అమరావతి : అమరావతి రైతులకు వైసీపీ పార్టీ తీపి కబురు అందించింది. ఏపీలో మళ్లీ వైపీసీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తాం అని సజ్జల తెలిపారు. మూడు రాజధానులు ఆలోచన లేదని..ఇక నుంచి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుండే పరిపాలన సాగిస్తారు అని సంచలన ప్రకటన చేశారు. ఖర్చు తగ్గించి ప్రభుత్వం పై భారం తగ్గిస్తూ గుంటూరు – విజయవాడ మధ్య మహా నగర నిర్మాణానికి కృషి చేస్తాం అని వెల్లడించారు.
అమరావతి నుంచే వైసీపీ ప్రభుత్వ పాలన అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటిదాక వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మూడు రాజధానుల విధానాన్ని నెత్తికెత్తుకున్న సంగతి తెలిసిందే. పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా అన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది వైసీపీ విధానం అంటూ.. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం చట్టం చేయడం..దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ వర్గీయులు కోర్టుకెళ్లి అడ్డుకోవడం జరిగింది. వైసీపీ 2019 ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే ఎన్నికలు అయ్యాక మూడు రాజధానులు అని చెప్పి విశాఖకు పాలనను తీసుకెళ్లాలని అనుకున్నారు. 2024అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సారధిగా చంద్రబాబు తన ప్రచారంలో అమరావతి రాజధాని సమస్యను ప్రచారాస్త్రంగా మలిచారు. మేం రాజధాని లేని రాష్ట్రానికి 2014లోనే అమరావతిని ఎంపిక చేశామని, 2019 వరకు నిర్మాణాలు ప్రారంభించగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు. వైసీపీ విధ్వంసకర పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానుల నినాదం ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి..కూటమి ఘన విజయానికి ప్రధానకారణంగా నిలిచింది. జ్యూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించిన కర్నూలులోనూ… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన విశాఖలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో ప్రజలకు ఆ నినాదం నచ్చలేదని అర్థమైంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణం వేగవంతం చేసింది. అదే సమయంలో అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు’’ అంటూ సుమారు 1300 రోజులుగా దీక్షల వెనుక వైసీపీ రాజకీయం కొనసాగించింది. దానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించకపోవడంతో ఆ తర్వాత మూడు రాజధానుల నినాదం ఎత్తడం లేదు. ఇదే క్రమంలో మార్చి నెలలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల విధానానికి కాలం చెల్లిందని.. మళ్లీ పార్టీలో చర్చిస్తామని ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానుల ఆలోచన లేదని..ఇక నుంచి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుండే పరిపాలన సాగిస్తారు అని చేసిన ప్రకటనతో ఏపీలో రాజధాని అంశంలో గందరగోళానికి తెరపడినట్లేనని భావిస్తున్నారు. ఇకమీదట ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగబోతుందంటూ ఈ ప్రాంత రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.