OG Movie Review | అభిమానులకు ఫుల్ మీల్ ఎంటర్టైనర్.. థియేటర్లో మోత: ఓజీ రివ్యూ

హరిహర వీరమల్లు అట్టర్ ఫ్లాప్ తర్వాత పవన్ అభిమానులకు ఫుల్ మీట్ ఎంటర్టైనర్ లభించింది. చిన్న చిన్న లోపాలు ఉన్నా.. ఓజీ అదరగొట్టింంది.

  • Publish Date - September 25, 2025 / 11:42 AM IST

OG Movie Review | ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ తెరపై కనిపించిన తొలి చిత్రం హరిహర వీరమల్లు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో నిలబడక పోవడంతో, అభిమానులు అంతా “ఓజీ” సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా గురువారం ప్రేక్షకుల ఎదుట‌కు వచ్చింది. మ‌రి సినిమా ఎలా ఉందో చూద్దాం రండి.

కథ..

జపాన్‌లో జరిగిన ఒక దాడి నుంచి తప్పించుకున్న ఓజెస్ గంభీర అలియాస్‌ “ఓజీ” (పవన్ కళ్యాణ్‌) ఇండియాకు చేరుతాడు. అక్కడ సత్యాదాదా (ప్రకాశ్ రాజ్‌) కుటంబంలో ఒక‌డిగా క‌లిసిపోయి ముంబై అండర్‌వర‌ల్డ్‌లో తమ‌ సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. అనుకోని పరిణామాల వల్ల ఓజీ స‌డ‌న్‌గా సత్యా దాదా నుంచి దూరంగా ఎవ‌రికీ తెలియ‌ని ప్రాంతానికి వెళ్లి కొత్త జీవితం మొదలెడతాడు. ఆపై పాత శత్రువులు ముంబైకి తిరిగి ఎంట‌ర్ కావ‌డంతో త‌ను నిర్మించిన సామ్రాజ్యం అత‌లాకుతలం అవుతుంది. దీంతో ఓజీకి తిరిగి ముంబైకి రావాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? తన దాదాను ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ.

విశ్లేషణ

అండర్‌వర‌ల్డ్‌ నేపథ్యంపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చినా, “ఓజీ”లో పాత్రలకు డైరెక్ట‌ర్‌ ఇచ్చిన ఎలివేషన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. పవన్ కళ్యాణ్‌ ఎంట్రీ, యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా నంచాక్ ఫైట్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. అలాగే క్లైమాక్స్‌లో వ‌చ్చే “జానీ” టచ్ ఫ్యాన్స్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది.

సత్యా దాదా పాత్రలో ప్రకాశ్ రాజ్ మరోసారి తన ప్రతిభను చూపించారు. గీతగా శ్రియారెడ్డి పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపించారు. ఇమ్రాన్ హష్మీ, తేజ్ సప్రూ విలన్ పాత్రల‌తో అద‌ర‌గొట్టారు. ఇమ్రాన్‌ను ఇంకా బ‌లంగా చూపిస్తే బాగుండేద‌నిపిస్తుంది. ప్రియాంక మోహన్ చిన్న పాత్రలో మెప్పిస్తుంది.

టెక్నికల్‌గా.. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం లాంటిది. పవన్‌తో ఆయన కాంబినేషన్ ఈసారి మ‌రో లెవ‌ల్‌కి వెళ్లింద‌ని చెప్ప‌వ‌చ్చు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస విజువల్స్ హై గా ఉన్నాయి. ఎడిటర్ నవీన్ నూలీ క్రిస్ప్ కట్స్‌తో రన్‌టైమ్‌ను చక్కగా హ్యాండిల్ చేశారు. డీవీవీ దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తాయి.

ఫైనల్ టాక్

“ఓజీ” కొత్త కథ కాదనిపించినా, స్క్రీన్‌ప్లే, పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి బలంగా నిలిచాయి. హింసాత్మక స‌న్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఇబ్బంది క‌లిగించినా యాక్షన్ మూవీస్ అభిమానులకు మాత్రం ఇది ఫుల్ మీల్ ఎంటర్టైనర్.