Millionaire Farmer | సౌత్ కశ్మీర్( South Kashmir )లోని షోపియాన్ జిల్లాలోని మూలు గ్రామానికి( Moolu Village ) చెందిన గులాం మహమ్మద్ మీర్( Ghulam Mohammad Mir ).. 1970లలో బతుకుదెరువు కోసం హర్యానా( Haryana ) వెళ్లాడు. అక్కడ వ్యవసాయ కూలీ( Agriculture Worker )గా పని చేసేవాడు. కూలీ పనులకు వెళ్తే రోజుకు రూ. 3 ఇచ్చేవారు. పొద్దంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయాల్లో వాచ్‌మెన్‌గా పని చేసి కొంత సంపాదించేవాడు. అలా హర్యానాలో ఓ పదిహేను సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు.
అయితే హర్యానాలో వేసవిని తట్టుకోవడం ఆయనకు కష్టంగా మారింది. అంతేకాదు జీతాలు కూడా తక్కువే అని గులాం చెప్పుకొచ్చాడు. కానీ హర్యానా తనకు కూరగాయల పెంపకం, నేల సంరక్షణ, మార్కెటింగ్ గురించి చాలా విషయాలను నేర్పిందని తెలిపాడు. అయితే ఈ హర్యానాలో పని చేసే బదులు కశ్మీర్‌లో తనకున్న పొలంలో ఏదో ఒక సాగు చేయాలని గులాం సంకల్పించాడు.
కశ్మీర్‌కు తిరిగొచ్చి కూరగాయాల సాగు
మొత్తానికి కశ్మీర్‌కు తిరిగొచ్చాడు. నౌపోరాలో 0.375 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని సారవంతం చేశాడు. పాలకూర, క్యారెట్, క్యాబేజీ, దోసకాయ, కాలీఫ్లవర్ వంటి కూరగాయాలను సాగు చేయడం ప్రారంభించాడు. అయితే ఇందుకు సంబంధించిన విత్తనాలను మాత్రం హర్యానా వెళ్లి కొనుగోలు చేసేవాడు. వర్మీకంపోస్టు, ఆవుపేడ, ట్రైకోడెర్మా వంటి బయో ఫర్టిలైజర్‌లను ఉపయోగించి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి సాగు చేయడంతో దిగుబడి అధికంగా వచ్చేది. ఈ భూమికి తోడుగా 2001లో మరింత భూమిని కొనుగోలు చేసి, తన సాగును విస్తరించాడు. ఇక అప్పట్నుంచి గులాం వెనక్కి తిరిగి చూడలేదు.
నాలుగు ఎకరాలకు విస్తరణ
గత 20 ఏండ్ల కాలంలో.. గులాం తన వ్యవసాయాన్ని నాలుగు ఎకరాలకు విస్తరించాడు. రెండు ఎకరాల్లో కాలీఫ్లవర్, చైనీస్ క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయలను సాగు చేస్తున్నాడు. అయితే సీజన్‌ను బట్టి కూరగాయాలు, ఆకుకూరలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. గులాం తన పొలంలో పండించే ఉత్పత్తులను ఆర్గానిక్ కావడంతో.. వాటికి కశ్మీర్ వ్యాప్తంగా భలే డిమాండ్ కూడా ఉంది. గులాంకు ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి.
సేంద్రీయ పద్ధతుల్లో సాగు
సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా కాలీఫ్లవర్ లాంటి పంట.. ఎకరానికి 9600 కిలోల దిగుబడిని ఇచ్చిందని గులాం తెలిపాడు. బీన్స్‌తో పాటు బంగాళాదుంపలను అంతర పంటగా వేశాడు. ఇది కూడా బాగానే దిగుబడి సాధించింది. ఇక నేలను సారవంతం చేసేందుకు వర్మీకంపోస్టును ఉపయోగిస్తాడు గులాం. ప్రస్తుతం గులాం వద్ద 25 వర్మీ కంపోస్ట్ బెడ్లు ఉన్నాయి. ఇవి తన వ్యవసాయ అవసరాలకు మించిపోయి ఉన్నాయి. కాబట్టి వర్మీకంపోస్టును రైతులకు విక్రయిస్తున్నట్లు మీర్ గులాం తెలిపాడు.
కొనుగోలుదారులే నేరుగా పొలం వద్దకు
తమ పొలంలో పండించిన కూరగాయలు, ఆకు కూరలను ఏ మార్కెట్‌కు తీసుకెళ్లమని గులాం చెప్పాడు. కొనుగోలుదారులే నేరుగా తమ పొలం వద్దకు వచ్చి సేకరిస్తారని పేర్కొన్నాడు. మరి ముఖ్యంగా హోటల్ యజమానులు, ఇతర వ్యాపారస్తులు తమ వద్ద కూరగాయలను కొనుగోలు చేస్తారని తెలిపాడు.
కోళ్లు, చేపల పెంపకం కూడా..
గులాం వ్యవసాయం వద్దనే ఆగిపోలేదు. తనకున్న పొలంలోనే కోళ్లు, చేపల పెంపకాన్ని కూడా ప్రారంభించాడు. ఈ పెంపకం.. ఆయన ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. స్థానికులంతా గులాం వద్దనే చేపలు, కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నుంచి కోళ్లు, చేపలు దిగుమతి అవుతుంటాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రతి ఏడాది రూ. 2 వేల కోట్ల విలువైన మాంసం దిగుమతి అవుతుంది. దాంతో పాటు పౌల్ట్రీ వ్యాపారులు రోజుకు అర మిలియన్ గుడ్లను, 40 వేల నుంచి 50 వేల కోళ్లను పంజాబ్‌ను నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ దిగుమతిని తగ్గించేందుకు తాము చేపలు, కోళ్ల పెంపకం చేపట్టామని గులాం తెలిపాడు.
బాధ్యత తీసుకున్న గులాం కోడలు
మీర్ గులాంకు వయసు మీద పడింది. వృద్ధ్యాపం రావడంతో సాగు చేయలేకపోతున్నాడు. దీంతో కుమారుడు గుల్బాదీన్ అహ్మద్ మీర్ భార్య షాజియా లతీఫ్(అడ్వకేట్) తన మామ బాధ్యతలను తీసుకుంది. అడ్వకేట్ వృత్తిని వదిలిపెట్టి వ్యవసాయం వైపు అడుగులేసింది. సాగుతో పాటు ఇతర వ్యవహారాలన్నింటిని ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన షాజియాను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అభినందించారు.
