విధాత : అండర్-19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతునన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 252 పరుగులకు అలౌటైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన యువ భారత్ 49.4ఓవర్లలో 252 పరుగులకు అలౌటైంది. భారత్ జట్టులో అత్యధికంగా వేదాంత్ త్రివేది (68; 98 బంతుల్లో, 2ఫోర్లు, 1సిక్స్) పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (30; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఆరోన్ జార్జి (16), విహాన్ మల్హోత్రా (21; 43 బంతుల్లో) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఒక దశలో 7 ఓవర్లకు 46/0తో ఉన్న భారత్.. తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేటలో వెనుకబడింది. పాక్ బౌలర్లు మహ్మద్ సయ్యమ్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో నాలుగో బంతికి వైభవ్, చివరి బాల్‌కు ఆయూష్ మాత్రే డకౌటయ్యాడు.అబ్దుల్ సుభాన్ వేసిన తర్వాత ఓవర్‌లో తొలి బంతికే ఆరోన్ జార్జ్(16) కూడా ఔటయ్యాడు. దీంతో ఇండియా నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి 47/3తో కష్టాల్లో పడింది.
రెండు భాగస్వామ్యాలతో కోలుకున్న భారత్
తర్వాతా వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా(21) జంట నాలుగో వికెట్ కు 62పరుగులు జోడించి ఆదుకున్నారు. అభిజ్ఞాన్ కుందు (16) ఐదో వికెట్ గా వెనుతిరిగాడు. ఆరో వికెట్ గా 40.2ఓవర్లలో జట్టు స్కోర్ 182 వద్ద వేదాంత్ కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం ఆర్.ఎస్. అంబరీష్ (29), కనిష్క్ చౌహాన్ (35), ఖిలాన్ పటేల్ (21) విలువైన పరుగులు సాధించి జట్టు మెరుగైన స్కోర్ సాధించేలా పోరాడారు. కనిష్క్ చౌహాన్ , ఖిలాన్ పటేల్ జంట ఎనిమిదో వికెట్ కు 50పరుగులు జోడించారు. అబ్దుల్ సుభాన్ 49ఓవర్లో వారిద్దరిని ఔట్ చేయడంతో పాటు దీపేశ్ దేవేంద్రన్(1)ని రనౌట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
పాకిస్తాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3 వికెట్లు, మహ్మద్ సయ్యమ్ 2 వికెట్లు, అహ్మద్ హుస్సేన్, అలీ రాజా, మోమిన్ ఖమర్, అలి హసన్ లు తలో వికెట్ సాధించారు. యువ భారత్ నిర్ధేశించిన 252పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతుంది. పాకిస్తాన్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా తక్కువ తేడాతో ఓడితే సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది.
