Singareni Bonus Issue | సింగరేణి కార్మికుల బోనస్ ను బోగస్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

సింగరేణి కార్మికుల బోనస్‌ కోతపై సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్, లాభాల్లో 34% బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Harish Rao Vs Revanth Reddy

విధాత, హైదరాబాద్ : సింగరేణి కార్మికుల బోనస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బోగస్ చేసిందని..కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50% పైగా కోత విధించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం 2360 కోట్లలో 34% ఇవ్వడం ఏమిటని నిలదీశారు. దసరా పండుగ పూట కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ చేసింది ద్రోహమే అని విమర్శించారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారు. ఇంకా గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్ లో 50% వాటా కోత విధించారని ఆరోపించారు. నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమం.. కాంగ్రెస్ పాలనలో ఘోరమైన సంక్షోభం అంటూ ఫైర్ అయ్యారు.
నికర లాభాల్లో 34% ను కార్మికులకు బోనస్ గా ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

16శాతం బోనస్ ను 32శాతం పెంచిన ఘనత కేసీఆర్ దే

గతంలో కేసీఆర్‌ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారని..కాంగ్రెస్‌ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గం అని హరీష్ రావు విమర్శించారు. గతేడాది సింగరేణి భవిష్యత్‌ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,283 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు 4034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారు అని ఆరోపించారు. కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు? అని ప్రశ్నించారు. కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణంఅన్నారు. సమైక్య రాష్ట్రంలో 1998-99 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమేనని..రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014-15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారన్నారు.
లాభాల వాటాను 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కేసీఆర్‌ కే దక్కుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే నికర లాభంలో 34% బోనస్ గా ప్రకటించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని హరీష్ రావు తెలిపారు.