(సూరత్ బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ)
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం వివాదాస్పదంగా మారుతోంది. ఈ చట్టం అమలుల్లోకి రాలేదని ప్రభుత్వం చెబున్నా.. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27, గత ఏడాది అక్టోబర్ 2023 నుండి అమలుల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం జీవో 572 విడుదల చేసింది. భూ వివాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించే అధికారాలను, భూ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారాలను మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులు, సివిల్ కోర్టుల నుంచి తొలగిస్తున్నట్లు ఈ చట్టం పేర్కొంటోంది. ఈ చట్టంలో లోపాలు ఉన్నాయని, సెక్షన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త చట్టంలో పొందుపరిచిన అంశాలు పరిశీలిస్తే ఈ చట్టం పూర్తిగా సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. తనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ వద్దకు వెళ్ళే అవకాశాలను నిర్వీర్యం చేయడం అంటే సాధారణ పౌర హక్కులకు భంగం వాటిల్లినట్లేనని చెబుతున్నారు.
ఈ చట్టం రాజ్యాంగానికి కూడా పూర్తి వ్యతిరేకంగా, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సివిల్ కోర్టులు భూ వివాదాలకు సంబంధించిన కేసులను తీసుకోక పోవడంతో న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు. కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ చట్టం అమలు కావడం లేదని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అందరి నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం తడబాటుకు గురైంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చట్టాన్ని అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సివిల్ కోర్టులు భూ వివాదాల కేసులు తీసుకోవాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ చట్టం వల్ల రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, రైతులకు సమగ్ర హక్కుల భూ రికార్డు తయారవుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ చట్టం ఏమిటి ? ఎందుకోసం, ఎవరి కోసం ఈ చట్టం తీసుకువచ్చారు? లోతుల్లోకి వెళ్లి పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లోని నీతి ఆయోగ్ నూతన భూ చట్టాన్ని ప్రతిపాదించింది. భూమి యాజమాన్య హక్కుల చట్టం నమూనా రూపొందించింది. అన్ని రాష్ట్రాలు చట్టాలు చేయాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందడంతో అక్టోబర్ 31 నుండి అమలుకు పూనుకున్నది. కేంద్ర ప్రభుత్వం నమూనా చట్టం రూపొందించే క్రమంలో కొన్ని నిర్ధారణలు ప్రకటించింది.
1. దశాబ్దాల పాటు (సగటు 20 సంవత్సరాలు) సాగుతున్న కోర్టు లిటిగేషన్లను అరికట్టి మూడు సంవత్సరాలలో ప్రజలకు వివాదాలు లేని రికార్డు తయారు చేయడం.
2. ప్రభుత్వానికి, పెట్టుబడిదారులకు, మౌలిక సదుపాయాలు కల్పించే వారికి అవరోధాలు లేకుండా చూడడం- భూమి మార్కెట్‌ను అభివృద్ధి పరచడం.
3. పట్టణ, గ్రామీణ సంస్థల ఆదాయాలు పెంచడం.
4. సన్న, చిన్నకారు రైతులకు పరపతి కల్పించడం.
5. పట్టణీకరణలో పెరుగుతున్న గృహ అవసరాలు తీర్చడం.
6. బినామీ ట్రాన్సాక్షన్లు, బ్లాక్ మనీని అరికట్టడం.
ఈ అంశాలను సాధించాలంటే అన్ని రాష్ట్రాలు చట్టం చేయాలని కేంద్రం పేర్కొన్నది. అలా ఏపీ ప్రభుత్వం కూడా చట్టం చేసి అమలులోకి తెచ్చింది. రూల్స్ విడుదల చేయవలసి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన చట్టం చూస్తే పైన చెబుతున్న ఏ ఒక్క లక్ష్యమూ నెరవేరక పోగా, కార్పొరేట్లకు, బడా వ్యాపారస్తులకు, రాజకీయ పలుకుబడి కలిగిన వారికి మాత్రమే ఉపయోగపడేదిగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత వందేళ్ళుగా దేశవ్యాప్తంగా భూముల రీ సర్వే ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ జరుగలేదు. ఫలితంగా అనేక భూ సమస్యలు ఏర్పడి వివాదాలకు కారణమవుతున్నాయి. వీటి పరిష్కారంతోపాటు భూముల సర్వే చేసి రికార్డులు అన్నింటినీ కంప్యూటరీకరణ చేయాలని కేంద్రం గత పదేళ్ళుగా చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు భూ రికార్డుల ఆధునీకరణ ప్రారంభించారు. గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే భూముల రీసర్వే పూర్తి చేయగా, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రీ సర్వే కార్యక్రమాలు చేపట్టాయి. ఏపీ ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రారంభించి ఈ మూడేళ్ళలోనే పూర్తి చేయాలని భావించింది. అయితే.. భూ సర్వే పేరిట ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు.
