– కాపులకు ఇదే సరైన సమయం
– కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
విధాత, తిరుపతి: తిరుపతి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరంజీవి పోటీచేయాలని, ఆయనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతామోహన్… చిరంజీవిని తనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని కోరతాననీ అన్నారు. ‘నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన పనిలేదు… ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. తిరుపతిలో చిరంజీవి 50 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత చింతా మోహన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.