Andhra Pradesh
విధాత: ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లతో ప్రభంజనం సృష్టించిన యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ 2024లో జరగబోయే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. ఒక్క చాన్స్ అంటూ అధికారం చేపట్టిన జగన్.. సంక్షేమ పథకాలను నమ్ముకునే పాలన చేస్తున్నారు తప్ప అభివృద్ధి జోలికి వెళ్లడం లేదు.
అమ్మ ఒడి, నాడు-నేడు, వైఎస్ఆర్ మహిళా చేయూత వంటి పథకాలకే సింహభాగం బడ్జెట్ కేటాయించిన జగన్, 5 శాతం ఉన్న మద్యం ప్రియులకు మాత్రం శత్రువుగా మారాడు. నాశిరకం సొంత మద్యంతో వారి మద్దతు కోల్పోయారు. ఇక 13 శాతం ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు కొరకరాని కొయ్యగా మారారు. పీఆర్సీ కానీ, పెండింగ్ బకాయిలు చెల్లింపుకానీ, ఉద్యోగులు ఎగబడి ఫ్యాన్ ఓటేయడానికి కారణమైన సీపీఎస్ రద్దు హామీ విషయంలో కానీ తీవ్ర అసంతృప్తి పేరుకునే విధంగా చేశారు.
రైతులకు చంద్రబాబునాయుడు ఒక్కసారిగా లక్షన్నర రూపాయలు రుణ మాఫీ చేసి అనేక ప్రోత్సాహకాలు ఇస్తే.. జగన్ మాత్రం వాటన్నింటినీ తీసేసి, కేంద్రం ఇచ్చే 6 వేల రూపాయలతో కలిపి ఏటా 13 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ, మండల స్థాయి వైసీపీ నేతలకు విలువ లేకుండా చేశారు. మైనార్టీ వర్గాలు ‘మా శ్రేయోభిలాషి’ అంటూ జగన్‌ను నెత్తిన పెట్టుకుంటే.. ఆయనేమో బీజేపీ అధిష్ఠానం ముందు సాగిలపడి వారిలో అసంతృప్తికి కారణమయ్యారు.
సొంత చెల్లి, తల్లితో కూడా పంచాయితీ పెట్టుకుని కరుడుగట్టిన వైఎస్ అభిమానుల్లో కూడా చర్చకు తెరలేపారు. లెక్కకు మించిన సలహాదారులతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసేందుకు వీలు లేకుండా మొదటి నుంచి వైసీపీ సోషల్ మీడియా, కాపు నేతలతో రెచ్చగొట్టించే వ్యూహాలు జగన్‌కే నష్టం కలిగించాయి.
ఇప్పుడు జగన్‌ను ఓడించడమే పవన్ ఎజెండా అనేలా చేశారు. పోలీసు వ్యవస్థను ప్రత్యర్థి పార్టీలపై కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడానికే ఎక్కువగా వాడరాన్న చెడ్డపేరు తెచ్చుకున్నారు. సంక్షేమం తప్ప జగన్‌కు అభివృద్ధి అక్కర్లేదనే సంకేతాలతో తటస్థుల్లో అసంతృప్తికి బీజం పడింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఫ్యాన్‌కు గడ్డుకాలమే అంటూ ఆత్మసాక్షి, యోయో టీవీ సర్వేల్లో వెల్లడైంది. వైసీపీకి 42 శాతం ఓట్లు, టీడీపీ- జనసేన కూటమికి 51 శాతం ఓట్లు, బీజేపీకి 3 శాతం, కాంగ్రెస్‌కు 5 శాతం మంది ఏపీ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ సర్వేలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని చెప్పడానికి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా మారాయి.
కామెడీ పీస్‌గా వైసీపీ సోషల్ మీడియా ప్రమోట్ చేసిన నారా లోకేశ్ పాదయాత్ర ద్వారా సీరియస్ పొలిటీషియన్‌గా ప్రజల్లో గుర్తింపు పొందుతున్నారు. యువగళం పాదయాత్ర లోకేశ్‌ను ప్రజలకు దగ్గర చేయడానికి ఉపయోగపడిందని సర్వేల్లో వెల్లడయింది.
ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాల కోసం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, ఏ ఒక్క నాయకుడి సిఫారసుతో పనిలేకుండా ప్రజలకు అవసరమైన సేవలు సచివాలయాల ద్వారా అందడం, సామాజిక ఫించన్లు ఠంచనుగా ఒకటో తేదీనే లబ్ధిదారులకు చేరడం, అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల దశను మార్చిన నాడు-నేడు, మహిళా చేయూత వంటి పథకాలు జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలుగా చెప్పుకోవాలి.
కానీ రాజమండ్రి మహానాడులో చంద్రబాబునాయుడు దాదాపు ఇదే తరహా వరాలను ప్రకటించిన నేపథ్యంలో.. ఈ లబ్ధిదారులు కూడా వచ్చే ఎన్నికలలో జగన్ వెంట నడుస్తారా లేదా అన్న సందేహాలకు ఆస్కారం ఏర్పడింది. మొత్తంగా 2024 ఎన్నికలు ఏపీలో వన్‌సైడ్‌గా ఉండవనేది స్పష్టమవుతోంది. ఇరు పక్షాలు హోరాహోరీగా తలపడబోతున్న ఈ ఎన్నికల్లో ఏ ఒక్కరికి విజయం నల్లేరు మీద నడకకాదన్నది స్పష్టమవుతోంది.