విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కార్పోరేషన్లు, 116మున్సిపాల్టీలలో 412 డివిజన్లు, 2569 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు చేపట్టింది. బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని చోట్ల సాయంత్రం 5గంటలలోపు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రం అంతటా కూడా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్వల్ప వాగ్వివాదాలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70శాతంపైగా పోలింగ్ జరిగినట్లుగా సమాచారం. అధికారిక పోలింగ్ లెక్కలను ఎన్నికలు సంఘం ప్రకటించాల్సి ఉంది.
పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసిన ఎన్నికల సిబ్బంది వాటిని భారీ పోలీస్ బందోబస్తు మధ్య లెక్కింపు కేంద్రాలకు తరలించారు. ఈనెల 13న ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు. మున్సిపాల్టోలలో అంతకుముందు 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 2 కార్పోరేట్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
