పెళ్లి కోసం ఓ యువకుడి వినూత్న యత్నం.. వైరల్‌గా ట్వీట్‌

పెళ్లి కావట్లేదని ఓ యువకుడి బాధ అతడిని వినూత్న ప్రయత్నానికి పురి గొల్పింది.

విధాత : పెళ్లి కావట్లేదని ఓ యువకుడి బాధ అతడిని వినూత్న ప్రయత్నానికి పురి గొల్పింది. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా అన్న సామెత తలపుకొచ్చిందో ఏమోగాని పెళ్లి ఆలస్యమవుతుందన్న ఆందోళన ఆ యువకుడిని వీధిలో నిలబడి పెళ్లి కావాలంటూ ప్రచారం చేసే స్థాయికి తీసుకెళ్లింది.

చీరాలలో పెళ్లి కాలేదని ఆర్య వైశ్య కులంకి చెందిన బీకామ్ గ్రాడ్యూయేట్ దేవన నీలకంఠ అయ్యప్ప కుమార్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదురుగా నిలబడి స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో తన వివరాలు పొందుపరిచి నాకు పిల్ల కావాలంటూ ప్రదర్శన పెట్టాడు.

నేనంటే ఇష్టమున్న అమ్మాయి ఎవరైన తన పేరు, మొబైల్ నెంబర్ ఇక్కడ నమోదు చేసుకుని వీలున్న రోజున తనను కలువ వచ్చని, కుల పట్టింపు లేదని, నమ్మకం లేని వారు నా వివరాలు అడగవద్దని ఫ్లెక్సీలో పేర్కోన్నాడు.

ఇష్టం లేని వారు దయచేసి నా సమయాన్ని వృధా చేయవద్దంటూ కోరాడు. తన ప్రయతాన్ని తప్పుగా అర్దం చేసుకోవద్దని, ఇది వ్యాపారం కాదంటూ రాసుకొచ్చాడు. ఈ వ్యహారంతో కూడిన ఫోటో ట్వీట్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. దీంతోనైనా ఆ పెళ్లికాని ప్రసాద్ ఓ ఇంటివాడయ్యే ప్రయత్నాలు ఫలించాలని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.