2013 భూసేకరణ చట్టానికి విరుద్ధం
ఈ చట్టంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ ప్రాధికార సంస్థ అధికారాలను పరిశీలిస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భూసేకరణ చట్టం 2013’కు పూర్తి వ్యతిరేకంగా ఉంది. 2013 భూసేకరణ చట్టం కింద భూములను కోల్పోయే బాధితులకు నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణం విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎంతో మెరుగైన ప్రయోజనాలను అందించింది. సేకరించే భూమి మార్కెట్ విలువ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్ల వరకూ, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్ల వరకూ అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని సూచిస్తోంది. పట్టణాభివృద్ధి కోసం సేకరించినట్లయితే, ఆ భూమిని అభివృద్ధి చేసి యజమానులకు 20% భూమి ఇవ్వాలి. పరిశ్రమల్లో 25% వాటా ఇవ్వాలి. ప్రైవేటు ప్రాజెక్టుల కోసం భూమిని తీసుకుంటే 70%, ప్రైవేటు సంస్థల కోసం తీసుకుంటే 80% ప్రభావిత కుటుంబాలు సమ్మతి తెలిపితేనే భూసేకరణ మొదలు పెట్టాలి. ఇలాంటి ఎన్నో అంశాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఇప్పడు ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త చట్టంలో భూ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి విశేషమైన అధికారాలను కల్పించారు. భూ యజమానుల అంగీకారం లేకుండానే ఈ సంస్థ బలవంతంగా భూములను సేకరించే అధికారాలను కట్టబెట్టారు. ఈ కొత్త చట్టం అమలుకుగాను మూడు స్థాయిలలో 1. భూమి రిజిస్ట్రేషన్ అధికారి, 2. అప్పిలేట్ అధికారి, 3 భూమి ప్రాధికార సంస్థ నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. భూ సర్వే పూర్తయిన ప్రాంతాలలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, భూ సర్వేలో జరిగే తప్పిదాలపై న్యాయం కోరే అవకాశాన్ని మాత్రం ప్రజలకు దూరం చేస్తోంది.
రెండేళ్లుగా భూముల సర్వే
రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి భూముల సర్వే జరుగుతున్నది. సర్వేయర్ల ద్వారా కాకుండా డ్రోన్ల ద్వారా సర్వే చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా శాటిలైట్ ఆధారిత చిత్రపటాలను తయారు చేసి, భూ అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సంఖ్యల ఆధారంగా భూ కమతాల చిత్రపటాలు తయారు చేయడం, విస్తీర్ణాలు లెక్కించడం చేస్తున్నారు. గ్రామ కంఠాలు, మంద బయళ్ళు, పట్టణ ప్రాంతాల నివాస భూములను కూడా సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో సరిహద్దులు సక్రమంగా రావడం లేదని, వాస్తవ విస్తీర్ణానికి, డ్రోన్‌లు చూపిస్తున్న విస్తీర్ణానికి పొంతన ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కానీ, వీటిని సవరించకుండానే సర్వే పూర్తయిన గ్రామాలలో పట్టాదారు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. గ్రామ సభలను పెట్టి భూముల పత్రాలు సేకరించడం తప్ప ఇతర ఏ స్థాయిలోనూ రైతులకు ప్రయేయం లేకుండానే సర్వే జరిగిపోతోంది. చాలా చోట్ల సర్వే రాళ్ళు పాతే ప్రక్రియ కూడా జరగడం లేదని తెలుస్తున్నది.
