ఏపీ ఎన్నికల హింసకాండ నిందితుల రిమాండ్‌.. హైదరాబాద్‌కు జేసీ బ్రదర్స్‌

ఏపీ ఎన్నికల ఘర్షణలకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాడిపత్రి అల్లర్ల కేసులో నిందితులను ఉరవకొండ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు

  • Publish Date - May 16, 2024 / 06:40 PM IST

విధాత: ఏపీ ఎన్నికల ఘర్షణలకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాడిపత్రి అల్లర్ల కేసులో నిందితులను ఉరవకొండ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వైసీపీ, టీడీపీలకు చెందిన 90మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా వారికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. అటు శాంతిభద్రతలు..అనారోగ్య కారణాల నేపథ్యంలో జేసీ బ్రదర్స్ దివాకర్‌రెడ్డి, కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, సోదరుడు ప్రభాకర్‌రెడ్డిలను భారీ బందోబస్తు మధ్య పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు భాను కుమార్ రెడ్డి, గణపతి రెడ్డిలతో పాటు 15మందిని కోర్టులో హాజరు పరుచగా, వారికి 14 రోజులు పాటు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వారిని చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. కోర్టు వద్ద అమాయకులను కూడా కేసులో పెట్టారని బాధితుల బంధువుల ఆందోళన నిర్వహించారు. పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైసీపీ, టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను, రాళ్లను, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాచర్ల, గురజాలలో 144సెక్షన్ కొనసాగిస్తున్నారు.

గుంటూరు జిల్లా టీడీపీ నేత నక్క ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా గుంటూరు జిల్లా వసంత రాయపురంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. విశాఖలో టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో బర్మా క్యాంపు నూకాలమ్మ ఆలయం వెనుక ఉన్న ఇంట్లో ఇద్దరు మహిళలు, యువకుడిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. బాధితులకు తీవ్ర గాయాలు అవ్వడంతో కేజీహెచ్ లో చికిత్సకు తరలించారు. ఈ ఘటనలో కంచరపాలెం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

Latest News