విధాత, హైదరాబాద్ : బీ ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోన్న సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదు చేసి విచారించింది. ఈ కేసులో అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టుకు అభ్యంతరాలు తెలపాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. విచారణ ముగిసినట్టు సీబీఐ ఇప్పటికే కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. గతంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఈ కేసులో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆరోపించారు.
2007 నుంచి ఆయేషా మీరా హత్య కేసు అనేక మలుపులు తిరిగి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. 2007 డిసెంబర్ 27న విజయవాడ ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్‌లో17 ఏళ్ల బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. స్థానిక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి, 2008లో పిడతల సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 2010లో విజయవాడ మహిళా కోర్టు అతన్ని అత్యాచారం, హత్య నేరారోపణల కింద విచారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు.. 2017లో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించి, పోలీసు దర్యాప్తులో లోపాలను ఎండగట్టింది. దీంతో ఆయేషా తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2018లో హైకోర్టు ఈ కేసును రీ ఓపెన్ చేసి సీబీఐకి అప్పగించింది. అలాగే, 2014లో కేసు రికార్డులు నాశనం చేయబడ్డాయని తెలిసి, దానిపై మరో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సీబీఐ 2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి రీ-పోస్ట్‌మార్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాలను నిర్ధారించి, 2020లో ఒక నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ఇచ్చారు. 2023లో సీబీఐ ఆయేషా కుటుంబ స్నేహితుడు పుసపటి కృష్ణ ప్రసాద్, నాటి నందిగామ డీఎస్పీ ఎం. శ్రీనివాసులతో సహా పలువురిని విచారించింది. ఈ కేసులో ఏడేళ్లలో మొత్తం 266 మందిని విచారించింది.