– ఈనెల 20 నుంచి మార్పులు, చేర్పులకు అవకాశం
– దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా?
– ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదుతో సీరియస్?
– వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితా
విధాత: ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో శాసనసభతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాపై కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందులోభాగంగా ఈనెల 20 నుంచి ఓటర్ల జాబితాలో ఓటర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు నిండే వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
పార్టీల మధ్య ముదురుతున్న దొంగ ఓట్ల వ్యవహారం
ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల వ్యవహారం రోజుకో రచ్చకు దారితీస్తోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన నేతలు ఎన్నికల సంఘానికి రోజుకో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. వైసీపీ అక్రమ మార్గంలో దొంగ ఓటర్లను చేర్చుతూనే, మరోవైపు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు ఓట్లను తొలగిస్తోందని ఆరోపిస్తూ, ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకు సమర్పిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారుల్లో అంతగా స్పందన లేకపోవడంతో ఆయా పార్టీలు వేర్వేరుగా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి సీఈసీకి కూడా ఫిర్యాదులను అందించాయి. కొంతకాలంగా ఏపీలో ఓటర్ లిస్ట్ టాంపరింగ్ జరుగుతున్నదని కమిషనర్ కు వివరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35 వేల వరకు డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువులను ఎన్నికల సంఘం ముందు ఉంచారు. తిరుపతి ఉపఎన్నికల్లో దాదాపు 35 వేల మంది నకిలీ ఓట్లు వేశారని, అలాగే విశాఖలో భౌతికంగా లేనివారికి సంబంధించి 61వేల ఓట్లు చేర్చారని ఆరోపించారు. విశాఖపట్నం నార్త్ లో ఇంటింటి సర్వే చేయగా 2 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉంటే, అదనంగా మరో 61 వేల మంది ఓట్లు యాడ్ చేశారన్నది బీజేపీ ఆరోపణ. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని.. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. ఈక్రమంలోనే అధికార వైసీపీ కూడా దొంగ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారంటూ.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో దొంగ ఓట్ల రచ్చ ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది.
22న సీఈసీ ప్రతినిధులు రాక?
ఆంధ్రప్రదేశ్ లో ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు ఓటర్ల జాబితా వివాదాల నేపథ్యంలో ఈనెల 22, 23 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రతినిధుల బృందం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. జిల్లాలకు సంబంధించిన ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలు వంటి విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ వర్గాల సమాచారం మేరకు ఈనెల 21న సాయంత్రం కేంద్ర ప్రతినిధుల బృందం విజయవాడకు చేరుకోనుంది. 23న జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారని తెలిసింది. మరోవైపు అనుకున్న సమయం కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశముందని రాజకీయ పార్టీల నేతలు కూడా సంకేతాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను కూడా త్వరగానే ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల దొంగ ఓట్ల వ్యవహారంపై ఆరోపణల నేపథ్యంలో సీఈసీ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.