U19 CWC – Record Chase: 311 లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరిన భారత్

భారీ 311 లక్ష్యాన్ని ఛేదించి అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత్. ఆరోన్ జార్జ్ సెంచరీ, సూర్యవంశీ మెరుపులతో చరిత్ర సృష్టించిన యువ జట్టు.

Reported by: ADHARVA | క్రీడలు | Feb 04, 2026, 9:57 pm IST
Read Time: 5 mins
U19 CWC – Record Chase: 311 లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరిన భారత్

India Script Historic 311-Run Chase to Enter U19 World Cup Final

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

ICC Under-19 World Cup చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టానికి భారత్ అండర్-19 జట్టు తెరలేపింది. సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 41.1 ఓవర్లలోనే ఛేదించి ఫైనల్‌కు చేరింది.

ఇంత పెద్ద ల‌క్ష్యాన్ని అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఏ జట్టూ ఛేదించలేకపోయింది. ఈసారి భారత యువ జట్టు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఈ విజయంతో భారత్ పదోసారి ప్రపంచకప్​ ఫైనల్‌కు అర్హత సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.

అఫ్గానీల సెంచరీలు… భారీ స్కోరు

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు మొదటినుంచే దూకుడుగా ఆడింది. హరారేలోని బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతో ఆడారు. ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై జోడీ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. షినోజాదా అద్భుత షాట్లతో శతకం సాధించగా, నియాజై కూడా ఓర్పుగా ఆడి సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు.

40 ఓవర్లకు 199/2గా ఉన్న అఫ్గన్​ స్కోరు, చివరి 10 ఓవర్లలో 111 పరుగులు కలుపుకుని 310/4 గా మారింది. ఆ సమయంలో ఇది విజయం ఖాయం అనిపించే స్థాయిలో కనిపించింది.

భారత్ తరఫున దేవేంద్రన్, కనీష్క్ చౌహాన్ కీలక వికెట్లు తీసినా, చెప్పుకోదగ్గ స్థాయిలో భారత బౌలింగ్​ పనిచేయలేదు.

జార్జ్ సెంచరీ… సూర్యవంశీ మెరుపులు

Vaibhav Sooryavanshi, Ayush and Aaron George batting aggressively during India vs Afghanistan U19 World Cup semifinal chase

అనంతరం, 311 లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ తొలి ఓవర్ నుంచే బౌలర్లపై దాడి చేశారు. ప్రారంభంలో ఇద్దరికీ జీవనదానాలు లభించినా, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తొలి వికెట్‌కు కేవలం 57 బంతుల్లోనే 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

సూర్యవంశీ 33 బంతుల్లో 68 పరుగులతో బౌండరీల వర్షం కురిపించగా, మరోవైపు జార్జ్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మధ్యలో సూర్యవంశీ ఔటైనా, కెప్టెన్ ఆయుష్ మాథ్రే వచ్చి జట్టుకు మరింత బలం చేకూర్చాడు. వరుస సిక్సర్లతో మ్యాచ్‌పై భారత్ ఆధిపత్యం స్పష్టమయ్యింది. ఏ దశలోనూ దూకుడు తగ్గించని భారత్​, 25 ఓవర్లలోనే 200 పరుగులు దాటింది. జార్జ్ 94 బంతుల్లో శతకం పూర్తి చేసి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చివరకు భారత్ 311/3 స్కోరుతో 53 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

చరిత్రలో నిలిచిన విజయం… పదో ఫైనల్

ఈ మ్యాచ్ భారత యువ క్రికెట్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలోనే అతిపెద్ద ఛేదనగా ఈ విజయం రికార్డుల్లో నమోదైంది. జార్జ్, సూర్యవంశీ, మాథ్రే లాంటి యువ ఆటగాళ్ల ప్రదర్శన భవిష్యత్తు భారత క్రికెట్‌కు ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఈ గెలుపుతో భారత్ పదోసారి ఫైనల్‌కు చేరి, ప్రపంచ క్రికెట్‌లో తన స్థిరత్వాన్ని మరోసారి రుజువు చేసింది.

ఇక ఫైనల్‌లోనూ ఇదే ఆత్మవిశ్వాసంతో ఆడితే, మరోసారి ట్రోఫీ అందుకోవడం ఖాయం అన్న నమ్మకం అభిమానుల్లో బలపడింది.