Telangana politics | సరసాలు.. సంచులు.. కాంట్రాక్టులు.. దందాలు! వీటి చుట్టూనే తెలంగాణ చర్చలు!

తెలంగాణలో విమర్శలు హుందాతనాన్ని ఎప్పుడో కోల్పోయాయి. అధికార పక్షంగా, ప్రతిపక్షంగా రాష్ట్రానికి మేలు చేయాల్సిన, మేలు చేసేందుకు పోరాడాల్సిన పార్టీల నాయకులు.. తాము ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న విషయాన్నిమర్చిపోయి.. బజారు భాష మాట్లాడుతున్నారన్న ఆవేదన గ్రామాల్లో సైతం వ్యక్తమవుతున్నది.

Telangana politics | హైదరాబాద్‌, జూలై 27 (విధాత): తెలంగాణ రాజకీయాలు కొంతకాలంగా సరసాలు.. సంచులు.. కాంట్రాక్టులు.. భూదందాలు.. కేసుల చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తున్నది. అధికార.. ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పరం ఇవే అంశాలపై విమర్శల దాడి చేస్తూ వ్యక్తిత్వ హననాలకు దిగుతూ తెలంగాణ సమాజం సహనాన్ని పరీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అసహనంతో ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఈ తరహా విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. అధికార కాంగ్రెస్‌ నేతలు కూడా తాము సైతం తగ్గేదే లేదంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హీరోయిన్లతో సంబంధాలపై మొదలుకుని.. డ్రగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వెల్లడైన అంశాల పేరుతో మసాలా జోడించి కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ప్రతిగా కేటీఆర్ సైతం తనపై అసత్య ఆరోపణలతో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ సీఎంపై ప్రతిసవాళ్లు, ప్రత్యారోపణలతో ఈ ఎపిసోడ్‌ను మరింత రక్తి కట్టించారు. ఎంతగా అంటే.. పక్కన తనకంటే సీనియర్ మాజీ మహిళా మంత్రులున్నా కూడా పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిపై హీరోయిన్లు.. ఫోన్లు ట్యాపింగ్.. గోడలు దూకుడు మాటలు.. ఫలానా చోటుకు.. ఫలానా హీరోయిన్ కోసం వెళ్లావంటూ ప్రతి విమర్శల స్థాయికి తీసుకెళ్లారు. కేటీఆర్ అనుచరులు కౌశిక్ రెడ్డి వంటివారు సైతం ఇప్పుడు అదే మార్గంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు సాగిస్తున్నారు. రేవంత్ సైన్యం కూడా అంతే స్థాయిలో తిప్పికొడుతున్నది. అధికార, ప్రతిపక్ష నేతలు చేసే సరస రాజకీయాల విమర్శల పర్వాన్ని వింటూ తరించే దౌర్భాగ్యం తెలంగాణ సమాజానికి పట్టుకున్నదన్న ఆవేదనను రాజకీయ విశ్లేషకులు, తలపండిన రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

సంచుల గోల.. జనం విలవిల..

రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై బీఆరెస్‌ నేతలు చేసే విమర్శల్లో ప్రధానంగా ఢిల్లీకి లేదా రాహుల్ గాంధీకి సంచులు (డబ్బులు). దీనికి బనకచర్ల వివాదం నేపథ్యంలో ఆంధ్రకు నీళ్లు.. ఢిల్లీకి నిధులు అన్న పంచ్ డైలాగ్ జోడిస్తున్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, భూముల కుంభకోణాలు.. కాంట్రాక్టుల కేటాయింపులతో కమీషన్ల దందాలతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వేలకోట్లను సంచుల్లో మోస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్‌ రావు, కవిత ఆరోపిస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు సొంత చేతి వాటం చూసుకున్న పిదప ఢిల్లీకి వేల కోట్లు పంపిస్తున్నారనే అనుకుంటే.. పదేళ్లలో ఒకే కుటుంబ పాలన సాగిన కాలంలో ఎంత దోపిడీ జరిగింది? అన్న ప్రశ్నజనం మదిలో ఉత్పన్నం కాకమానదు. కాంగ్రెస్ ఆరోపించినట్లుగా పదేళ్ల పాలనలో లక్ష కోట్ల దోపిడీ సొమ్ము ఫామ్‌హౌస్‌లో ఉందనుకోవాలా? లేక అలాంటి ఆరోపణలన్నీ బురద రాజకీయాల్లో భాగమే అనుకోవాలా? అన్నది పార్టీలకే తెలియాలి.

