Municipal Corporation Property Tax| మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి రూ. 8.16కోట్ల ఆస్తి పన్ను చెల్లింపు!

మున్సిపల్ కార్పోరేషన్ లో పోటీ చేసేందుకు సిద్దమైన ఓ అభ్యర్థి ఎన్నికల సందర్బంగా చెల్లించిన పెండింగ్ ఆస్తి పన్ను బకాయి వ్యవహారం రికార్డుగా నిలిచి వైరల్ గా మారింది.

విధాత : స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు స్థానిక సంస్థలకు ఎలాంటి పన్ను బకాయిలు ఉండకూడదన్న నిబంధన..ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో పోటీ చేసేందుకు సిద్దమైన ఓ అభ్యర్థి ఎన్నికల సందర్బంగా చెల్లించిన పెండింగ్ ఆస్తి పన్ను బకాయి దేశంలోనే రికార్డుగా నిలిచి వైరల్ గా మారింది.

రూ.8.16 కోట్ల ఆస్తి పన్ను చెల్లించిన అభ్యర్థి

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవి రేసులో ఉన్న కార్పోరేటర్ అభ్యర్థి కే. శమంత నరేందర్ రెడ్డి రూ.8,16,65,000 ఆస్తి పన్నును చెల్లించారు. ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ దాఖలు సందర్బంగా పన్నుల చెల్లింపుకు సంబంధించి న్యూడ్యూస్ సర్టిఫికెట్ కోసం పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని అనివార్యంగా చెల్లించాల్సి వచ్చింది.

నగరంలోని ఒక ప్రముఖ హోటల్‌లో డైరెక్టర్‌గా ఉన్న నరేందర్ రెడ్డి నిజామాబాద్ కార్పోరేషన్ మేయర్ పదవి లక్ష్యంగా తన భార్య శమంతను పోటీ చేయించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్బంగా కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు నో డ్యూ సర్టిఫికేట్ అనివార్యమైంది. నరేందర్ రెడ్డికి సంబంధించి 2009 నుంచి 2026 వరకు ఆస్తి పన్ను పెండింగ్‌లో ఉంది. నో డ్యూ సర్టిఫికెట్ కావాలని నరేందర్ రెడ్డి మున్సిపల్ అధికారులను సంప్రదించారు. వారు సీడీఎంఏ దృష్టికి బకాయిల విషయాన్ని తీసుకెళ్లగా, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను బకాయి ఉండొద్దని తేల్చి చెప్పారు.

దీంతో నరేందర్ రెడ్డి నో డ్యూ సర్టిఫికెట్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అడిగిన పూర్తి వివరాలను మున్సిపల్ కమిషనర్ అదో రోజు రాత్రి సమర్పించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు వాదనలు విన్న జడ్జి బకాయిలు చెల్లించి తీరాల్సిందేనని తీర్పునిచ్చారు.
దీంతో శమంత నరేందర్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న మొత్తం ఆస్తి పన్నును ఆరు డీడీల రూపంలో సమర్పించారు. కార్పొరేషన్ చరిత్రలో ఏకకాలంలో ఇంత భారీ మొత్తం ఆస్తి పన్ను బకాయి చెల్లించడం ఇదే మొదటిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో నరేందర్ రెడ్డి కోట్ల రూపాయల ఆస్తి పన్ను కట్టేశారు. రేపు ఎన్నికల్లో ఇంకెంత ఖర్చు చేస్తారో అని సామాన్యులు చర్చించుకుంటున్నారు.సాధారణంగా సామాన్యుల దగ్గర వందల రూపాయల పన్ను కోసం కఠినంగా వ్యవహరించే యంత్రాంగం, ఇన్నాళ్లుగా కోట్ల రూపాయల బకాయిని వసూలు చేయలేకపోవడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ఎన్నికల్లో శమంత నరేందర్ రెడ్డికి ప్రతికూలత, సానుకూలత సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Latest News