విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో హైడ్రా రూ.1003కోట్ల విలువైన ప్రభుత్వం భూమిని కాపాడింది. అక్కడ గజం స్థలం రూ. 2 లక్షలు. అలాంటి ప్రాంతంలో పార్కును 150 గజాల మేర కబ్జాకు గురైన రూ. 3 కోట్ల విలువైన భూమితో పాటు ఎకరం రూ. 200ల కోట్లు విలువైన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలోని ఖానామెట్ ప్రాంతంలోని రూ.1000 కోట్ల విలువైన 5 ఎకరాలను భూముల ఆక్రమణలను హైడ్రా తొలగించి మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ వేసి..హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.
ఈ ఐదు ఎకరాలను ప్రభుత్వం గతంలో వెలమ సంఘానికి కేటాయించింది. ఆ కేటాయింపులపై కొంతమంది అభ్యంతరం చెప్పడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదనుగా కబ్జారాయుళ్లు ఆక్రమణల పర్వానికి తెరదీశారు. ఈ రెండు కబ్జాలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా అధికారులు పరిశీలించారు. కబ్జాలను నిర్ధారించుకుని బుధవారం ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఇలా మొత్తం రూ. 1003 కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది.
