హైదరాబాద్, అక్టోబర్ 7 (విధాత ప్రతినిధి):
High Court Reservation | స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో 9పై అక్టోబర్ 8న (బుధవారం) తెలంగాణ హైకోర్టు విచారించనున్నది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
అందరిచూపు హైకోర్టు వైపే
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కల్పించడంతో రిజర్వేషన్లు 69 శాతానికి చేరాయి. పంచాయితీరాజ్ చట్టంలోని 285 సెక్షన్ ‘ఏ’ కు ఇది విరుద్దమని పిటిషనర్ మాధవరెడ్డి తరపు న్యాయవాదులు గత విచారణలో హైకోర్టులో వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా మెరిట్ ఆధారంగా పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు గతంలోనే తెలిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత దసరా సెలవుల తర్వాత విచారణ చేస్తామని అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 29న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనుంది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మూడు విడతల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై బుధవారం నాడు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు, బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.
రేవంత్ సమాలోచనలు
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై బుధవారం విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులతో చర్చించారు. మంగళవారం తన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ బీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున హైకోర్టులో దీనికి అనుగుణంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వ వాదనలను సమర్ధవంతంగా వినిపించాలని సీఎం సూచించారు. ఈ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్‌మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఈ విషయమై సింఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతం అమలు కావడంతో పాటు రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసిన అంశాలను ప్రభుత్వం హైకోర్టులో ప్రస్తావించనుంది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట దక్కింది. కానీ, హైకోర్టులో ఉన్న పిటిషన్ తలనొప్పిగా మారింది. హైకోర్టులో అడ్డంకిని అధిగమిస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ కు దక్కనుంది.
ప్రత్యామ్నాయాలున్నాయా?
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లను సవాల్ చేసిన పిటిషన్ కు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేదా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎన్నికల నిర్వహణకు సమయం కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ లోపుగా బీసీ రిజర్వేషన్ల అంశంపై టెక్నికల్ అంశాలను క్లియర్ చేసుకొనే వెసులుబాటు ప్రభుత్వానికి లభించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.