India won U19 World cup | వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం : అండర్19 ప్రపంచకప్ భారత్‌దే
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఊహించినట్లే, భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ చేతులెత్తేసింది. 412 పరుగుల భయానక లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్ బ్యాటర్లు 311 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో యువభారత్ విజయకేతనం ఎగురవేసి 6వ సారి ప్రపంచకప్ను సగర్వంగా ఎత్తుకుంది. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన పెను విధ్వంసంతో ఇంగ్లండ్ బౌలర్లు విలవిల్లాడారు.
Teen Sensation Sooryavanshi Fires India to Sixth U19 World Cup Title
మ్యాచ్ సారాంశం
U19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ విజయకేతనం ఎగురవేసి 6వ సారి ప్రపంచకప్ను ఎత్తుకుంది. 411 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి, ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల వీర విహారంతో జట్టును ఆరో టైటిల్ వైపు నడిపించాడు.
- వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల విధ్వంసం
- 100 పరుగుల తేడాతో ఘనవిజయం
- 6వ సారి కప్పును ముద్దాడిన భారత్
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
India won U19 World cup | అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత యువ జట్టు అసాధారణ ప్రదర్శన చేసింది. 6వ సారి ప్రపంచకప్ గెల్చుకుని రికార్డు నెలకొల్పింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు సాధించి ఇంగ్లండ్‌కు అత్యంత కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఇన్నింగ్స్‌కు కేంద్రబిందువుగా నిలిచింది 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ… అతడి చారిత్రక శతకం భారత స్కోరును మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతిగా ఛేదనలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే పతనమైంది.
భారీ లక్ష్యం – పోరాడలేక చేతులెత్తేసిన ఇంగ్లండ్
భయానక లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఒక ఓపెనర్‌ను కోల్పోయింది. కానీ, మరో ఓపెనర్ బెన్ డాకిన్స్(66), బెన్ మాయెస్(45)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసాడు. కానీ, ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో వికెట్లు ఒక వరుసలో పడిపోయాయి. కానీ, కాలెబ్ ఫాల్కనర్() ఓ పక్క వికెట్లు పడుతున్న మొక్కవోని దీక్షతో అలుపెరుగని పోరాటం సాగించాడు. శతకం సాధించినా, సరైన భాగస్వామి లేకపోవడంతో ఫాల్కనర్ సెంచరీ వృథాగా మారిపోయింది. దాంతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగిన ఫాల్కనర్ తో ఇంగ్లండ్ పరాజయం ఖరారైంది.
ఆరంభం నుంచి ఆధిపత్యం: వైభవ్–మాత్రే జోడీ వేసిన పునాది
కాగా, టాస్ గెలిచిన భారత్ ధైర్యంగా బ్యాటింగ్ ఎంచుకుని తమ నిర్ణయం సబబే అని నిరూపించింది. ఫైనల్ ఒత్తిడిలోనూ భారత బ్యాట్స్‌మెన్ ధైర్యంగా, క్రమశిక్షణతో ఆడుతూ జట్టు బలాన్ని చాటారు. ఆరంభం నుంచి చివరి ఓవర్ల వరకు స్కోరింగ్ వేగం తగ్గకుండా కొనసాగడమే ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకతగా నిలిచింది.
భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ ఆరోన్ జార్జ్ (9) త్వరగా వెనుదిరిగాడు. అయితే మరో ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రీజ్‌ను వదలకుండా నిలబడి ఇన్నింగ్స్‌కు నిర్దేశించాడు. తొలి కొన్ని ఓవర్లలో బంతిని గమనిస్తూ ఆడిన వైభవ్, క్రమంగా గేర్ మార్చాడు. 32 బంతుల్లో అర్ధశతకం, 55 బంతుల్లో శతకం పూర్తి చేసిన అతడు, పవర్‌ప్లే అనంతరం ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించాడు. కవర్ డ్రైవ్స్, పుల్ షాట్లు, స్ట్రైట్ హిట్స్‌తో బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు కెప్టెన్ ఆయుష్ మాత్రే (53) నిలకడగా ఆడుతూ వైభవ్‌కు అద్భుత సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, స్కోరును వేగంగా ముందుకు నడిపించారు. మధ్య ఓవర్లలో కూడా రన్‌రేట్ తగ్గకుండా చూసుకోవడంలో ఈ జోడీ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ దశలోనే భారత్ 150, 200, 250 పరుగుల మైలురాళ్లను వేగంగా దాటుతూ మ్యాచ్‌పై పట్టుబిగించింది.
రికార్డుల మోత: 175 పరుగులతో చరిత్ర సృష్టించిన వైభవ్

ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన భారత యువ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే స్థాయిలో నిలిచింది. అతడు 80 బంతుల్లో 175 పరుగులు సాధించి, అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును నెలకొల్పాడు.
ఈ ఇన్నింగ్స్‌లో అతడు:
- 15 ఫోర్లు, 15 సిక్సులు
- 218కి పైగా స్ట్రైక్‌రేట్
శతకం తర్వాత మరింత దూకుడుతో ఆడిన వైభవ్, ఇంగ్లండ్ బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టాడు. లమ్స్‌డన్ బౌలింగ్‌లో థామస్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసినా, అప్పటికే మ్యాచ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం సాధించింది.
ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్:
- U19 ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా
- ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా
- టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుల వరుసలో నిలిచాడు.
ప్రేక్షకులు, ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచీ కూడా అతడికి లభించిన స్టాండింగ్ ఓవేషన్ ఈ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని చాటింది.
మిడిల్ ఆర్డర్ సహకారం, చివరి బ్యాటర్ల ఫినిషింగ్‌తో 400 మార్క్ దాటిన భారత్
వైభవ్ ఔట్ అయిన తర్వాత కూడా భారత్ స్కోరింగ్ వేగం తగ్గలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అభిజ్ఞాన్ కుందు (40), వేదాంత్ త్రివేది (32) కీలక పరుగులు చేసి స్కోర్‌బోర్డును పరుగులెత్తించారు. విహాన్ మల్హోత్రా, ఆర్ఎస్ అంబరీష్ వంటి ఆటగాళ్లు కూడా బలహీన బంతులను సద్వినియోగం చేసుకున్నారు. చివరి ఓవర్లలో కనిష్క్ చౌహాన్ తదితర లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించి, భారత్ స్కోరును 400 దాటించారు. డెత్ ఓవర్లలో ఈ ఫినిషింగ్ టచ్ వల్ల భారత్ 411 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది.
ఇంగ్లండ్ బౌలర్లు చివరి దశలో వికెట్లు తీసుకున్నప్పటికీ, అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(175 పరుగులు), సిరీస్(439) అవార్డులు వైభవ్ సూర్యవంశీకి దక్కాయి.
యువభారత్ ఈ అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది. కాగా, భారత్ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధానితోసహా ప్రముఖులందరూ యువభారత్‌కు శుభాకాంక్షలు అందజేసారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram