Jackfruit Chips | మహారాష్ట్ర( Maharashtra )లోని కొల్హాపూర్ జిల్లా( Kolhapur District ) ) గగన్‌బావ్‌డా తహసీల్ పరిధిలోని ఓ గ్రామం పనస తోటలకు( Jackfruits Farm ) ప్రసిద్ధి. ఆ గ్రామంలోని ప్రతి కుటుంబానికి పనన తోటలున్నాయి. ఆ తోటలన్నీ ముత్తాతల నుంచి వారసత్వంగా కొనసాగుతున్నాయి. ఇక గ్రామంలోని ప్రతి ఒక్కరూ పనస పండ్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొందరు ఆ పండ్లను మార్కెట్‌కు తీసుకెళ్లలేక, అమ్మలేక వాటిని పొలంలోనే వదిలేసి నేలపాలు చేస్తున్నారు. అయితే సంగీత, విలాస్ పోవర్ అనే దంపతుల పిల్లలు ఒక రోజు పనస పండ్లను తీసుకొని తమ బంధువులకు ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడ వారికి బంధువులు ఓ సలహా ఇచ్చారు. పనస పండ్లతో చిప్స్( Jackfruit Chips ) కూడా తయారు చేయొచ్చని మార్కెట్‌లో డిమాండ్ ఉందని చెప్పడంతో ఆ ఇద్దరు అన్నదమ్ముళ్లు దృష్టి సారించారు.
మొదటిసారి 15 కిలోల చిప్స్
23 ఏండ్ల తేజస్ పోవర్( Tejas Powar ), రాజేశ్(20) ఇద్దరూ కలిసి.. పేరెంట్స్ సహకారంతో మొదటిసారి పనస పండ్లతో 15 కిలోల చిప్స్‌ను తయారు చేశారు. వాటిని కొల్హాపూర్ జిల్లాలో ఇంటింటికి వెళ్లి విక్రయించారు. దాంతో క్రమక్రమంగా పనస చిప్స్‌కు డిమాండ్ పెరిగింది. తేజస్, రాజేశ్‌కు డోర్ డెలివరీ చేయడం కష్టంగా మారింది. ఇక తేజస్ 2023లో తన ఐటీఐ కోర్సు అయిపోగానే.. పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. వీటి తయారీకి ఒక మెకానిజమ్‌ను నెలకొల్పాడు. దీంతో చిప్స్ తయారీ ఈజీ అయింది. అనంతరం వాటిని హోల్ సేల్, రిటైల్ మార్కెట్‌లో అమ్మడం ప్రారంభించారు.
మాంసానికి ప్రత్యామ్నాయంగా పనస పండ్లు
ఇక చాలా మంది మాంసానికి ప్రత్యామ్నాయంగా పనస పండ్లను తింటుంటారు. ఎందుకంటే.. పనసలో పోషక విలువలు, అధిక ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా ఉండడంతో.. దీన్ని ఆహారంలో భాగం చేసుకున్నారు. ఈ క్రమంలో పనస పండును కబాబ్‌లు, బిర్యానీలు, ఇతర వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
స్థానిక రైతుల నుంచి జాక్ ఫ్రూట్స్ కొనుగోలు..
ఈ క్రమంలో రాజేశ్, తేజస్ కలిసి.. తమ తోటలో పండిన పనసతో పాటు స్థానిక రైతుల నుంచి కూడా పెద్ద మొత్తంలో జాక్ ఫ్రూట్స్‌ను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ చెట్లు 30 నుంచి 70 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇంకా పండ్లు కూడా భారీ పరిణామంలో ఉంటాయి. ఈ చెట్లు జిగురును కూడా విడుదల చేస్తాయి. దీంతో వాటిని కోసేందుకు కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఈ పనస పండ్లను చాలా మంది రైతులు కోయరు. మేం కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి వారి నుంచి కొనుగోలు చేస్తాం. ఇక పండ్లను కోసేందుకు శిక్షణ పొందిన వ్యక్తులను ఉపయోగించి.. సేకరిస్తాం. అనంతరం వాటిని చిప్స్, భక్ష్యాల తయారీకి వినియోగిస్తామని తేజస్ తెలిపాడు.
కేజీ చిప్స్‌ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు..
చిప్స్ తయారీకి ముడి పనసను ఉపయోగిస్తామన్నాడు. బాగా పండిన పండ్లను భక్ష్యాలకు వినియోగిస్తాం. ఈ భక్ష్యాలను పనస గుజ్జు, బెల్లం, గోధుమ పిండి కలిపి తయారు చేస్తామన్నాడు. ఈ పనస పండ్ల కోత జనవరి – ఫిబ్రవరి మాసంలో ప్రారంభమై.. జులై – ఆగస్టు వరకు కొనసాగుతుందని తెలిపాడు. వర్షాలు పడడం ప్రారంభమైతే.. పనస పండ్లు త్వరగా పండుతాయి. అదేస్థాయిలో వృధా కూడా అవుతుందన్నాడు. ప్రతి ఏడాది 4 వేల కిలోల జాక్ ఫ్రూట్స్‌ను ప్రాసెస్ చేసి.. వెయ్యి కిలోల చిప్స్‌ను తయారు చేస్తాం. 4 కిలోల పనస పండు ఒక కిలో చిప్స్‌ను ఇస్తుంది. చిప్స్ తయారీలో ఎలాంటి కెమికల్స్ వినియోగించమని స్పష్టం చేశాడు. కేవలం కొబ్బరి నూనె, ఉప్పు మాత్రమే ఉపయోగించి చిప్స్ తయారు చేస్తామన్నాడు. ఒక కేజీ చిప్స్‌ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తామన్నాడు. ఈ ధరలు మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి ఉంటాయన్నాడు. ఇక పనస భక్ష్యాలను కేజీకి రూ. 700 చొప్పున విక్రయిస్తామన్నాడు తేజస్.
ఏడాదికి రూ. 12 లక్షల సంపాదన.. త్వరలోనే పనస లడ్డూ, పాపడ్..
ఈ బిజినెస్‌లో ప్రస్తుతం ఐదుగురం కుటుంబ సభ్యులం బిజీగా ఉన్నాం. 10 నుంచి 12 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తమ యూనిట్ బిజీగా ఉంటుందన్నాడు. మిగిలిన మూడు నెలలు మార్కెటింగ్‌పై దృష్టి పెడుతామన్నాడు. త్వరలోనే జాక్ ఫ్రూట్ పాపడ్, లడ్డూలను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విధంగా ఇద్దరు అన్నదమ్ముళ్లు ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు.
