Local Body Elections High Court | కోర్టు తీర్పు నేడే.. నోటిఫికేషన్‌ విడుదలా నేడే! స్థానిక ఎన్నికలపై టెన్షన్‌ టెన్షన్‌!

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అక్టోబర్‌ 9, 2025న తీర్పు చెప్పనున్నది. అయితే.. అదే రోజు నోటిఫికేషన్‌ కూడా వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న టెన్షన్‌ రాజకీయవర్గాల్లోనే కాదు.. ప్రజల్లోనూ నెలకొన్నది.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (విధాత ప్రతినిధి)

Local Body Elections High Court | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకే వెళ్తాననే సంకేతాలు ఇస్తోంది. ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ఇదే రోజు తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రిజర్వేషన్ల అమలుకు హైకోర్టు సానుకూలంగా ఉంటే సమస్య లేదు. అయితే.. ప్రతికూల తీర్పు వెలువడితే ఏం జరుగుతుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తంగా స్థానిక ఎన్నకల ప్రక్రియ ముందుకు వెళుతుందా? లేక నిలిచిపోతుందా? రిజర్వేషన్ల అడ్డంకిని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది? రిజర్వేషన్లు చెల్లవని కోర్టు చెబితే పాత పద్ధతిని అనుసరిస్తారా? లేక కొత్తగా రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుందా? ఇలా అనేక అంశాలపై విశ్లేషకులు చర్చలు సాగిస్తున్నారు.

నేడు కొనసాగనున్న వాదనలు

తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9ని బీ మాధవరెడ్డి సహా పలువురు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరపున వాదనలతో విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సెల్ అభిషేక్ మనుసింఘ్వి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే అవకాశం ఉన్నందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సమ్మతించిన హైకోర్టు.. విచారణను గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 29న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ జారీచేయనుంది. ఈ నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ తరఫు న్యాయవాదులు బుధవారం విచారణ సందర్భంగా కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, గురువారం హైకోర్టులో విచారణ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంకా వాదనలు వినిపించనున్నారు. అన్ని వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేదే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా కూడా కోర్టులు జోక్యం చేసుకొన్న ఉదంతాలు కూడా లేకపోలేదు. మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తై బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఎన్నికను కోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ అయినా హైకోర్టు స్టే విధిస్తే పరిస్థితి ఏంటనే చర్చ కూడా లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసే చాన్స్‌ ఉందని సమాచారం. అధికార కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది. నోటిఫికేషన్ జారీ కాగానే నామినేషన్లు దాఖలు చేసేందుకు రెడీగా ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం నుంచి డీసీసీలకు సమాచారం వెళ్లింది. గురువారం ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలపై దిశా నిర్ధేశం చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వాదనలు ఎలా ఉండనున్నాయి?

రాష్ట్ర ప్రభుత్వం తరపున బుధవారం వాదనలు వినిపించిన అభిషేక్ మనుసింఘ్వి గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రస్తావించారు. దీంతో వ్యవస్థ ఎలా స్తంభించిపోతున్నదో వివరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు, జీవో జారీ అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఇంకా తమ వాదనలు వినిపించనుంది. గురువారం ప్రభుత్వం ఏం వాదనలు వినిపిస్తోందోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సమర్ధిస్తూ ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. గురువారం హైకోర్టులో జరిగే వాదనలకు సంబంధించి ఏజీ సుదర్శన్ రెడ్డితో మంత్రులు చర్చించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున రవికుమార్ వర్మ వాదనలు వినిపించే అవకాశం ఉందని సమాచారం.

ప్రభుత్వ వాదనకు పిటిషనర్లు ఎలా కౌంటరిస్తారు?

బుధవారం పిటిషనర్ల వాదనలు ముగిశాయి. గురువారం ఈ పిటిషన్‌లో ఇంప్లీడైన న్యాయవాదుల వాదనలను కోర్టు వింటుంది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటడంపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. బుధవారంనాటి వాదనల నేపథ్యంలో గురువారం హైకోర్టుకు పిటిషనర్ల తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలను బలపర్చేలా వాదించే అవకాశం లేకపోలేదు. రిజర్వేషన్ల పెంపు 50 శాతం పెంపు దాటొద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని…రాజ్యాంగంలో లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనను తిప్పికొట్టేలా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.