కాంట్రాక్టుల రగడ.. కమీషన్ల దందా

ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాలను పాలించిన ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అనేక ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల కోసం కాంట్రాక్టు సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించడం జరిగిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ జరిగింది.. ప్రస్తుత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలోనూ జరుగుతునే ఉంది. అయితే వేలకోట్ల కాంట్రాక్టులు.. వందల కోట్ల కమీషన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు నిత్యం కాంగ్రెస్ పాలకులపై విమర్శలు చేస్తున్న తీరు చూస్తుంటే సామాన్యుడికి కూడా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ.. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టులు.. కమీషన్లు ఏ స్థాయిలో జరిగాయోనన్న సందేహాలు వస్తున్నాయి. మూసీ ప్రక్షాళనలో లక్షా 50 వేల కోట్ల స్కామ్ ఉందని.. అందులో పాతిక వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించడం గమనార్హం. మూసీ ప్రక్షాళన కాంట్రాక్టు.. అమృత్ కాంట్రాక్టు.. ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టు.. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా అక్రమార్జన చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం లక్ష కోట్ల కాంట్రాక్టులు సహా పాలమూరు డిండీ..కల్వకుర్తి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు, సుంకిశాల కాంట్రాక్టు సహా సచివాలయం, రోడ్లు, కలెక్టరేట్ లు, మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ఫ్లై ఓవర్లు, తీగలవంతెనలు వంటి అనేకానేక పనుల కాంట్రాక్టులలో ఎన్ని కోట్ల కమీషన్లు..ఎవరి జేబు పాలయ్యోనన్న చర్చ సామాన్య ప్రజల్లో జరుగడం లేదని అనుకోలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చివరకు ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలన్న సర్వే సంస్థలకు, భూముల తనఖాకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలకు కూడా వందల కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయన్న ఆందోళనలు చూస్తే వాటిలో నాడు.. నేడు క్విడ్ ప్రో కో వ్యవహారం దాగి ఉందన్న సందేహాలు రేగకమానవని అంటున్నారు.

భూదందాలు.. పందేరాలు

ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం బీఆర్ఎస్ నేతలు సాగిస్తున్న మరో విమర్శ భూదందా. ఉమ్మడి రాష్ట్రం నుంచి సాగుతున్న ప్రభుత్వ భూముల అమ్మకాలు.. కేటాయింపుల దందాలు.. అక్రమ క్రమబద్ధీకరణలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మరింత అధికమయ్యాయని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని విలువైన ప్రభుత్వ భూములను నిధుల సమీకరణ పేరుతో అమ్మేయడం ఒకటైతే.. నగరంతోపాటు చుట్టుపక్కల భూములను ధరణి మాటున మాయం చేసిన ఆరోపణల పర్వం ఉండనే ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలకులు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేశారంటూ ఆరోపించింది. మరి ఆనాడు ధరణితో మాయమైన భూములలో ఇప్పుడు భూభారతితో ఎన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంటారన్నది మునుముందు తేలాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పాలకులు కూడా భూములను అక్రమంగా క్రమబద్ధీకరించుకుంటున్నారని.. కమీషన్ల కోసం ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని.. తమకు కావాల్సిన వాళ్లకు కట్టబెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో నాడు బీఆర్ఎస్ వారు.. నేడు కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ భూముల స్వాహాలో ఎవరికెవరు తీసిపోరా అన్న చర్చ సామాన్యుడిని ఆలోచింపచేస్తుంది. ఇక కవిత మరో అడుగు ముందుకేసి కేసీఆర్ తయారు చేసిన ల్యాండ్ బ్యాంక్ భూములన్నింటినీ రేవంత్ రెడ్డి అమ్ముతున్నారంటూ ఆరోపించడం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. టీజీఐఐసీ పరిధిలో లక్షా 75వేల ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం ప్లాన్ వేశారనేందుకు తన వద్ద నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1లక్ష 80వేల కోట్లు అప్పు తెచ్చి.. పాత అప్పులకు 80వేల కోట్లు చెల్లించారని..మిగతా లక్ష కోట్లలో రేవంత్ రెడ్డికి 20వేల కోట్లు కమీషన్ గా వెళ్లిందని ఆరోపించడం గమనార్హం.

కేసులు…బెదిరింపులు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం అధికారంలోకి వస్తే మీ అవినీతిని బట్టబయలు చేసి.. జైలులో చిప్పకూడు తినిపిస్తానంటూ నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు బీఆర్ ఎస్ నాయకులను హెచ్చరించారు. తీరా చూస్తే ఏడాదిన్నర దాటిపోయినా ఇప్పటిదాకా ఈ దిశగా ఒక్క కేసు కూడా తేలలేదు. కాళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్‌ నిర్మాణాలలో అవినీతి, ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్, గొర్రెల స్కామ్, టూరిజం స్కామ్, ధరణి స్కామ్ వంటి మొదలుకుని కొత్తగా హెచ్ సీఏ కేసు వరకు గత ప్రభుత్వంలోని అక్రమాలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఏ ఒక్కటి కూడా నేటికీ తేలకపోవడంతో సందేహాలకు తావిస్తున్నది. పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారని.. అటువంటి పోలీసులను, అధికారులను గుర్తు పెట్టుకుని మరీ వారి సంగతి చూస్తామంటూ ప్రతిపక్ష పార్టీ బెదిరిస్తున్నది. పార్టీల రాజకీయాలకు అధికారులను ఆటవస్తువులుగా మార్చుకునే విధానం.. బెదిరింపుల ధోరణి నేడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో అవాంఛనీయంగా సాగిపోతున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.