గుట్టు చప్పుడు కాకుండా సర్వే
భూముల సర్వే కార్యక్రమం అంతా పూర్తిగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూమి మీద పరిశీలన అనేది నామమాత్రంగా కూడా సాగడం లేదని రైతులు అంటున్నారు. భూ సర్వే పేరిట అన్ని పత్రాలపై ముందే సంతకాలు సేకరించి రైతులకు ఏ మాత్రం తెలియకుండానే కమతాల చిత్రపటాలు తయారు చేసేసి, కొత్తగా పట్టాలు ఇస్తున్నారని అంటున్నారు. కమతాల విస్తీర్ణం నమోదు చేయడంలో సర్వేయర్లదే ఇష్టారాజ్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. శాటిలైట్ ఆధారిత భూ అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సంఖ్యల ఆధారంగా భూ కమతాల చిత్రపటాలు తయారు చేయడం, విస్తీర్ణాలు లెక్కించడంలోనే తప్పులు దొర్లుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. సరిహద్దులు మారిపోతున్నాయని, ఇప్పుడు ఉన్న పొలం గట్లు దాటి పక్క పొలాల్లో రాళ్ళు పాతుతున్నారని, వాటి వలన భూ వివాదాలు భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాటిని సరిదిద్దే వారు కూడా కనిపించడం లేదని, కలెక్టర్, ఆర్డీఒ, ఎమ్మార్వో, సర్వే ఎడి, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఇలా ఎవరి వద్దకు వెళ్లినా రికార్డుల సవరణ జరగడం లేదని వాపోతున్నారు. భూమి నష్టపోయిన రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కొత్త చట్టం వలన కనీసం కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా లేకపోతే ఇక తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ పార్సిల్‌లో ఉన్న రైతులందరికీ జాయింట్ పట్టాలు ఇస్తున్నారని, క్రయ విక్రయాలకు బ్యాంక్ తనఖాలకు అందరి ఆమోదం కావాలన్న షరతు ఉన్నదని విమర్శలు వచ్చాయి.
భూమి రిజిస్ట్రేషన్ అధికారి ఎవరు?
భూమి రిజిస్ట్రేషన్ అధికారిగా స్థానిక తహసీల్దార్ (ఎమ్మార్వో)లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంచార మొబైల్ తహశీల్దార్‌గా మరొకరిని నియమించారు. ప్రస్తుతానికి భూ రిజిస్ట్రేషన్ అధికారిగా తహసీల్దార్‌లను నియమించినప్పటికీ చట్టంలో మాత్రం భూ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరిని నియమిస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఫలితంగా ఎవరినైనా భూ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించవచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సర్వే పూర్తయిన క్రమంలో గ్రామాలలో రిజిస్ట్రేషన్ అధికారి రికార్డులలో నమోదు చేయాలి.
భూమి కలిగిన యజమాని నివాస గృహం లేదా స్థలం కలిగిన యజమాని తమకు ఉన్న హక్కు పత్రాలను రిజిస్ట్రేషన్ అధికారికి అందించాలి. అన్నీ సక్రమంగా ఉంటే నమోదు చేస్తారు. కోర్టు లిటిగేషన్ ఉన్నా, సరిహద్దు వివాదం ఉన్నా, దాయాదుల తగాదాలు ఉన్నా రిజిస్ట్రేషన్ అధికారికి రాతపూర్వకంగా ఇవ్వాలి. ఈ వివాదాలన్నీ రిజిస్టర్‌లో నమోదు చేసి అప్పిలేట్ అధికారికి తెలియజేస్తారు
పాసు పుస్తకం ఇచ్చినా రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర పత్రమే చెల్లుబాటు
రైతుకు పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చినా రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర డిజిటలైజ్ చేసినదే చెల్లుబాటు అవుతుంది. ఇది మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఇది రైతుకు ఏ మాత్రం క్షేమకరం కాదు. రైతుకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకం అధికార పత్రంగా ఉండాలి. రికార్డు అయిన రెండు సంవత్సరాల లోపల ఎవరైనా అప్పీలు అధికారికి అభ్యంతరం దాఖలు చేయవచ్చు. నిరూపణ అయ్యేవరకు పెండింగ్‌లో ఉంటుంది. చట్టంలోని 64వ క్లాజు ప్రకారం నిరూపించుకోలేకపోతే ఆ రైతుకు లేదా స్థల యజమానికి ఆరు మాసాల జైలు, రూ.50 వేలు జరిమానా విధించవచ్చు.
అప్పిలేట్ అధికారి
జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని అప్పిలేటు అధికారిగా నియమిస్తారు. రిజిస్ట్రేషన్ అధికారుల నుండి వచ్చిన, నేరుగా రైతులు లేదా ఇతరుల నుండి వచ్చిన ఫిర్యాదులను ఈ అధికారి విచారించి తీర్పు వెలువరిస్తారు. రెండేళ్ల వ్యవధిలో తీర్పులు ఇవ్వాలి. అప్పిలేట్ అధికారి ఇచ్చిన తీర్పు అంగీకారం కాకపోతే హైకోర్టుకు వెళ్ళాలి. జూనియర్, సీనియర్ సివిల్ కోర్టులకు, జిల్లా కోర్టులకు వెళ్ళకూడదు. సివిల్ కోర్టులు, జిల్లా కోర్టులు కలుగజేసుకోకూడదు. సన్న చిన్నకారు రైతాంగం హైకోర్టు దాకా వెళ్లలేరు. వెళ్లినా భూ మాఫియా ముందు నిలువలేరు. రైతాంగానికి న్యాయం అందని ద్రాక్షపండే అవుతుంది. భారత రాజ్యాంగంలోని నాలుగు మూల స్తంభాలలో న్యాయస్థానం. ఒకటి తమకు అన్యాయం జరిగినప్పుడు కోర్టును ఆశ్రయించడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే డివిజినల్, జిల్లా న్యాయస్థానాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు..
