వ్యాక్సిన్‌ సరఫరా పెంచండి: ఏపీ హైకోర్టు

అమరావతి: కొవిడ్‌ వ్యాక్సి్న్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్ల సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న కేటాయింపులపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. కొవిడ్‌ నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని […]

  • Publish Date - June 24, 2021 / 05:34 PM IST

అమరావతి: కొవిడ్‌ వ్యాక్సి్న్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్ల సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న కేటాయింపులపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. కొవిడ్‌ నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేశామని, ఒకే రోజు 13లక్షల మందికి వ్యాక్సిన్లు వేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తగినంతగా కేంద్రం నుంచి కేటాయింపులు లేకపోవడం వల్ల అందరికీ వేగంగా వ్యాక్సిన్‌ వేయలేని పరిస్థితి నెలకొందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా ఏపీకి తగిన కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల తీవ్రత, ఇంజెక్షన్ల కొరతను అమికస్‌ క్యూరీ ప్రస్తావించారు. రాష్ట్రంలో మొత్తం 3,067 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 232 మరణాలు నమోదయ్యాయని, ప్రస్తుతం 1,528 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు క్రియాశీలంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆంపోటెరాసిన్‌-బి ఇంజెక్షన్లతోపాటు ప్రత్యామ్నాయ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల సరఫరా చర్యలపై సమగ్ర వివరాలివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చే నెల 7కి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.