Congress | గెలుపు గుర్రాలు కావాలి.. అభ్యర్థుల కోసం అన్వేషణ

Congress | బలాబలాలు బేరీజు నియోజకవర్గాల్లో సర్వేలు ఆచితూచి అడుగులు పాత, కొత్త నేతల పొలిటికల్ వార్ పాలమూరు కాంగ్రెస్‌లో టికెట్ల గండం విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి పక్షం రోజులు దాటింది. […]

  • Publish Date - September 2, 2023 / 12:18 PM IST

Congress |

  • బలాబలాలు బేరీజు
  • నియోజకవర్గాల్లో సర్వేలు
  • ఆచితూచి అడుగులు
  • పాత, కొత్త నేతల పొలిటికల్ వార్
  • పాలమూరు కాంగ్రెస్‌లో టికెట్ల గండం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి పక్షం రోజులు దాటింది. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది.

ఇప్పటికే జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పోటీకి 59 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మళ్ళీ పార్టీలోకి కొత్తవారు రావడంతో పోటీ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ తక్కువే ఉన్నా, మరి కొన్నింటికి పోటీ అధికంగా ఉంటోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ తొలి జాబితా వెలువడక పోవడంతో, టికెట్ ఆశించే నేతలు అయోమయానికి గురవుతున్నారు.

కొత్త చేరికలు కలిసొచ్చేనా..

కాంగ్రెస్ లో కొత్త నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వీరి చేరికతో టికెట్ ఆశించే పాత నాయకులు కొంత అసహనం చెందుతున్నారు. ఇతర పార్టీ ల నుంచి ప్రజా బలమైన నాయకులు వస్తే టికెట్ వారికే వెళుతుందనే భావనలో పాత నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. దేవరకద్ర, మక్తల్, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు.

దేవరకద్ర

ఈ నియోజకవర్గ నాయకుడు మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. దేవరకద్ర నుంచి పోటీకి ఆయన సంశయంలో ఉన్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రదీప్ గౌడ్ ప్రచారంలో కూడా ముందుకు వెళుతున్నారు. కానీ ఆయనకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ కు బంగారు పళ్లెంలో గెలుపును అందించినట్లే అని పార్టీ అధిష్టానంలో అభిప్రాయం ఉంది. ఇక్కడి నుంచి పోటీకి బలమైన నేతను బరిలోకి దించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి తన అభిప్రాయం తెలిపింది. ఆమె కాంగ్రెస్ లో చేరితే ఈ నియోజకవర్గంలో పోటీలోకి దింపేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ కు గట్టి పోటీగా భావిస్తోంది. ఆమె మాత్రం మక్తల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అక్కడ నారాయణ పేట డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి టికెట్ ఆశిస్తున్నారు. ఈక్రమంలో సీతమ్మకు నచ్చజెప్పి, దేవరకద్ర నుంచి పోటీకి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మహబూబ్ నగర్

ఇక్కడి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను ఢీ కొట్టే బలమైన నాయకులు లేరు. దీంతో కొత్త నాయకుని కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతలు సరిపోరని అధిష్టానం అభిప్రాయ పడుతోంది. మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి పోటీలో ఉంచాలని భావిస్తోంది. బీజేపీలో ఉన్న ఎన్నం.. కాంగ్రెస్ లోకి వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ కు స్పష్టత రాలేదు. ఎన్నం వస్తేనే పార్టీ బలపడుతుందని, ఆయనతో పలువురు కాంగ్రెస్ అధినాయకులు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఎన్నం అంశం కొలిక్కివస్తుందని అ పార్టీ నేతలు అంటున్నారు.

జడ్చర్ల

ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కేటాయింపులో గందరగోళం ఏర్పడుతోంది. కొత్త, పాత నేతల మధ్య సఖ్యత కన్పించడం లేదు. కొత్తగా పార్టీలో చేరిన ఎర్ర శేఖర్ కు, పాత నేత అనిరుద్ రెడ్డి మధ్య టికెట్ గొడవ జరుగుతోంది. అనిరుద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి మద్దతు అనిరుద్ కు ఉండడంతో ఆయనకే టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఎర్ర శేఖర్ రెండు పర్యాయాలు టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా చేసిన అనుభవం, ఆయన సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఉండడం కాంగ్రెస్ కు కలిసి వస్తుందనే భావనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ పాత, కొత్త నేతల మధ్య టికెట్ పంచాయితీ ఉంటుందని పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.

వనపర్తి

ఈ నియోజకవర్గంలో పాత, కొత్త తరం మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. పాత తరం నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి, కొత్త తరం నేతలు మేఘారెడ్డి, శివసేనారెడ్డి మధ్య సయోధ్య కరువైంది. పార్టీ మాత్రం సీనియర్ నేత చిన్నా రెడ్డిని వదులుకునే పరిస్థితి లేదు. చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే, ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డిని తట్టుకోగలరని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. మేఘా రెడ్డికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గద్వాల

ఇక్కడా నేతల మధ్య సమన్వయం కొరవడింది. కాంగ్రెస్ సీనియర్ నేత కురుమ విజయకుమార్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జడ్పీ చైర్ పర్సన్ సరిత మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. కొత్తగా వచ్చిన సరితకు టికెట్ ఎలా ఇస్తారని విజయకుమార్ ప్రశ్నిస్తున్నారు. పార్టీని ఇంతకాలం అంటిపెట్టుకుని ఉండి నియోజకవర్గంలో బలం పెంచిన పాత తరం నేతలను వదిలి, కొత్త వారికి టికెట్ ఇస్తే ఊరుకోమని ఇప్పటికే అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయింపులో అలోచించి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కొల్లాపూర్

ఈ నియోజకవర్గంలో కొత్త, పాత నేతల మధ్య అఘాతం ఏర్పడింది. కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు మధ్య వర్గ పోరు మొదలైంది. ఇద్దరూ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జూపల్లి వైపే మొగ్గు చూపుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

నాగర్ కర్నూల్

ఇక్కడ సీనియర్, జూనియర్ల మధ్య పోటీ తీవ్రమైంది. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి, ఈ మధ్య పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మధ్య టికెట్ పంచాయితీ జరుగుతోంది.ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వవద్దని నాగం అధిష్టానం వద్ద పోరు పెడుతున్నారు. కూచుకుళ్ళ మాత్రం తన కుమారుడు రాజేష్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని టీపీసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. సీనియర్ నేతలను గుర్తించాలని, టికెట్ తనకే ఇవ్వాలని నాగం పట్టుపడుతున్నారు. ఇక్కడి టికెట్ పై నాగంను ఒప్పించి రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే యోచన లో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News