భూ ప్రాధికార సంస్థ
రాష్ట్ర స్థాయిలో ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం భూ ప్రాధికార సంస్థను నియమించింది. సీసీఎల్‌ఏ చైర్మన్‌గాను, సర్వీస్ సెటిల్‌మెంట్ కమిషనర్‌ను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్ సభ్యులుగా భూ ప్రాధికార సంస్థను ఏర్పరిచింది. ఈ సంస్థకు చట్టం రెండు కర్తవ్యాలను నిర్దేశించింది.
1. స్థిర చరాస్తులను సంపాదించడానికి, కలిగి ఉండడానికి, ఆస్తికి మార్కెట్‌ను సృష్టించి వ్యయం చేయడానికి దావా వేయడానికి అవకాశం ఇచ్చింది.
2. దస్తావేజులకు, లైసెన్సులకు సంబంధించిన సమాచారం కోసం ఫీజులు నిర్ణయించి వసూలు చేయడం, ప్రభుత్వం నుండి లేదా సంస్థల నుండి సహాయం, గ్రాంట్లు, దానాలు, చందాలను, బహుమతులను, ధర్మాదాయములను స్వీకరించవచ్చు అని 5వ అధ్యాయం 30, 31 క్లాజులలో స్పష్టంగా పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం భ్రూక్రయ విక్రయాలపైన, కట్టడాల పైన, లైసెన్సులపైన ఫీజులు పెంచడం, వసూలు చేయడం, ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు వాటాలు పంచడం చేస్తుంది. ఇప్పటికే ఆస్తుల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం వల్ల సన్న, చిన్నకారు రైతాంగం, పేద, మధ్యతరగతి గృహ, స్థల యజమానులు భరించలేనంతగా ఉన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు భూములను కార్పొరేట్ కంపెనీలకు, రియల్టర్లకు అమ్మే అధికారం
ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను సమీకరించడం, వాటిని కార్పొరేట్ కంపెనీలకు, రియల్టర్లకు అమ్మే అధికారం పొందింది. అందుకు అనుగుణంగానే ఈ చట్టం ఆమోదించిన వెంటనే రాష్ట్రంలో 15 లక్షల 56 వేల మంది దగ్గరున్న 26 లక్షల ఎకరాల బంజరు భూములపై ఉన్న నిషేధాన్ని 35వ నెంబర్ జీవో ద్వారా ఎత్తివేసింది. ఇటీవల కాలంలో షరతులతో దళితులకు, గిరిజనులకు ఇచ్చిన బీ ఫారం భూములను సైతం భూ ప్రాధికార సంస్థ స్వాధీనం చేసుకునే అవకాశం కలిగింది. సహాయం, దానాలు, చందాలు, బహుమతులు ఇవ్వగలిగిన కార్పొరేట్ కంపెనీలకు పేదల భూములు గుంజుకోవడానికి రాజమార్గం ఏర్పడింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్పొరేట్ కంపెనీలకు పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, పర్యాటక సంస్థల పేరిట వేల ఎకరాల భూములను ధారాదత్తం చేయడం వివాదాస్పదం అయిన విషయం విదితమే. ఈ భూముల పందేరం కారణంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి అనేక ఆరోపణలు ఎదుర్కొని పలు కేసులను ఎదుర్కొంటున్నారు. కానీ, ఇప్పడు అటువంటి వివాదాలు ఏమీ లేకుండా భూములను ఇష్టానుసారం పంపిణీ చేసే అధికారాన్ని ఈ సంస్థకు కట్టబెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదానీ, అంబానీల వంటి కార్పొరేట్ కంపెనీలకు గిడ్డంగుల నిర్మాణానికి, వ్యాపార కారిడార్లు ఏర్పరచుకోవడానికి ఈ చట్టం బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భూ ప్రాధికార సంస్థకు అధికారాన్ని కట్టబెట్టడం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమేననడంలో ఎటువంటి సందేహం లేదని, అందుకే ఈ భూ హక్కుల చట్టం రద్దుకు పోరాడవలసి ఉందని స్పష్టం చేస్తున్నారు.