Site icon vidhaatha

CM Chandrababu Naidu | ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

chandrababu naidu

విధాత : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్‌ అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7 వేల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తున్నది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు పెన్షన్ దారులకు రూ.3 వేల చొప్పున అందుతుండగా.. సీఎం చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి రూ.4 వేలుగా చేశారు. దీంతోపాటు ఏప్రిల్‌ నుంచే పెంచిన దానిని అమలు చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ.1,000 చొప్పున కలిపి మొత్తం రూ.7 వేలు నేడు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 65.18 లక్షల మందికి పెన్షన్ పంపిణీ కోసం ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంలో మొదటగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమమని చెప్పారు. జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడిందని తెలిపారు. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ చెప్పారని, ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో నా పనితీరుతో చూపిస్తానన్నారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచనని వెల్లడించారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలు చేశామని తెలిపారు. వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉందన్నారు.

గత పాలకులు, అధికారులు సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ తమ వల్ల కాదన్నారని, నేడు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతున్నదని వెల్లడించారు. తర్వలోనే 183 అన్నా క్యాంటిన్లు ప్రారంభిస్తామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని, నిరంతరం ప్రజలకోసం పనిచేస్తాన్నారు.

Exit mobile version