Revanth Reddy vs KCR : ప్రజాస్వామ్యంలో అహంకార రాజకీయం

జాస్వామ్యంలో అధికారం ప్రజలదే అయినా… సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అహంకార రాజకీయాలకు అద్దం పడుతున్నాయా? తెలంగాణ రాజకీయాలపై విశ్లేషణ.

Revanth Reddy vs KCR

విధాత : తెలంగాణ రాజకీయాల్లో అహంకారపు ధోరణులు జడలు విరుచుకుంటున్న ఘట్టాలు తరుచూ రాష్ట్ర వాసులు చూస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో అహంకారపు, ఆధిపత్యపు అధికార రాజకీయాలు విసుగెత్తిపోయిన ప్రజలు..కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడారు. కాంగ్రెస్ 420హామీలు..ఆరు గ్యారంటీల మాటల కంటే బీఆర్ఎస్ కుటుంబ ఆధిపత్య పాలనపై విరక్తితోనే ప్రజలు అధికార మార్పిడికి మొగ్గుచూపి కాంగ్రెస్ ను గద్దెనెక్కించారు. నన్ను చూసి ఓటేయ్యండని.. బీఆర్ఎస్ ను ఓడిస్తే ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటానన్న కేసీఆర్ ను ఆయన మాట మేరకు అక్కడికే పంపించేశారు. ఎమ్మెల్యేలను, మంత్రులను అనుమతి లేకుండా ప్రగతి భవన్ లో అడుడుపెట్టనివ్వని గడీల పాలన తరహాలో సాగిన కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరించారు. ఇదంతా ప్రజలు ప్రజస్వామికయుతమైన ఎన్నికల ప్రక్రియతోనే చేసి చూపించారు. ఏ ప్రజాతీర్పుతో ప్రజాస్వామిక ప్రక్రియతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారో…ఇప్పుడు అదే ప్రక్రియను ఆయన ఓవర్ టేక్ చేసే పరిస్థితికి వచ్చినట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి. పదేళ్లు నేనే సీఎంగా ఉంటానని..నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి రానివ్వనని…ఇదేనా శపథం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకు అతీతంగా..అహంకార పూరితంగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రజస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడుతాయని.. సీఎంలను లెజిస్లేచర్స్ పార్టీలు ఎన్నుకుంటాయన్న సంగతి రేవంత్ రెడ్డి్కి తెలియంది కాదు. అంతేందుకు రేవంత్ రెడ్డిపై పాతిక మంది ఎమ్మెల్యేలు అసమ్మతి ప్రకటిస్తే..ఆయనే గద్దె దిగాల్సిన పరిస్థితి. ఇంతటి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా సమూహం నిర్ణయించాల్సిన అధికార ఎవరిదన్న అంశాన్ని..తన నిర్ణయమన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత శపథాలు చేయడం అహంకార పూరిత రాజకీయమేనని..ఇది కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోకినట్లుగా ఉందని విశ్లేషకులు చురకలేస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అధికారం, ప్రభుత్వాల ఏర్పాటు ప్రజల నిర్ణయానుసారమే అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి సీఎం స్థాయి వ్యక్తి వ్యక్తిగత శపథాలకు దిగడం విడ్డూరం. తెలంగాణ రాజకీయం ఇప్పుడు సైద్దాంతిక,విధానపర విమర్శలను, పాలనా వైఫల్యాలపై విమర్శలను మానేసి వ్యక్తిగత విమర్శలకు దూషణలకు వేదికవ్వడం విచారకర పరిణామం.

నాటి శపథాలు..హామీల మాటేమిటో

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలపై విచారణ చేసి వారిని జైళ్లో పడేస్తామని..తిన్నదంతా కక్కిస్తామని జోరుగా డైలాగ్ లు పేల్చారు. ఇప్పుడేమో అధికారంలో ఉండి కేసీఆర్ ఫామ్ హౌస్ లో స్వీయ బంధీ అయ్యారని..ఆయన పాపానికి ఆయన పోతారంటూ చెబుతున్నారు. అలాంటప్పుడు నాటి ఎన్నికల శపథాలు..హామీలు ఉత్తమాటలేనా అన్న ప్రశ్న సహజంగానే వినిపించక తప్పదు. ఎవరి పాపాలకు వారే పోతారన్నప్పుడు..కాళేశ్వరం అక్రమాలు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, థర్మల్ ఫ్లాంట్ల నిర్మాణాల్లో అవతవకాలపై, ఓఆర్ఆర్ లీజులపైన విచారణ కమిషన్ల నియామకం, ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్ వంటి కేసులు..విచారణల ప్రహసనం ఎందుకో రేవంత్ రెడ్డికే తెలియాలి. పాపంతో పోయేదానికి ప్రజాధనం కోట్లలో ఖర్చు చేసి విచారణలు ఎందుకో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించకపోతే కేంద్రంలోని బీజేపీని సైతం రేవంత్ విమర్శించారు. తీరా అనుమతించాక..కేటీఆర్ అరెస్టుపై ఊసు లేదు. గత ప్రభుత్వాల హయాంలో అవినీతి, అక్రమాలపై విచారణలు చేయడం..ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం రాజ్యాంగ బద్ద ప్రభుత్వాల బాధ్యత. రాజకీయ కక్షల పేరుతో అక్రమ కేసులు పెడితే తప్ప..అలాంటి రాజ్యాంగ బాధ్యతలను అధికార పార్టీ నిర్వర్తిస్తే ఎవరైన స్వాగతిస్తారు. ఇక రేవంత్ రెడ్డి శపథాల జాబితాలో గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానడం కూడా ఉండనే ఉంది.

అప్రజాస్వామిక విధానాలలోనూ పోటీనే

అహంకార ధోరణిలోనే కాదు..అప్రజాస్వామిక విధానాల్లోనూ క్రమంగా బీఆర్ఎస్ పాలకులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోటీపడుతుందంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. మా ఏడవ గ్యారంటీ ప్రజాస్వామిక స్వేచ్ఛ అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా భూసేకరణ సందర్భంగా తలెత్తిన ఉద్యమాలపై గత ప్రభుత్వం దారిలోనే అణిచివేత చర్యలను అమలు చేశారు. ఇందుకు లగచర్ల, ఫార్మాసిటీ, హెచ్ సీయూ భూముల వివాదాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఇకపోతే పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దాచిపెట్టడంలోనూ బీఆర్ఎస్ పాలకులకు రేవంత్ సర్కార్ తీసిపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూన్ 02, 2014 నుంచి ఆగస్టు 18, 2019 వరకు 1,04,171 జీవోలు తెస్తే అందులో 60,709 జీవోలను మాత్రమే పబ్లిక్ డోమైన్ లో ఉంచి ఏకంగా 43,462 ప్రభుత్వ జీవోలు దాచారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 07-12-2023 నుంచి 26-01-2025 వరకు అంటే మొత్తం 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. రహస్య జీవోలతో ప్రజాస్వామిక ప్రభుత్వాల పాలనను అపహస్యం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దొందు దొందే అనడంలో అతిశయోక్తి లేదంటున్నాయి ప్రజా సంఘాలు.

ఇవి కూడా చదవండి :

MEGA 158: చిరంజీవి కూతురిగా యంగ్ హీరోయిన్? మోహన్‌లాల్ ఎంట్రీతో భారీ అంచనాలు
Panaji Hyderabad Highway | ఆ రహదారి పూర్తయితే పనాజీకి ప్రయాణం ఏడు గంటల్లోనే! 

Latest News