విధాత: రాష్ట్రంలో వైకాపా పాలన తాలిబన్ల పాలనను మించిపోయిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.బుధవారం వేంపల్లె లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం రావణ కాష్టం అయిందని, ఆటవికపాలన సాగుతుందని, రాక్షస రాజ్యం, రౌడీల రాజ్యంగా తయారైందని అన్నారు.
ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. నిన్నటి రోజు ఏక కాలంలో రాష్ట్రంలోని అనేక చోట్ల టీడీపీ కార్యాలయాలపై, నాయకులపై వైకాపా శ్రేణులు దాడులు చేయడం అప్రజాస్వామ్యానికి, అరాచకానికి, రాజ్యహింసకు పరాకాష్ట అన్నారు.
డీజీపీ కార్యాలయానికి ప్రక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులను అరికట్టలేని పోలీసు వ్యవస్థ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో శాంతిభద్రతలను ఎలా కాపాడుతుందని తులసిరెడ్డి ప్రశ్నించారు. దాడులు చేసిన దుండగులు ఎవరనేది స్పష్టంగా కనిపిస్తోందని,అయినప్పటికి వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎప్పటికైనా గాంధేయవాదం , అహంసావాదం, ప్రజాస్వామ్యం గెలుస్తాయని తులసిరెడ్డి అన్నారు.