AP Free Bus Scheme Effect : బస్సులో సీటు కోసం మహిళ..యువకుడి గుద్దులాట!

శ్రీకాకుళంలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళ, యువకుడు జుట్లు పట్టుకుని కొట్టుకున్న ఘటన వైరల్‌గా మారింది.

అమరావతి : ఫ్రీ బస్ పుణ్యమా అని ఆర్టీసీ బస్సుల్లో(RTC Buses) సీట్ల పంచాయతీతో మహిళలు జుట్లు పట్టుకుని పరస్పరం సాగిస్తున్న సిగపట్ల యుద్దాలు తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా మారిపోగా..అక్కడక్కడ మహిళలతో పురుషుల తగవులాటలు కూడా వెలుగుచూస్తున్నాయి. బస్సులో సీటు కోసం ఓ మహిళ, యువకుడు జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటన ఏపీలో వైరల్ గా మారింది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లా టెక్కలి నుండి దిమ్మిడిజోల వెళ్తున్న పల్లెవెలుగు బస్సులో ఈ గుద్దులాట చోటు చేసుకుంది. సీటు కోసం వారి మధ్య మొదలైన వాగ్వివాదం ముదిరి పరస్పరం జుట్లు పట్టుకుని కొట్టుకునేవరకు దారితీసింది. తోటి ప్రయాణికులు విడిపిస్తున్నప్పటికి లెక్కచేయకుండా శత్రువుల మాదిరిగా ముష్టిఘాతాలు..పిడిగుద్దులతో కొట్టుకున్నారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం(Free bus scheme for women) తెలుగు రాష్ట్రాలలో అమలవుతున్న సంగతి తెలిసిందే. ఉచిత బస్సు కారణంగా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయి..డబ్బులిచ్చి టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. మహిళలకు కేటాయించిన సీట్లలోనే కాకుండా బస్సులోని అన్ని సీట్లలోనూ మహిళలు ఆక్రమించేస్తుండటం…పురుషులు వారిని ప్రశ్నించడం వంటి పరిస్థితుల్లో బస్సుల్లో గొడవలు రేగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆర్టీసీ యంత్రాంగం నుంచి పెద్దగా చర్యలు కూడా ఏమి లేకపోవడంతో ప్రస్తుతానికి సీట్ల సిగపట్ల పర్వాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.