 'కుర్చీలాట' మొదలైంది. నీళ్ల సెంటిమెంట్‌తో కేసీఆర్, అభివృద్ధి లెక్కలతో రేవంత్ రెడ్డి పరస్పర సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రజల ప్రయోజనం కంటే రాజకీయమే పరమావధిగా సాగుతున్న విశ్లేషణ.

విధాత : తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నది జలాల హక్కుల సాధనలో ఇన్నాళ్లుగా అటు ఉమ్మడి రాష్ట్రాన్ని, ఇటు స్వరాష్ట్రాన్ని ఏలిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ లదే పూర్తి బాధ్యత అన్న వాదన వినిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ప్రాజెక్టులో కేసీఆర్ లేవనెత్తిన అంశాలు గతంలోనూ తరుచూ వినిపించినవే. అందులో కొత్తగా చెప్పిన అంశాలేవి లేకపోవడం..జరిగిన తప్పులలో మూడు పార్టీల ప్రభుత్వాల పాత్ర ఉండటం నిర్వివాదంశం. కాకపోతే ఒకరిది ఎక్కువ..మరొకరిది తక్కువ. నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల ప్రాజెక్టుల అసంపూర్తి వ్యవహారంలో ఆ మూడు పార్టీలది తిలా పాపం తలా పిడికెడు. ఇందులో నెపాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై నెట్టేసే ప్రయత్నంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి.

నీళ్ల చుట్టు పార్టీల కుర్చీలాట

ముఖ్యంగా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తిరిగి రాజకీయంగా పుంజుకునేందుకు..అధికార కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు నీళ్ల నిప్పులను..సెంటిమెంట్ ను రాజేస్తుంది. మూడు జిల్లాలో బహింరంగ సభలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకంతోనే కృష్ణా జలాల అంశంలో నష్టం వాటిల్లుతుందంటూ జనంలో పట్టు సాధించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. “తెలంగాణ సమాజం మళ్లీ మేల్కొనాలి” అనే నినాదంతో మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90టీఎంసీల కేటాయింపుల కోసం పోరాడితే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరించిందని విమర్శిస్తున్నారు. బనకచర్ల స్థానంలో ఏపీ తెచ్చిన పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మూడు జిల్లాల కృష్ణా ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి అన్యాయం చేసిందే కేసీఆర్ అని గణంకాలతో కాంగెస్ ఎదురుదాడి చేస్తుంది. కేసీఆర్ ఒక్క మోటార్ ఆన్ చేసి బంద్ చేశారని, ఒక్క కాలువ కట్టలేదని, ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని ఆరోపిస్తుంది. గతంలో ఎస్ ఎల్ బి సి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు గుర్తు చేస్తూ.. ఆయన నీళ్ల రాజకీయాలపై ప్రశ్నలు సంధిస్తుంది.

సెంటిమెంట్ రాజకీయమే బీఆర్ఎస్ బలం

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద కంటే మరోసారి నీళ్ల సెంటిమెంట్ ను రెచ్చగొట్టడంపైన బీఆర్ఎస్ రాజకీయం కొనసాగుతుండటం ఆ పార్టీ బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తున్నారంటూ కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలకు ముందు నల్లగొండలో ఫిబ్రవరి 13న బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన రాజకీయ ప్రయోజనం దక్కకపోగా..జీరో సీట్లతో దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు మరోసారి అదే నీళ్ల సెంటిమెంట్ ను నమ్ముకుంటుండటం ఆసక్తికరం. త్వరలో పార్టీ గుర్తులతో జరుగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మరోసారి నీళ్ల సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి.

సవాళ్లతో రాజకున్న నీళ్ల రాజకీయం

అటు కేసీఆర్ ఎత్తగడల రాజకీయాలతో పోరాడి రాటు దేలిపోయిన..ఏకంగా సీఎం పీఠాన్ని ఎగరేసుకుపోయిన రేవంత్ రెడ్డి సైతం తగ్గేదేలే లేదంటూ కృష్ణా జలాలపై మూడు జిల్లాలకు ఎవరెంత అన్యాయం చేశారో చర్చిద్దామంటూ సవాల్ విసురుతున్నారు. బహిరంగ సభలు ఎందుకు..ప్రతిపక్ష నేతగా శాసన సభకు రా…చర్చిద్దామంటూ సవాల్ చేస్తున్నారు. రేవంత్ సవాల్ కు కేసీఆర్ స్పందించి 29నుంచి జరిగే శాసన సభ సమావేశాలకు వస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. కేసీఆర్ కు కు రేవంత్ కు మధ్య నది జలాలు..ఇతర అంశాలపై సాగుతున్న విమర్శల యుద్ధం చూస్తే అసెంబ్లీ సమావేశాలు ఏ దారిలో సాగుతాయో విస్పష్టమే. పరస్పర విమర్శలు ఆరోపణలతోనే సమావేశాలు కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యలు బిల్లులు పై చర్చ ఇక నామమాత్రంగానే జరుగుతుందనడంలో సందేహం అక్కరలేదు. వాస్తవానికి 8 నెలల తర్వాత ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చిన కేసీఆర్ మీడియా సమావేశంలో కృష్ణాజలాల పాత సెంటిమెంట్ ను లక్ష్యంగా చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడికి దిగారు. కవిత తిరుగుబాటు అంశం..బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం సమస్యలపై ఆయన మీడియా ప్రశ్నలను వాయిదా వేయడం ఆయనలోని పలాయన వాదిని చాటిచెప్పిందంటున్నాయి ప్రతిపక్షాలు.

మరోసారి చంద్రబాబునే అస్త్రం

రాజకీయంగా జవసత్వాలు సాధించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మరోసారి నీళ్ల సెంటిమెంట్ ను వాడటంతో పాటు గతంలో మాదిరిగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును అస్త్రంగా చేసుకోవడం గమనార్హం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కూటమిని దెబ్బకొట్టేందుకు తెలంగాణ సమాజం ముందు చంద్రబాబును బూచీగా ప్రచారం చేసి విజయం సాధించిన కేసీఆర్ మళ్లీ ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబునే అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడికి దిగడం ఆసక్తికరం. ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబు భాగస్వామి కూడా కావడంతో ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్నట్లుగా నది జలాల సమస్యతో చంద్రబాబును, రాష్ట్రంలోని కాంగ్రెస్ ను, రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీని ముగ్గురిని దెబ్బ కొట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. కేసీఆర్ తన మీడియా సమావేశంలో 10సార్లకు పైగా చంద్రబాబు పేరు చెప్పినా..ఒక్కసారైనా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించని తీరు ఈ సందర్భంగా గమనార్హం. చంద్రబాబును బూచిగా చూపి రాజకీయపబ్బం గడుపుకోవాలనుకునే కేసీఆర్ ఎత్తుగడ ఈ ధఫా ఎంతమేరకు ఫలిస్తుందన్నది ప్రజలే తేల్చాల్సిఉంది.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy vs KCR : ప్రజాస్వామ్యంలో అహంకార రాజకీయం
Harish Rao : కేసీఆర్ చలవతోనే సీఎంగా రేవంత్ రెడ్డి

Latest News