విధాత, హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ కిమ్స్ సహా నాలుగు సూపర్ స్పెషల్టీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా ఆసుపత్రుల నిర్మాణాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందన్న మాజీ మంత్రి టి.హరీష్ రావు వ్యాఖ్యలను వెంకట్ రెడ్డి తోసిపుచ్చారు. మీలాగా మాది మాటల ప్రభుత్వం కాదన్నారు. సనత్ నగర్ ఆసుపత్రిని ఆక్టోబర్ 31న, రూ.2వేల కోట్లతో చేపట్టిన నిమ్స్ వచ్చే డిసెంబర్ కు, అల్వాల్ ఆసుపత్రి మార్చికి, ఎల్బీ నగర్ వచ్చే జూన్ లో పూర్తవుతుందని తెలిపారు.
వచ్చే దసరాకు…ఉప్పల నారాపల్లి ఫ్లైఓవర్
ఉప్పల్ వరంగల్ హైవేపై ఉన్న 8కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారని..మా ప్రభుత్వం వచ్చేదాక 30శాతం పనులు పూర్తి కాలేదన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో కాంట్రాక్టు కంపెనీనిను మార్చి వచ్చే దసరా నాటికి పనులు పూర్తి జరిగేలా చూస్తున్నామన్నారు. గతంలో ఈ దసరాకే ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయిస్తానని చెప్పిన మంత్రి వెంకట్ రెడ్డి..ఇప్పుడు వచ్చే దసరా అంటూ మాడ్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.